
మోదీపై మరోసారి రాజ్‌బబ్బర్ వివాదాస్పద వ్యాఖ్యలు
జైపూర్ : కాంగ్రెస్ నేత రాజ్‌బబ్బర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాజస్ధాన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షాలను గ్యాంగ్‌స్టర్‌లుగా అభివర్ణించారు. ఉదయ్‌పూర్‌లో బీజేపీ ప్రచార ర్యాలీలో రాజ్‌బబ్బర్ మాట్లాడుతూ పేద ప్రజలను హతమార్చే హంతక ముఠా గుజరాత్ నుంచి తన కార్యకలాపాలను నిర్వహిస్తోందని ధ్వజమెత్తారు.
గ్యాంగ్‌స్టర్ ముఠాలో ఒకరు బీజేపీ చీఫ్ కాగా, మరొకరు దేశంలో అత్యున్నత పదవిలో ఉన్నారంటూ ప్రధాని మోదీని ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. రోజురోజుకూ రూపాయి విలువ దిగజారుతున్న క్రమంలో రూపాయి విలువను ప్రధాని మోదీ తల్లి 90 ఏళ్ల హీరాబెన్‌తో పోల్చడం కలకలం రేపిన సంగతి తెలిసిందే.
డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ గతంలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ వయసు స్ధాయిలో ఉంటే ప్రస్తుతం రూపాయి బలహీనపడుతూ ప్రధాని తల్లి వయసుకు క్షీణిస్తోందని రాజ్‌బబ్బర్ వ్యాఖ్యానించారు. కాగా రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు డిసెంబర్ ఏడున జరగనుండగా, డిసెంబర్ 11న ఓట్ల లెక్కింపు చేపడతారు.