మళ్లీ రైతు రుణమాఫీ | Rahul Gandhi Promises To Public In Bharat Jodo Yatra | Sakshi
Sakshi News home page

మళ్లీ రైతు రుణమాఫీ

Published Sat, Oct 29 2022 3:27 AM | Last Updated on Sat, Oct 29 2022 3:27 AM

Rahul Gandhi Promises To Public In Bharat Jodo Yatra - Sakshi

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా బాణాపురం డప్పు కళాకారులు ప్రదర్శన ఇచ్చిన సందర్భంగా రాహుల్‌ గాంధీ వారి వద్దకు వచ్చి ఇలా డప్పు కొట్టారు

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: ‘రైతులకు మేము అండగా ఉంటున్నాం.. గత కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో రుణమాఫీ చేశాం.. ఇప్పుడు కూడా రైతాంగానికి రుణమాఫీపై భరోసా ఇస్తున్నాం’అని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ స్పష్టం చేశారు. చేనేతలకు జీఎస్టీ ఎత్తేస్తామని, కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అటవీ హక్కు చట్టాన్ని నూటికి నూరు శాతం అమలు చేసి గిరిజనులకు భూములు, పూర్తి హక్కులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్‌ పాలనలో దళితులకు 25 లక్షల ఎకరాల భూములను ఇచ్చామని.. వాటిని రద్దు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మండిపడ్డారు.

సమస్యలకు నెలవుగా మారిన ధరణి పోర్టల్‌లో మార్పులు చేస్తామన్నారు. భారత్‌ జోడో యాత్రలో భాగంగా తెలంగాణలో రాహుల్‌ పాదయాత్ర మూడో రోజు శుక్రవారం నారాయణపేట నుంచి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని దేవరకద్ర నియోజకవర్గంలోకి ప్రవేశించింది. ఎలిగండ్ల నుంచి ఉదయం 6:05 గంటలకు ప్రారంభమైన యాత్ర మరికల్, తీలేరు, పెద్దచింతకుంట, లాల్‌కోట చౌరస్తా మీదుగా దేవరకద్ర నియోజకవర్గంలోని పెద్దగోప్లాపూర్‌ వరకు సాగింది.

అక్కడ మధ్యాహ్న భోజన విరామం అనంతరం సాయంత్రం 4:10 గంటలకు యాత్ర పునఃప్రారంభమై దేవరకద్ర పట్టణం, చౌదర్‌పల్లి గేట్‌ మీదుగా మన్యంకొండకు 6:18 గంటలకు చేరింది. అక్కడ రాహుల్‌ కార్నర్‌ మీటింగ్‌లో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ధరణితో ఉపయోగం ఏమిటని.. అధికారంలోకి రాగానే దీని ద్వారా జరిగే తప్పులను సరి చేస్తామన్నారు. మూడోరోజు 22 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగింది.

దేశమంతా ఒకే జీఎస్టీ...
నిరుద్యోగానికి ప్రధాన కారణం నోట్ల రద్దు.. లోపభూయిష్టమైన జీఎస్టీ అని రాహుల్‌ దుయ్యబట్టారు. పాదయాత్ర సందర్భంగా శుక్రవారం రాష్ట్రంలోని నేతన్నలను కలిశానని.. 18 శాతం జీఎస్టీ వల్ల ఎక్కువగా నష్టపోతున్నామని వాళ్లు తన దృష్టికి తీసుకొచ్చారని చెప్పారు. జీఎస్టీ వల్ల చిన్న, మధ్యతరహా వ్యాపారులు సంక్షోభంలో కూరుకుపోయారన్నారు. కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే జీఎస్టీలో మార్పులు చేసి దేశంలో ప్రస్తుతం అమలవుతున్న ఐదు శ్లాబుల జీఎస్టీ స్థానంలో ఒకే జీఎస్టీ విధానాన్ని తీసుకొస్తామన్నారు.

బీజేపీకి టీఆర్‌ఎస్‌ సహకరిస్తోంది..
దేశంలో నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోయిందని.. తీవ్రమైన ఆర్థిక సంక్షోభం నెలకొందని రాహుల్‌ పేర్కొన్నారు. చదువుల కోసం యువత రూ. లక్షలు ఖర్చు చేస్తున్నా మోదీ పాలనలో ఉద్యోగాలు వస్తాయో రావోనన్న ఆందోళన వారిలో నెలకొందన్నారు. లక్షలాది పరిశ్రమలు మూతపడడంతో కార్మికులు ఉపాధి కోల్పోయారని చెప్పారు. దేశంలో బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు ప్రజల మధ్య ద్వేషాన్ని, హింసను ప్రేరేపిస్తున్నాయని.. అన్నదమ్ముల మధ్య కొట్లాట పెడుతున్నాయని ధ్వజమెత్తారు.

ఒకపక్క బీజేపీ హింసను, ద్వేషాన్ని ప్రేరేపిస్తుంటే.. మరోపక్క టీఆర్‌ఎస్‌ ఆ పార్టీకి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోందని దుయ్యబట్టారు. బీజేపీ, టీఆర్‌ఎస్‌ కలిసి పనిచేస్తున్నాయని.. ఈ రెండు పార్టీలు ఎన్నికల సమయంలో డ్రామాలాడుతూ ప్రజలను మోసం చేస్తున్నాయని ఆరోపించారు. తెలంగాణను ఒక రాజు పాలిస్తున్నాడని... ప్రజల భూములు, డబ్బు లాక్కోవడమే ఆయన లక్ష్యమని సీఎం కేసీఆర్‌పై రాహుల్‌ ధ్వజమెతారు.

ఇదే నిజమైన భారతదేశం..
‘జోడో యాత్రకు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తోంది. ఈ యాత్రలో ఎక్కడా ద్వేషం, హింస కనబడదు. ఇదే నిజమైన భారతదేశం’అని రాహుల్‌ పేర్కొన్నారు. ప్రజలు అందించే శక్తి, ఆప్యాయతల వల్ల తాను నిత్యం 6–7 గంటలపాటు నడుస్తున్నా అలసిపోవడం లేదన్నారు. ప్రజామద్దతుతో తన పాదయాత్ర కశ్మీర్‌ వరకు సాగుతుందన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement