
సాక్షి, ఆసిఫాబాద్ : గిరిజన ఖిల్లాలో గిరిజనేతరుల ఓటు బ్యాంకు అభ్యర్థుల గెలుపోటములకు కీలకం కానున్నాయి. జిల్లాలో ఉన్న రెండు నియోజకవర్గాల పరిధిలో గిరిజనేతరులు అధిక సంఖ్యలో ఉన్నా రు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో వీరి మొగ్గు ఎటువైపు ఉంటే అటు విజయావకాశాలు ఎక్కువ. దీంతో గిరిజనేతరుల ఓటుబ్యాంకు కోసం అన్ని రాజకీయ పార్టీలు వారిని మచ్చిక చేసుకోవడం ప్రారంభించాయి. అయితే వీరంతా ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారనేది ఆసక్తికరంగా మారింది. జిల్లాలో ప్రస్తుతం కొత్త జాబితా ప్రకారం మూడున్నర లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. ఇందులో ఎస్టీ ఓటర్లు సగం వరకు ఉంటే, అందులో ఎస్సీ, బీసీ, ఓసీ సామాజిక వర్గాలు దాదాపు సగానికి పై గా ఉండే అవకాశం ఉంది. దీంతో ఈ వర్గాల ఓటుబ్యాంకు అభ్యర్థుల గెలుపునకు కీలకం కానుంది.
అవకాశాలు తక్కువ..
జిల్లాలో ఎస్టీ రిజర్వుడ్ స్థానమైన ఆసిఫాబాద్ నియోజకవర్గంలో, జనరల్ స్థానమైన సిర్పూర్ నియోజకవర్గంలోని ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజన గూడేల్లో ఇక్కడి గిరిజనులతో మమేకమై జీవనం సాగిస్తున్న గిరిజనేతరులకు మైదాన ప్రాంతంతో పోలిస్తే ఇక్కడ అవకాశాలు తక్కువ. అన్నింటా ఎస్టీ రిజర్వుడు ఉండడంతో ఇక్కడి వారికి సౌకర్యాలు అంతంతే. భూ యాజమాన్యం 1/70 చట్టం ప్రకారం 1970 కంటే ముందున్న సాగు భూములకు మాత్రమే యాజమాన్యం బదిలీ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం అనేకమంది గిరిజనేతరలు జిల్లావ్యాప్తంగా ఉన్నప్పటికీ వారు కేవలం సాగుదారులుగా మిగులుతారు కానీ పట్టా పొందే అవకాశం లేదు. భూ క్రయ విక్రయాలు జరిగే అవకాశం కూడా లేదు. గతంలో ఆసిఫాబాద్ నియోజకవర్గ పరిధిలోని జైనూర్, సిర్పూర్(యూ) మండలాల్లో గిరిజనేతరులకు పహాణీలు పంపిణీ చేయడంతో పెద్ద ఎత్తున నిరసనలు వచ్చాయి. దీంతో వెంటనే రెవెన్యూ అధికారులు వెనక్కి తగ్గారు. ఇక అనాదిగా ఈ ప్రాంతంలో ఉన్న వారికి రాజకీయ అవకాశాలు తక్కువే కాబట్టి రిజర్వు స్థానాల్లో వీరంతా ఓటుబ్యాంకుగానే మిగిలిపోయారు. ఇటీవల పూర్వం నుంచి ఈ ప్రాంతంలో ఉండే గిరిజనేతరులకు కూడా అవకాశాలు కల్పించాలని డిమాండ్లు వచ్చినప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు. ఏజెన్సీ ప్రాంతంలో ఉండే గిరిజనులకే అన్నింట్లో మొదటి ప్రాధాన్యత ఉండడంతో గిరిజనేతరులకు అవకాశాలు తక్కువగా ఉంటాయి. అయితే వీరి ఓటుబ్యాంకు మాత్రం రానురాను పెరుగుతూ ప్రస్తుతం ఎస్టీలతో సమాన స్థాయికి చేరింది. ఉదాహరణకు జిల్లా కేంద్రమైన ఆసిఫాబాద్‌లో గిరిజనేతరులు ఎక్కువ. ఇక్కడ గత కొన్నేళ్లుగా వలసలు పెరగడంతో ఓటర్ల సంఖ్య కూడా పెరుగుతోంది. దీంతో అన్ని రాజకీయ పార్టీలు గిరిజనేతర ఓటుబ్యాంకుపై దృష్టి పెట్టాయి.
కుల సంఘాలకు తాయిలాలు
ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో ఉన్న గిరిజనేతర ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి అన్ని పార్టీ అభ్యర్థులు తాయిలాలకు తెరలేపారు. గిరిజనేతరుల్లో అధికంగా ఉన్న బీసీల్లో ఒక్కో కుల సంఘాల నాయకులతో చర్చలు జరిపి సంఘ భవనాలు నిర్మిస్తామని, అన్ని సౌకర్యాలు కల్పిస్తామని మాటిస్తూ ఓటర్లను ఆకర్షిస్తున్నారు. ఇక ఎస్సీలు, మైనార్టీలను కూడా ఇదే తరహాలు కమ్యూనిటీ హాళ్లు, కులవృత్తులకు ప్రోత్సాహాకాలు, కుల సంఘ భవనాలు నిర్మించి ఇస్తామంటూ గాలం వేస్తున్నారు. కులసంఘాలు డిమాండ్ల మేరకు పార్టీలు తమ మేనిఫెస్టోల రూపకల్పనలో కూడా పలు అంశాలను చేర్చేలా అధిష్టానాల దృష్టికి తీసుకెళ్లి వీలైనంత వరకు గిరిజనేతర ఓటర్లను ఆకర్షించే పనిలో ఉన్నారు.
జిల్లాలో జనాభా (సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం)
మొత్తం జనాభా 5,39,579
ఎస్టీలు 1,59,817
ఎస్సీలు 86,829
బీసీలు 2,35,205
ఇతరులు 57,728
మైనార్టీలు 49,304