సాక్షి, న్యూఢిల్లీ : ఇదివరకు ఎన్నికలు సమీపిస్తున్నాయంటే కేంద్రంలోని ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు ప్రజల్లోకి వివిధ రకాలుగా చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించేవారు. ఊరు, వాడా తిరుగుతూ పార్టీ సిద్ధాంతాలు, ఆశయాల గురించి ప్రజలకు అర్థమయ్యేలా చెప్పేందుకు ప్రయత్నించే వారు. ఎక్కడికెళితే అక్కడి సమస్యలను ఏకరువు పెట్టి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పేవారు. రాజకీయ ప్రత్యర్థులను ఆడిపోసుకునేవారు. ఇంకా ప్రజల్ని ఆకర్షించేందుకు వాగ్దానాల మీద వాగ్దానాలు చేసేవారు. 2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సీన్ మారిపోయింది.
బీజేపీ నాయకులు ఏ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి వెళ్లినా ప్రధానంగా ‘హిందూత్వ’ నినాదాన్ని అందుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీని ముస్లిం పక్షపాత పార్టీ అని ఆడిపోసుకుంటున్నారు. ఆ ప్రచారాన్ని తిప్పికొట్టడంతోపాటు తాను కూడా హిందూత్వ వాదినని చెప్పుకోవడం కోసమేమో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ శివ భక్తుడిగా మారిపోయారు. ఇక ఆయన్ని జంధ్యం ధరిస్తున్న బ్రాహ్మణుడని పార్టీ వారు ప్రచారంలో పెట్టారు. అందుకని రాహుల్ గాంధీ ఏ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి వెళ్లినా ముందుగా అక్కడి హిందూ దేవాలయాలను సందర్శిస్తున్నారు.
రాహుల్ గాంధీ సోమవారం నాడు మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారానికి వెళ్లి ఉజ్జయినిలోని మహా కాళేశ్వరుడి ఆలయాన్ని సందర్శించడమే కాకుండా అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. పార్టీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర అక్కడ రాహుల్ గాంధీ గోత్రం అడిగారంటే ఆయన అగ్రవర్ణానికి చెందిన బ్రాహ్మణుడిగా ప్రచారం జరగాలనే. నెహ్రూ–గాంధీ కుటుంబాన్ని మొదటి నుంచి లౌకికవాద, ఉదారవాద కుటుంబంగానే భారత రాజకీయాల్లో గుర్తించారు. రాజీవ్‌గాంధీ, క్రైస్తవ మతానికి చెందిన సోనియా గాంధీని పెళ్లి చేసుకోవడంతో కాంగ్రెస్‌పై క్రైస్తవ ముద్ర వేసేందుకు ప్రత్యర్థి పార్టీలు ముఖ్యంగా బీజేపీ ప్రయత్నిస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించడానికి కొన్ని రోజుల ముందే రాహుల్ గాంధీ జంధ్యం వేసుకునే బ్రాహ్మణుడు కాగా, పార్టీ బాధ్యతలు స్వీకరించాక పూర్తి స్థాయి శివభక్తుడిగా మారిపోయారు.
సెప్టెంబర్ నెలలో రాహుల్ గాంధీ టిబెట్‌లోని కైలాస యాత్రకు కూడా వెళ్లి వచ్చారు. గత ఏప్రిల్ నెలలో కర్ణాటక ఎన్నికలు జరిగినప్పుడు కూడా ఆయన ఆ రాష్ట్రంలోని పలు గుళ్లూ గోపురాలను సందర్శించారు. రానున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బీజేపీ, అనుబంధ హిందూత్వ సంఘాలు అయోధ్య నినాదాన్ని అందుకుంది. ఈ విషయంలో బీజేపీని అడ్డుకునేందుకు రాహుల్ గాంధీ రామ భక్తుడిగా మారిపోయినా ఆశ్చర్య పోనక్కర్లేదు.
Comments
Please login to add a commentAdd a comment