ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, నిర్మల్: ‘సార్.. మీ దగ్గర ఏ పార్టీ గెలుస్తుందనుకుంటున్నారు.. ఏ అభ్యర్థికి విజయావకాశాలు ఉన్నాయి.. ఎవరు గెలవాలని కోరుకుంటున్నారు..’ ఇలా ముక్కుమొహం తెలియనివాళ్లు ఎదురుగా వచ్చి ప్రశ్నిస్తున్నారు. స్థానికంగా ఉన్న రాజకీయ సరళిని తమ ప్రశ్నల ద్వారా రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయ పార్టీల విజయావకాశాలపై సర్వే చేసేందుకు జిల్లాలో బృందాలుగా తిరుగుతున్నారు. ఇప్పటికే నిర్మల్ జిల్లా కేంద్రంలో వివిధ ప్రాంతాలకు చెందిన బృందాలు సర్వే చేయడం ప్రారంభించాయి. ప్రముఖ ప్రాంతాలు, చాయ్ హోటళ్లు, అడ్డాల వద్ద ఉన్నవారి నుంచి రహస్యంగా వివరాలను రాబడుతున్నారు. కొంతమంది ఇంటింటికీ వెళ్లి,మహిళల అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు.
అంతటా అదే ముచ్చట..
ఎన్నికలు అనగానే సాధారణంగా ఏ పార్టీ గెలుస్తుంది.. ఏ అభ్యర్థిని విజయం వరిస్తుంది.. అనే అంశాలు ఆసక్తి రేపుతుంటాయి. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఎన్నికలపైనే చర్చ నడుస్తుంది. ఏ నలుగురు కలిసినా రాజకీయాలపైనే గంటలపాటు ముచ్చట్లు కొనసాగుతున్నాయి. ఇంట్లో వాళ్లతో, బయట మిత్రులతో, ఆఫీస్‌లో తోటి ఉద్యోగులతో, ఫంక్షన్‌లలో బంధుమిత్రులతో.. ఇలా ఎక్కడైనా ఎన్నికలపైనే చర్చ నడుస్తోంది. ఇక కొంతమంది వీరాభిమానులు ఎదుటివారు తమ పార్టీపైన విమర్శలు చేస్తే.. గొడవలకు దిగుతున్న సందర్భాలూ ఉన్నాయి.
ఆరా తీస్తూ.. చేరవేస్తూ..
ప్రజల ఆసక్తిని పట్టుకోవడానికి, అదే సమయంలో స్థానిక ఎన్నికల తీరును తెలుసుకోవడానికి పలు సంస్థలు సర్వేలను చేపడుతుంటాయి. ప్రజల నాడీని ఎన్నికలకు ముందే తెలుసుకుని ఎగ్జిట్ పోల్స్ రూపంలో అప్పటికప్పుడు ఉన్నటువంటి పరిస్థితులపైన ఫలితాలను వెలువరుస్తుం టాయి. ప్రస్తుత ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే పలు సంస్థలు సర్వే ఫలితాలను వెలువరించా యి. ఎగ్జిట్‌పోల్స్‌ను వెల్లడించేందుకు మరికొంత సమయం ఉండడంతో జిల్లాలో ఇంకా సర్వే చేస్తూనే ఉన్నారు. జిల్లాలోని నిర్మల్, ముథోల్, ఖానా పూర్ మూడు నియోజకవర్గాల్లోనూ స్థానిక పరిస్థితులపైన ఆరా తీస్తున్నారు. ఎప్పటికప్పుడూ తమ సంస్థలకు ఆన్‌లైన్‌లో చేరవేస్తున్నారు.
పార్టీలూ చేయిస్తున్నయ్..
పలు స్వతంత్ర సర్వే సంస్థలతో పాటు పార్టీలు కూడా తమదైన సర్వేలను చేయిస్తున్నట్లు సమాచారం. జిల్లాలో తమ పార్టీ పరిస్థితిని ఎప్పటికప్పుడు జనాల నుంచి రాబట్టుకుంటున్నాయని తెలిసింది. ఇందుకోసం ప్రత్యేకంగా బృందాలను రంగంలోకి దించాయి. తమ పార్టీ బలం ఎలా ఉందో తెలుసుకోవడంతో పాటు ఎదుటి పార్టీ ప్రచారం తీరు, వారి బలబలాలనూ అంచనా వేసేందుకు సర్వే ఫలితాలను ఉపయోగించుకుంటున్నాయి. గతంలోనూ ఇలాంటి సర్వేలను పార్టీలు చేయించుకున్నాయి. సర్వేలలో వెల్లడైన లోపాలను సరిదిద్దుకుంటూ విజయం కోసం వ్యూహాలకు పదును పెడుతున్నాయి.
నిర్మల్‌పైనే దృష్టి..
ప్రధానంగా జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో నిర్మల్‌పైనే సర్వే సంస్థలు ఫోకస్ చేశాయి. జిల్లా కేంద్రంతో పాటు ముందు నుంచీ రాజ కీయ కేంద్రంగానూ నిర్మల్‌కు పేరుంది. ఇక్కడ గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఎదిగిన నేతలున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ను తమ గుప్పిట్లో పెట్టుకుని రాజకీయాలు నడిపించిన చాణక్యతనూ చాటారు. ఇక ఇక్కడి ఓటర్లకు విలక్షణమైన తీర్పులను ఇస్తారన్న పేరూ ఉంది. ఈ నేపథ్యంతో పాటు ఈసారి బలమైన అధికార టీఆర్‌ఎస్‌తో పాటు ప్రతిపక్ష కాంగ్రెస్ సై అం టుంటే.. తామేం తక్కువ కాదు.. ఈసారి సత్తా చాటుతామని కమలదళం కాలుదువ్వుతోంది. ఈనేపథ్యంలో ఎన్నికలు త్రిముఖ పోరును తలపించనున్నాయి. ముగ్గురు అభ్యర్థుల మధ్య బలమైన పోటీ ఉంటుందన్న అంచనాలు వేస్తున్నారు. రాష్ట్రంలోనే నిర్మల్ నియోజకవర్గం హాట్‌టాపిక్‌గా మారింది. ఈనేపథ్యంలో సర్వే సంస్థలు పకడ్బందీగా ఓటర్ సర్వే చేయిస్తున్నట్లు తెలిసింది. ముథోల్, ఖానాపూర్‌లలోనూ సర్వేలు కొనసాగుతున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment