పదేళ్లుగా అధికారంలో ఉంటూ ప్రభుత్వ వ్యతిరేకతను తట్టుకొని హ్యాట్రిక్ కొట్టాలని హస్తం పార్టీ ఉవ్విళ్లూరుతుంటే ఆ పార్టీ చేతిలో ఉన్న చిట్టచివరి రాష్ట్రాన్ని కైవసం చేసుకొని కాంగ్రెస్ ముక్త ఈశాన్య భారత్
కలను సాకారం చేసుకోవాలని బీజేపీ తహతహలాడుతోంది. ఇక ప్రాంతీయంగా బలంగా ఉన్న మిజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్‌ఎఫ్) స్థానిక సమస్యలే అస్త్రంగా అందలం ఎక్కడానికి వ్యూహాలు రచిస్తోంది.మరి ఈ ఎన్నికల్లో మిజోలు ఎటువైపున్నారు?
1993 నుంచి మిజో ఎన్నికల్లో బీజేపీ పోటీ చేస్తున్నప్పటికీ ఇప్పటివరకు ఖాతా తెరవలేదు. గత ఎన్నికల్లో కేవలం 0.37% ఓట్లతో కమలం పార్టీ సరిపెట్టుకుంది. అయినప్పటికీ మిజోరం అభివృద్ధి అనే కార్డుని ప్రయోగిస్తోంది. ఈశాన్య రాష్ట్రాల్లో కాంగ్రెసేతర పార్టీలతో బీజేపీ ఏర్పాటు చేసిన నార్త్ ఈస్ట్ డెమొక్రాటిక్ అలయెన్స్‌లో రాష్ట్రానికి చెందిన మరో ప్రధానపక్షం మిజో నేషనల్ ఫ్రంట్ భాగస్వామిగా ఉంది. అయినప్పటికీ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు విడివిడిగానే పోటీకి దిగుతున్నాయి.
చక్మాల నియోజకవర్గాలపై బీజేపీ దృష్టి...
మిజోరం జనాభాలో అత్యధికులు క్రైస్తవులే. అలాగే 8 శాతం మంది బౌద్ధులు ఉన్నారు. వారి ఓట్లకే బీజేపీ గాలం వేసింది. చంపాయి జిల్లాలో బుద్ధ మతానికి చెందిన చక్మాల ప్రాబల్యం ఉన్న నియోజకవర్గాలపై దృష్టి సారించింది. మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత బుద్ధధన్ చక్మాను తమ గూటికి లాగేసింది. కేంద్రం అన్నివిధాలా మిజోరం అభివృద్ధికి పాటుపడుతూ నిధుల్ని విడుదల చేస్తుంటే మిజోరంలో లాల్ తన్హావాలా సర్కార్ అవినీతి మకిలితో వాటిని స్వాహా చేస్తోందంటూ ప్రచారం మొదలుపెట్టింది. నార్త్ ఈస్ట్ స్పెషల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ స్కీమ్ (ఎన్‌ఈఎస్‌ఐఎస్) కింద సదుపాయాలు కల్పిస్తామని చెబుతోంది. రియా–తిద్దిమ్ రోడ్డు నిర్మించి మయన్మార్‌తో వాణిజ్యం బలపడేలా చేస్తామంటూ బీజేపీ హామీలు గుప్పిస్తోంది.
సీఎంకూ అవినీతి మకిలి...
మిజోరంలో కాంగ్రెస్ గడ్డు పరిస్థితుల్నే ఎదుర్కొంటోంది. అయిదుసార్లు ముఖ్యమంత్రి అయిన లాల్ తన్హావాలా ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారని, కోల్‌కతాలో ఒక ఆకాశహర్మ్యాన్ని నిర్మిస్తున్నారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. మరికొందరు మంత్రులపైనా అవినీతి ఆరోపణలు ఉన్నాయి. లాల్ రోబైకా అనే ఎమ్మెల్యే ఆస్తులు ఏకంగా 2 వేల రెట్లు పెరిగిపోవడం వంటివి ఎన్నికలపై ప్రభావం చూపించే అవకాశాలున్నాయి.
కూటములే కూటములు...
మిజోరంలో స్థానిక సమస్యలైన అక్రమ వలసలు, పేదరికం, నిరుద్యోగాన్ని ప్రధాన అస్త్రాలుగా చేసుకొని చిన్నాచితకా పార్టీలు కూటములుగా ఏర్పడ్డాయి. పీపుల్స్ రిప్రజెంటేషన్ ఫర్ ఐడెంటిటీ అండ్ స్టేటస్ ఆఫ్ మిజోరం (ప్రిజ్మ్), మిజోరం చాంతూల్ పాల్ (ఎంసీపీ), సేవ్ మిజోరం ఫ్రంట్, ఆపరేషన్ మిజోరం పార్టీలు కలసి ఎన్నికలకు ముందే జతకట్టాయి. గతేడాదే జోరామ్ నేషనలిస్ట్ పార్టీ, మిజోరం పీపుల్స్ కాన్ఫరెన్స్, జోరామ్ ఎక్సోడస్ మూవ్‌మెంట్ వంటి పార్టీలన్నీ కలసి జోరామ్ పీపుల్స్ మూవ్‌మెంట్ పేరుతో కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పోటీకి సిద్ధమయ్యాయి. ఇక బీజేపీకి మిత్రపక్షమైన నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్‌పీపీ) స్థానికంగా శాఖను ఏర్పాటు చేసి ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతోంది. ఎన్ని కూటములు వచ్చినా బీజేపీ అభివృద్ధి కార్డు బయటకు తీసి ప్రచారాన్ని విస్తృతం చేస్తున్నా కాంగ్రెస్, ఎంఎన్‌ఎఫ్ మధ్యే ప్రధాన పోటీ ఉంటుందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
కాంగ్రెస్‌లో వలసల కలవరం...
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు లాల్ జిర్లియానా మిజో నేషనల్ ఫ్రంట్‌లోకి వెళుతున్నారనే ప్రచారంతో కాంగ్రెస్ పార్టీ ఆయనకు షోకాజ్ నోటీసు పంపింది. మరో మాజీ మంత్రి బుద్ధధన్ చక్మా బీజేపీలో చేరిపోయారు. ఇక ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ మరింత మంది నాయకులు కాంగ్రెస్‌ను వీడవచ్చనే వార్తలు ఆ పార్టీలో ఆందోళన పెంచుతున్నాయి. బీజేపీ తమ పార్టీపై ఆపరేషన్ ఆకర్‡్షను ప్రయోగించి నేతల్ని లాగాలని చూస్తోందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తు న్నారు. సీఎం లాల్ తన్హావాలా తన వారసుడిగా సోదరుడు లాల్ తంజారాను తీసుకురావాలనే ప్రయత్నాల్లో ఉన్నారని, కాంగ్రెస్‌లో అంతర్గత కుమ్ములాటలకు అది కూడా కారణమన్న వార్తలూ గుప్పుమన్నాయి. ఈ పరిణామాలతో కాంగ్రెస్ సంస్థాగతంగా భారీగా మార్పులు తెచ్చింది. పార్టీ మిజోరం కార్యదర్శిగా భూపేన్ కుమార్‌ను నియమించింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న లుజినో ఫలైరోని ఈశాన్య భారత్ ఇన్‌చార్జిగా నియమించింది. వాళ్లిద్దరూ 2013 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో కీలక భూమిక పోషించారు.
ఎన్నికల్లో ప్రభావం చూపించే అంశాలు...
రాష్ట్ర జనాభాలో 11 లక్షలకుపైగా ఉన్న రైతుల ఓట్లు (దాదాపుగా 70%)ఈసారి కీలకంగా మారనున్నాయి. తీవ్ర అసంతృప్తిలో ఉన్న రైతులు భూ సంస్కరణలు, మార్కెట్ వ్యవస్థను నియంత్రించడం వంటి చర్యలు చేపట్టాలనే డిమాండ్‌తో నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు.
గత పదేళ్లలో కొంత అభివృద్ధి జరిగినప్పటికీ రాష్ట్ర జనాభాలో ఇంకా 20 శాతం మంది దారిద్య్రరేఖకు దిగువనే ఉన్నారు. అలాగే 65 వేల మందికిపైగా యువత నిరుద్యోగంలో మగ్గిపోతోంది.
మయన్మార్, బంగ్లాదేశ్, నేపాల్ నుంచి అక్రమ వలసలను కట్టడి చేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికి కత్తి మీద సాములా మారింది.
మిజోరంలో పురుష ఓటర్లు 3.74 లక్షలు (48.8%) ఉండగా మహిళా ఓటర్లు 3.93 లక్షలు (51.2%) ఉన్నారు. ప్రతి వెయ్యి మంది పురు షులకు 1,051 మంది మహిళలు ఉన్నారు. కానీ ఇప్పటి వరకు రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికైన మహిళలు నలుగురే. 1987 తర్వాత 2014లో జరిగిన ఉప ఎన్నికలో ఓ మహిళ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఎన్నికల్లో ప్రాతినిధ్యం లేకపోవడం మహిళల్లో అసంతృప్తికి దారితీస్తోంది.
త్రిపుర రాష్ట్రంలోని తాత్కాలిక శిబిరాల్లో తలదాచు కుంటున్న బ్రూ గిరిజన తెగ ఎదుర్కొంటున్న సమస్యలూ ఎన్నికల అంశంగా మారాయి. 1997లో మిజోలు, బ్రూలకు మధ్య ఘర్షణలు తలెత్తాయి. దీంతో వారంతా ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయారు. ఉత్తర త్రిపురలో ఆరు తాత్కాలిక శిబిరాల్లో 32 వేల మంది బ్రూ తెగవారు నివసిస్తున్నారు. వారిని వెనక్కి తీసుకురావడానికి మిజోరం, త్రిపుర, బ్రూ తెగ సంక్షేమం కోసం పోరాడుతున్న సంస్థల మధ్య ఒప్పందం కుదిరినప్పటికీ ఇప్పటివరకు కేవలం 31 కుటుంబాల వారే తిరిగి రాష్ట్రానికి వచ్చారు.
– సాక్షి నాలెడ్జ్ సెంటర్
Comments
Please login to add a commentAdd a comment