నిజంగానే ‘పీపుల్స్‌ పల్స్‌’ పట్టేసింది..! | Peoples Pulse Political Research Organisation Conducting Political Studies In India | Sakshi
Sakshi News home page

Published Sat, Dec 15 2018 5:51 PM | Last Updated on Sat, Dec 15 2018 7:38 PM

Peoples Pulse Political Research Organisation Conducting Political Studies In India - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసి.. కేసీఆర్‌ మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం కూడా చేశారు. ఇకపోతే ఎన్నికలు పూర్తికాగానే.. జాతీయ మీడియా నుంచి.. స్థానిక మీడియా దాకా ప్రతి ఒక్కరు ఫలితాలను అంచనా వేసే​ ప్రయత్నం చేశారు. జాతీయ సర్వేలతో పాటు ఇక్కడి సర్వే సంస్థలు కూడా తెలంగాణలో టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తుందని చెప్పగా.. కేవలం లగడపాటి మాత్రం కూటమి గెలుపు ఖాయమని బల్లగుద్ది మరీ చెప్పారు. ఆయన జోస్యం తప్పింది.

ఈ క్రమంలో హైదరాబాద్‌కు చెందిన రాజకీయ పరిశోధన సంస్థ ‘పీపుల్స్‌ పల్స్‌’ నిజంగానే ప్రజల నాడిని పట్టే ప్రయత్నం చేసి 90 శాతం వరకూ కచ్చితమైన ఫలితాలను అందించినట్లు రీసర్చ్‌ అసోసియేట్‌​ ఎస్‌ బాల నరసింహారెడ్డి తెలిపారు. పీపుల్స్‌ పల్స్‌ మాత్రమే దేశవ్యాప్తంగా గుణాత్మక, పరిమాణాత్మక సర్వే నిర్వహించిందన్నారు. గత తొమ్మిదేళ్లుగా దేశ వ్యాప్తంగా క్షేత్ర స్థాయి నుంచి స్టడీ చేస్తున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. ఈ ఎన్నికల సందర్భంగా పీపుల్స్‌ పల్స్‌ జమ్ము-కశ్మీర్‌తో సహా ఈశాన్య రాష్ట్రాలు, ఉత్తర, దక్షిణ భారతదేశమంతటా మూడ్‌ సర్వేతో పాటు ప్రీ పోల్‌ సర్వేను కూడా నిర్వహించినట్లు తెలిపారు. ఈ క్రమంలో తాము అత్యంత కచ్చితమైన సమాచారాన్ని అందించినట్లు నరసింహారెడ్డి పేర్కొన్నారు. పీపుల్స్‌ పల్స్‌ కేవలం గెలుపు, ఓటముల్నే కాకుండా వాటి వెనక ఉన్న కారణాల గురించి కూడా విశ్లేషిస్తుందని తెలిపారు.

ఈ ఏడాది జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పీపుల్స్‌ పల్స్‌ మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, మిజోరాం, తెలంగాణ రాష్ట్రాల్లో మూడ్‌ సర్వేతో పాటు ప్రీ పోల్ సర్వేని కూడా నిర్వహించినట్లు నరసింహా రెడ్డి తెలిపారు. అయితే రవాణా సౌకర్యాల కొరత దృష్ట్యా రాజస్తాన్‌లో మాత్రం ఎటువంటి సర్వే నిర్వహించలేకపోయామన్నారు. మూడ్‌ సర్వే నిర్వహించిన వారు వారాల తరబడి ఈ రాష్ట్రాల్లోని మారుమూల ప్రాంతాల్లో సంచరించారన్నారు.

పీపుల్స్‌ సర్వే వెల్లడించిన వివరాలు..



మధ్యప్రదేశ్‌లో హస్తం హవా...
మధ్యప్రదేశ్‌లో మూడ్‌ సర్వే నిర్వహిస్తోన్నప్పుడు ప్రజలు ఈ సారి మార్పు కోరుకుంటున్నట్లు స్పష్టంగా తెలిసిందన్నారు. ఇక ప్రీ పోల్‌ సర్వే ఫలితాలు  కూడా అందుకు తగ్గట్లుగానే వచ్చాయి. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ దాదాపు 41. 6 శాతం ఓట్లతో దాదాపు 116 - 120 గెలుస్తుందని అంచాన పీపుల్స్‌ పల్స్‌ అంచనా వేసిందని తెలిపారు. దాని ప్రకారమే మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ దాదాపు 40.9 శాతం ఓట్లతో 114 స్థానాల్లో గెలపొందింది. అయితే రైతుల్లో ఉన్న అసంతృప్తే బీజేపీ ఓటమికి ప్రధాన కారణంగా నరసింహా రెడ్డి పేర్కొన్నారు. అలానే బీఎస్పీ కేవలం 0 - 2 స్థానాల్లో గెలుపొందుతుందని చెప్పగా నిజంగానే ఈ ఎన్నికల్లో బీఎస్పీ కేవలం 2 స్థానాలకే పరిమితమయ్యింది.



ఛత్తీస్‌గఢ్‌లోనూ లెక్క తప్పలేదు...
ఛత్తీస్‌గఢ్‌లో 41శాతం ఓట్లు గెల్చుకుని కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందని పీపుల్స్‌ పల్స్‌ నివేదించింది. అలానే జేసీసీ, బీఎస్పీ రెండు కలిసి 11 శాతం ఓట్లను సాధిస్తాయని.. ఈ రెండు కూడా బీజేపీకి కీడు చేస్తాయని ప్రకటించింది. వాస్తవంగా కూడా అదే జరిగింది. ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌ 43 శాతం ఓట్లు గెల్చుకుని అధికారంలోకి రాగా.. జేసీసీ, బీఎస్పీ కూటమి 10. 9 శాతం ఓట్లు సాధించింది. అయితే పీపుల్స్‌ పల్స్‌ చెప్పినట్లు జేసీసీ, బీఎస్పీ కూటమి బీజేపీకి బాగానే హాని చేశాయి. ఇక మావోయిస్ట్‌ ప్రభావిత ప్రాంతాల్లో కూడా కాంగ్రెస్‌కు మంచి ఫలితాలు వచ్చాయి.


తెలంగాణలో కారుకు నో బ్రేక్‌...
ఇక తెలంగాణ విషయానికొస్తే.. ఇక్కడ 2018, అక్టోబర్‌ నాటికే మూడ్‌ సర్వేతో పాటు ప్రీ పోల్‌ సర్వే కూడా నిర్వహించినట్లు నరసింహా రెడ్డి తెలిపారు. ఈ రెండు సర్వేల్లో కూడా టీఆర్‌ఎస్సే మరోసారి అధికారంలోకి వస్తుందని వెల్లడించాయన్నారు. అయితే టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉందని.. కానీ కేసీఆర్‌ ప్రభుత్వాన్ని ఓడించేంత వ్యతిరేకత మాత్రం లేదని సర్వేలో తెలిసిందన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సాగు, తాగు నీటి పథకాలు ప్రభుత్వం పట్ల ప్రజల్లో సానుకూల అభిప్రాయాన్ని కలిగించాయన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ ఏం చేయలేదని.. టీజేఎస్‌, వామపక్షాలు టీఆర్‌ఎస్‌ ముందు నిలవలేవని పీపుల్స్‌ పల్స్‌ పేర్కొంది.

ఈ సర్వేకు అనుగుణంగానే ఫలితాలు కూడా అలానే వచ్చాయి. టీజేఎస్‌, లెఫ్ట్‌ పార్టీలు ఖాతా తెరవకపోగా.. బీజేపీ ఒక్క స్థానానికే పరిమితమయ్యింది. ఈ సర్వేలో తెలిసిన మరో ఆసక్తికర అంశం ఏంటంటే.. రాష్ట్రంలో ఉన్న ముస్లింలు, బీసీలు కేసీఆర్‌కు పెద్ద ఓటు బ్యాంక్‌గా నిలవనున్నట్లు తెలిసింది. ముస్లింలకు నరేంద్ర మోదీ పట్ల ఆగ్రహం ఉన్నప్పటికి.. కేసీఆర్‌ మీద మాత్రం సానుకూల అభిప్రాయమున్నట్లు తెలిసిందన్నారు.


మిజోరాంలో తప్పిన అంచనా...
ఇక మిజోరాం విషయానికొస్తే కాంగ్రెస్‌, ఎమ్‌ఎన్‌ఎఫ్‌లు సమానంగా సీట్లు సాధించడంతో హంగ్‌ ఏర్పడే అవకాశం ఉన్నట్లు పీపుల్స్‌ సర్వే అంచనా వేసింది. ఇక్కడ మాత్రం పీపుల్స్‌ సర్వే అంచనాలు తప్పాయి. ఎమ్‌ఎన్‌ఎఫ్‌ మెజారిటీ స్థానాల్లో గెలుపొంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.  అయితే మిజోరాంలో కేవలం 100 ఓట్లు నాయకుల భవితవ్యాన్ని నిర్ణయిస్తాయి. కాబట్టి ఇక్కడ మాత్రం పీపుల్స్‌ సర్వే సరైన ఫలితాలు ఇ‍వ్వలేకపోయిందని నరసింహా రెడ్డి అభిప్రాయ పడ్డారు.

లోక్‌సభ ఎన్నికల సర్వే షూరూ..
చాలా కచ్చితమైన సమాచారాన్ని ఇస్తోన్న ‘పీపుల్స్‌ పల్స్‌’ ప్రస్తుతం రాబోయే 2019 లోక్‌సభ ఎన్నికల ఫలితాలను అంచనా వేసే పనిలో పడింది. ఇప్పటికే సంస్థ సభ్యులు ఒడిషా, ఆంధ్ర ప్రదేశ్‌, ఈశాన్య రాష్ట్రాల్లో పర్యటిస్తూ పని మొదలు పెట్టినట్లు నరసింహ రెడ్డి తెలిపారు. 2019,  ఫిబ్రవరి రెండో వారం నుంచి మూడ్స్‌ సర్వేని నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement