ఎన్నికల ప్రక్రియలో రాజకీయ పార్టీలకు సంబంధించినంత వరకు అభ్యర్థుల ఎంపిక అత్యంత కీలకం. వందల సీట్లకు పోటీ పడే వేల మందిలో ఎవరికి టికెట్ ఇవ్వాలి... ఎవరు ఎన్నికల్లో గెలుస్తారు..అన్నది అంచనా వేయడం పార్టీలకు అంత సులభం కాదు. టికెట్ లభించని వారు తిరుగుబావుటా ఎగరేస్తే వారిని బుజ్జగించడం మరో తలనొప్పి వ్యవహారం. అభ్యర్థుల ఎంపికలో ఒక్కో పార్టీ ఒక్కో విధానాన్ని అనుసరిస్తోంది. ఈ విషయంలో భారతీయ జనతా పార్టీ చాలా కాలంగా ఒక వ్యూహాన్ని అనుసరిస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలలో కొందరిని తప్పించి వారి స్థానంలో కొత్త వారికి అవకాశం ఇవ్వడమే ఆ వ్యూహం. దీనివల్ల ప్రభుత్వ వ్యతిరేకతను కొంత వరకు అధిగమించవచ్చని కమలనాథుల ఆలోచన. నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ వ్యూహాన్నే అమలు పరిచి వరుసగా రెండు సార్లు అధికారం దక్కించుకున్నారు.
రాజస్థాన్‌లో సగం మంది ఔట్ !
త్వరలో శాసన సభ ఎన్నికలు జరగనున్న ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్య ప్రదేశ్‌లలో అభ్యర్థుల ఎంపికలో బీజేపీ ఈ వ్యూహాన్నే అమలు పరుస్తోంది. ఛత్తీస్‌గఢ్ ఎన్నికలకు సంబంధించి బీజేపీ 78 మందితో తొలి విడత అభ్యర్థులను ప్రకటించింది. సిట్టింగ్ ఎమ్మెల్యేలలో 14 మందికి ఈ సారి టికెట్ ఇవ్వలేదు. వీరిలో ఒక మంత్రి కూడా ఉన్నారు. ఛత్తీస్‌గఢ్ తర్వాత ఎన్నికలు జరగనున్న రాజస్థాన్‌లో కూడా ఈ ప్రాతిపదికనే అభ్యర్థులను ఎంపిక చేయనుంది. ఇక్కడ పార్టీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యేలలో సగం మందికి ఈ సారి టికెట్ రాకపోవచ్చని తెలుస్తోంది.
గ్యారెంటీ లేదు
కొత్త వాళ్లని పెడితే తప్పనిసరిగా గెలుస్తామన్న హామీ ఏమీ లేదు. అయితేగియితే ఘోర పరాజయాన్ని తప్పించుకోవచ్చు. రాజస్థాన్‌లో గత రెండు ఎన్నికల్లో బీజేపీ ఇదే వ్యూహాన్ని అమలుపరిచినా నూరుశాతం ఫలితం దక్కలేదు. 2008 ఎన్నికల్లో బీజేపీ 193 స్థానాల్లో పోటీ చేసింది. వాటిలో 135 చోట్ల కొత్త ముఖాలనే బరిలోకి దింపింది. అయితే, వారిలో 55 మందే గెలిచారు. ఆ ఎన్నికల్లో బీజేపీ అధికారం కోల్పోయింది. 2013 ఎన్నికల్లో బీజేపీ 92 మంది కొత్తవాళ్లకి టికెట్ ఇస్తే వారిలో 68 మంది నెగ్గారు. ఈ ఎన్నికలు బీజేపీకి అధికారాన్ని కట్టబెట్టాయి. కొత్త వాళ్లతో పాటు సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా గణనీయంగానే నెగ్గుకు రావడం ఇక్కడ విశేషం.
సాధారణంగా పార్టీ ఓడిపోతుందని అంచనా వేసిన నియోజకవర్గాల్లోనే కొత్త అభ్యర్థులకు అవకాశం ఇస్తారు. ఆ అభ్యర్థి నెగ్గితే పార్టీకి అదనపు విజయమే. ఒకవేళ ఓడిపోతే ముందే తెలుసు కాబట్టి పార్టీకి పోయేదేం లేదు. 2013 ఎన్నికల్లో ఈ కొత్త ముఖాలు అందించిన అదనపు విజయం వల్లే బీజేపీ ఈ మూడు రాష్ట్రాల్లో అధికారంలోకి రాగలిగింది. కొత్త ముఖాలంటే రాజకీయాలకు పార్టీకి మరీ కొత్త వాళ్లు కాదు. గతంలో పార్టీలో పనిచేసి గుర్తింపు పొందిన వారు, గత ఎన్నికల్లో పోటీ చేసిన వాళ్లనే ఎంపిక చేస్తారు. అంతర్గత సర్వేల ఆధారంగా సిట్టింగ్ ఎమ్మెల్యే పరపతి ఎలా ఉంది. మళ్లీ టికెట్ ఇస్తే గెలుస్తాడా లేదా అన్నది నిర్థారిస్తారు. గెలవడని తేలితే అక్కడ కొత్త వారికి అవకాశం కల్పిస్తారు. ఓటర్లు కూడా రెండు, మూడు సార్లు ఒకే వ్యక్తికి ఓటేయడానికి ఇష్టపడరు. అలాంటి చోట్ల కొత్త వారిని పెడితే గెలిచే అవకాశాలు బాగా ఉంటాయని బీజేపీ వ్యూహకర్త ఒకరు తెలిపారు.
శక్తియాప్‌తో కాంగ్రెస్ ఎంపిక
బీజేపీ కొత్త ముఖాలను దింపి గెలుపుకోసం ప్రయత్నిస్తోంటే, కాంగ్రెస్ పార్టీ బూత్ స్థాయి కార్యకర్తల అభిమతం మేరకు అభ్యర్థులను ఎంపిక చేయనుంది. ఇంత వరకు కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థుల ఎంపిక అధిష్టానం ఇష్టం మేరకే జరుగుతూ వస్తోంది. తమకు ఇష్టం ఉన్నా లేకపోయినా అధిష్టానం ఎంపిక చేసిన అభ్యర్థినే భరించాల్సి వస్తోంది. దీనివల్ల చాలా చోట్ల పార్టీ విజయావకాశాలు దెబ్బతింటున్నాయి. రాహుల్ వచ్చాకా ఈ పరిస్థితి మారింది. క్షేత్ర స్థాయిలో కార్యకర్తలు, నేతల అభ్రిపాయాల మేరకు అభ్యర్థుల్ని ఎంపిక చేయాలని, దానివల్ల విజయావకాశాలు మెరుగుపడతాయని ఆయన నిర్ణయించారు.
అంతేకాకుండా పోలింగ్ బూత్ స్థాయి నుంచీ దృష్టి పెడితే గెలుపుబాటనందుకోవచ్చని కూడా ఆలోచించారు. ఇందుకోసం శక్తి పేరుతోఒక యాప్‌ను కూడా సిద్ధం చేశారు. బూత్ స్థాయి కార్యకర్తలందరూ ఈ యాప్ ద్వారా తమ అభిప్రాయాలను పార్టీ అధిష్టానానికి(రాహుల్ గాంధీకి) పంపుతారు. పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ వాటిని పరిశీలించి ఆయా నియోజకవర్గాల అభ్యర్థులను ఎంపిక చేస్తుంది. ఇంత వరకు 4 లక్షల మంది ఈ యాప్ ద్వారా అభిప్రాయాలు పంపారని పార్టీ విశ్లేషణ విభాగం వర్గాలు తెలిపాయి.
అన్ని బూత్‌లు కవర్ అయ్యాయి..
మధ్య ప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, కర్ణాటక, గుజరాత్‌లలో ఇంత వరకు 35,82,595 మంది శక్తి యాప్‌లో రిజిస్టర్ చేసుకున్నారని, రాజస్థాన్‌లో నూరు శాతం బూత్‌లను కవర్ చేయడం జరిగిందని పార్టీ వర్గాలు తెలిపాయి. అభ్యర్థుల ఎంపిక విషయంలోనే కాక ఎన్నికల ప్రచారాంశాలుగా వేటిని తీసుకోవాలన్న అంశంపై కూడా బూత్ స్థాయి కార్యకర్త అభిప్రాయాలను తెలుసుకుని వాటి ఆధారంగా ఎన్నికల మ్యానిఫెస్టో తయారు చేయనున్నారు.
-సాక్షి, నాలెడ్జ్‌సెంటర్
Comments
Please login to add a commentAdd a comment