సాక్షి, న్యూఢిల్లీ : మధ్యప్రదేశ్, మిజోరాంలలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. బుధవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటలకు ముగిసింది. మధ్యప్రదేశ్‌లో 65.5 శాతం పోలింగ్ నమోదవగా, మిజోరంలో 73 శాతం పోలింగ్ జరిగింది. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 230 స్దానాలకు గాను మొత్తం 2899 మంది అభ్యర్ధులు బరిలో నిలవగా 1094 మంది స్వతంత్ర అభ్యర్ధులుగా తమ అదృష్టం పరీక్షించుకోనున్నారు. కాంగ్రెస్, బీజేపీలు హోరాహోరీగా తలపడిన ఈ ఎన్నికల్లో 5.4 కోట్ల మంది ఓటర్లు ఆయా పార్టీల భవితవ్యాన్ని ఈవీఎంల్లో నిక్షిప్తం చేశారు.
వరుసగా నాలుగోసారి పాలనాపగ్గాలు అందుకునేందుకు పాలక బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఎన్నికల్లో తలపడగా, ప్రభుత్వ వ్యతిరేకతను అందిపుచ్చుకుని ఎలాగైనా అధికారంలోకి రావాలని విపక్ష కాంగ్రెస్ సర్వశక్తలూ ఒడ్డింది. ఇక మధ్యప్రదేశ్‌లో బీజేపీ నాలుగోసారి తిరిగి అధికారం చేపడుతుందని సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ధీమా వ్యక్తం చేశారు. 200 సీట్లు లక్ష్యంగా ఈసారి తమ పార్టీ పోరాడిందని, ఈ లక్ష్యాన్ని అధిగమించేందుకు తమ కార్యకర్తలు కృషిచేశారన్నారు.
మొరాయించిన ఈవీఎంలు
పోలింగ్ సందర్భంగా పలుచోట్ల సాంకేతిక సమస్యలతో ఈవీఎంలు మొరాయించాయి. మధ్యప్రదేశ్‌లో దాదాపు 100కుపైగా ఈవీఎంలను మార్చినట్టు ఈసీ వర్గాలు వెల్లడించాయి. ఈవీఎంల్లో సమస్యలు తలెత్తడంతో పలు ప్రాంతాల్లో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైందని అధికారులు తెలిపారు. కాగా సెంధ్వా అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని జాప్డి పడ్లా గ్రామంలో ఇతరులు పోలింగ్ బూత్‌ల వద్దకు వచ్చారని ఆరోపిస్తూ స్దానికులు ఆందోళనకు దిగారు. ఆందోళనకారులు రెండు బైక్‌లకు నిప్పంటించారు.
పోలింగ్ విధుల్లో అధికారుల మృతి
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ విధుల్లో భాగంగా గుణలో ఓ ఎన్నికల కమిషన్ అధికారి, ఇండోర్‌లో ఇద్దరు అధికారులు గుండె పోటుతో మరణించారు. మరణించిన అధికారులకు రూ 10 లక్షల పరిహారం ప్రకటించారు.
మిజోరంలో..
మిజోరం అసంబ్లీ ఎన్నికల్లో 73 శాతం ఓటింగ్ నమోదైంది. నాలుగు గంటలకే పోలింగ్ ముగిసినా ఓటు హక్కు వినియోగించుకునేందుకు పెద్దసంఖ్యలో ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరడంతో ఓటింగ్ శాతం మరింత పెరుగుతుందని అధికారులు పేర్కొన్నారు. 40 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.
ముఖ్యమంత్రి లాల్ తన్వాలా పోటీ చేస్తున్న సెర్చిప్ స్ధానంలో అత్యధికంగా 81 శాతం పోలింగ్ నమోదైందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి అశిష్ కుంద్రా తెలిపారు. త్రిపుర సరిహద్దులోని కన్హుమన్ గ్రామంలో త్రిపుర క్యాంప్స్‌లోని బ్రూ శరణార్ధులు 52 శాతం మేర ఓటు హక్కు వినియోగించుకున్నారని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment