
కొరియా(ఛత్తీస్‌గఢ్): అధికారంలోకి వచ్చిన 10 రోజుల్లో రాష్ట్రంలో రైతు రుణమాఫీ చేసి తీరుతామని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ పునరుద్ఘాటించారు. అందుకు అవసరమైన నిధులు నీరవ్ మోదీ, అనిల్ అంబానీ, విజయ్ మాల్యా వంటి వారి నుంచి వస్తాయని వ్యాఖ్యానించారు. ఛత్తీస్‌గఢ్‌లోని కొరియా జిల్లాలో శనివారం ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. విజయ్ మాల్యా రూ.10 వేల కోట్ల బ్యాంకు రుణాలను ఎగవేసి విదేశాలకు పారిపోయారని, నీరవ్‌మోదీ, మెహుల్ చోక్సీలు రూ. 35 వేల కోట్లతో పరారయ్యారని రాహుల్ ఆరోపించారు. పౌరసరఫరాల శాఖలో రూ. 36 వేల కోట్ల కుంభకోణానికి సంబంధించి రమణ్‌సింగ్‌పై వచ్చిన ఆరోపణలపై ప్రధాని మోదీ నోరు మెదపడం లేదని ఆరోపించారు. ఛత్తీస్‌గఢ్‌లో చివరిదైన రెండో దశలో 72 స్థానాలకు పోలింగ్ 20న జరగనుంది.