
బదౌన్/వంత్లి: తాము అధికారంలోకి వస్తే రుణం తిరిగి చెల్లించలేని రైతులను జైళ్లకు పంపబోమని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రకటించారు. యూపీలోని అమ్లా, గుజరాత్‌లోని వంత్లిలో గురువారం జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన ప్రసంగించారు. ‘వేలాది కోట్లు రుణం తీసుకుని ఎగ్గొట్టిన వ్యాపారవేత్తలను దేశం విడిచి వెళ్లేందుకు అనుమతించారు. అదే, రూ.20 వేలు అప్పు తీసుకుని చెల్లించలేని రైతులను మాత్రం జైళ్లలో పెట్టారు. ఇలా ఇక జరగదు. రుణాలు తీసుకున్న బడా వ్యాపారవేత్తలను జైళ్లకు పంపుతాం. రుణం చెల్లించలేని ఒక్క రైతును కూడా జైలుకు పంపబోం’ అని రాహుల్ హామీ ఇచ్చారు.
ధనికులకు ఒక న్యాయం, పేదలకు మరో న్యాయం ఉండరాదన్నారు. మధ్యప్రదేశ్, రాజస్తాన్‌ల్లోని తమ కాంగ్రెస్ ప్రభుత్వాలు రైతు రుణాలను మాఫీ చేశాయన్నారు. ‘ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రెండు బడ్జెట్‌లుంటాయి. ఒకటి సాధారణ బడ్జెట్ కాగా మరోటి రైతు బడ్జెట్. రైతు బడ్జెట్‌లో కనీస మద్దతు ధరలను, రైతు బీమా చెల్లించే మొత్తం కూడా ముందుగా ప్రకటిస్తాం’ అని రాహుల్ తెలిపారు. ‘కాపలాదారే దొంగ(చౌకీదార్ చోర్ హై)అని ఎస్‌పీ– బీఎస్‌పీ ఎన్నడూ విమర్శించకపోవడానికి కారణం.. ఆ రెండు పార్టీల అసలు గుట్టు మోదీ వద్ద ఉండటమే’ అని ఎస్పీ, బీఎస్పీలపై ఆరోపణ చేశారు. ‘నోట్లు రద్దు చేసిన మోదీ ప్రజల ధనాన్ని లాగేసుకున్నారు. ఆ డబ్బును కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుని, పేదల అకౌంట్లలో జమ చేస్తుంది’అని పేర్కొన్నారు.