Hindutva politics
-
బీజేపీ రికార్డు విజయం వెనక.. ముచ్చటగా మూడు కారణాలు
దేశంలోని మిగతా అన్ని రాష్ట్రాల మాదిరిగానే గుజరాత్లో కూడా సామాన్యుల్లో చాలా అంశాలపై తీవ్ర అసంతృప్తి నెలకొని ఉంది. ధరల పెరుగుదల మొదలుకుని నానా రకాల సమస్యలతో వాళ్లు కూడా సతమతమవుతూనే ఉన్నారు. ముఖ్యంగా రాష్ట్రానికి వెన్నెముకగా భావించే పాడి పరిశ్రమపై ఆధారపడ్డ అసంఖ్యాకులు ద్రవ్యోల్బణం దెబ్బకు లాభాలు సన్నగిల్లి అల్లాడుతున్నారు. వారంతా దీన్ని రాష్ట్ర బీజేపీ ప్రభుత్వ వైఫల్యంగానే చూశారు. సంపన్న సూరత్ వస్త్ర వ్యాపారుల నుంచి మధ్య గుజరాత్‌లోని నిరుపేద పొగాకు రైతుల దాకా అందరిదీ ఇదే వ్యథ, ఇదే అభిప్రాయం. అయినా సరే, బీజేపీకి ఓటేయడం మినహా మరో మార్గం లేదన్న భావన వారిలో ప్రబలంగా వ్యక్తమవడం విశేషం! 27 ఏళ్లుగా బీజేపీ అధికారంలో ఉన్నా ప్రభుత్వ వ్యతిరేకత కనిపించకపోవడం మరో విశేషం. ఇందుకు మూడు కారణాలు ప్రధానంగా కనిపిస్తున్నాయి. హిందూత్వ నినాదం, ప్రధాని మోదీ మేజిక్, విపక్ష ఓటులో చీలిక. ఈ మూడూ కలగలిసి బీజేపీకి కళ్లుచెదిరే విజయం కట్టబెట్టాయి. హిందూత్వ నినాదం హిందూత్వ రాజకీయాలు గుజరాత్లో చిరకాలంగా లోలోతులకు పాతుకుపోయాయి. నిజానికి ఎన్నికల ప్రచార సమయంలో కూడా రాష్ట్రంలో సన్నకారు పాడి రైతు మొదలుకుని పాటిదార్ పత్తి రైతు దాకా ఎవరిని కదిలించినా ద్రవ్యోల్బణం దెబ్బకు రెండు మూడేళ్లలో ఆర్థికంగా అక్షరాలా చితికిపోయామంటూ వాపోయినవాళ్లే. కానీ ఓటు మాత్రం బీజేపీకి వేయడం తప్ప ప్రత్యామ్నాయం లేదన్నది వారంతా ఏకగ్రీవంగా చెప్పిన మాట! ముస్లింల ప్రాబల్యాన్ని అడ్డుకోవాలంటే మరో మార్గం లేదన్నది వారు వెలిబుచ్చిన అభిప్రాయం. ‘‘గతంలో అహ్మదాబాద్ వెళ్లాలంటే ‘గొడవ’లేమన్నా అవుతున్నాయా అని ముందుగా వాకబు చేయాల్సొచ్చేది. కానీ సాహెబ్ (మోదీ) వచ్చాక అల్లర్లూ లేవు, సమస్యలూ లేవు’’ అని సగటు హిందూ ఓటర్లంతా చెప్పుకొచ్చారు. ఈ ముస్లిం వ్యతిరేక భావజాలం వారిలో ఇప్పటికీ ప్రబలంగా ఉంది. మతపరమైన విభజన ఆర్థిక కష్టాలను కూడా వెనక్కు నెట్టేసేంది. ఇదే బీజేపీకి శ్రీరామరక్షగా మారింది. మోదీ మేనియా సీఎంగా 13 ఏళ్లు గుజరాత్‌లోనూ, పీఎంగా ఎనిమిదేళ్లుగా కేంద్రంలోనూ తిరుగులేని నాయకునిగా మోదీ సాధించిన పేరు ప్రఖ్యాతులు కూడా ఈసారి ఫలితాలను బాగా ప్రభావితం చేశాయి. ముఖ్యంగా తటస్థ, ఎటూ నిర్ణయించుకోలేని ఓటర్లు మోదీ కరిష్మా కారణంగా బీజేపీవైపే మొగ్గినట్టు ఫలితాల సరళి స్పష్టంగా చెబుతోంది. నిజానికి అధికార బీజేపీ ఎమ్మెల్యేల అసమర్థత, అధికారుల్లో విచ్చలవిడిగా పెరిగిపోయిన అవినీతిని రాష్ట్రంలో జనం అసహ్యించుకునే పరిస్థితి ఉంది! కానీ మోదీ మేనియా వీటన్నింటినీ చాలావరకు అధిగమించేసింది. విపక్ష ఓటులో చీలిక గుజరాత్లో ఎప్పుడు బీజేపీ, కాంగ్రెస్ మధ్య సాగుతూ వచ్చిన పోరు కాస్తా ఆప్ అన్ని అస్త్రశ్రస్తాలతో రంగంలోకి దిగడంతో ముక్కోణ పోరుగా మారిపోయింది. కేజ్రీవాల్ పార్టీ ప్రధానంగా చీల్చింది బీజేపీ వ్యతిరేక ఓటునే! అంటే కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకునే!! అంతిమంగా ఇది ప్రధాన ప్రతిపక్షానికి కోలుకోలేని దెబ్బగా, బీజేపీకి అనుకోని వరంగా పరిణమించింది. ఈ కారణంగానే కమలం పార్టీ రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా రికార్డు స్థాయిలో 150 సీట్ల మార్కును దాటగలిగింది. ఏకంగా 53 శాతం ఓట్లు కొల్లగొట్టింది. మరోవైపు కాంగ్రెస్ ఓటు బ్యాంకు 41 శాతం నుంచి 27 శాతానికి పడిపోయింది. ఆప్ సాధించిన 13 శాతం ఓట్లు చాలావరకు కాంగ్రెస్‌నని దీన్నిబట్టి స్పష్టమవుతోంది. 2017లో కాంగ్రెస్ దుమ్ము రేపిన సౌరాష్ట్ర ప్రాంతాన్ని కూడా బీజేపీ ఈసారి పూర్తిగా తనవైపు తిప్పుకుంది. కానీ ఇక్కడ ఏకంగా 18 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్, ఆప్ రెండింటి ఓట్ల శాతం కలిపితే బీజేపీ కంటే ఎక్కువగా ఉండటం విశేషం! పైగా 2017లో బీజేపీకి చెమటలు పట్టించి కాంగ్రెస్‌కు చాలావరకు ఉపయోగపడ్డ పాటిదార్ ఉద్యమం వంటివేవీ ఈసారి లేకపోవడం కమలనాథులకు మరింతగా కలిసొచి్చంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
బీజేపీలో చేరితే దావూద్‌కూ మంత్రి పదవి: ఠాక్రే
ముంబై: భారతీయ జనతా పార్టీపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన నేత ఉద్ధవ్ థాకరే మరోసారి విరుచుకుపడ్డారు. బీజేపీ నకిలీ హిందుత్వ రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. ఆయన శనివారం సాయంత్రం ముంబైలో భారీ బహిరంగ సభలో మాట్లాడారు. రెండేళ్ల తర్వాత బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం బీజేపీలో చేరితే ఏకంగా మంత్రి పదవి కూడా ఇస్తారని ఎద్దేవా చేశారు. మహారాష్ట్ర నుంచి ముంబై నగరాన్ని వేరు చేసేందుకు బీజేపీ పన్నుతున్న కుట్రలు సాగవని హెచ్చరించారు. 2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో బీజేపీతో తమ కూటమి విచ్ఛిన్నమయ్యాక గాడిదలను తన్ని తరిమేశామని ఉద్ధవ్ వ్యాఖ్యానించారు. -
అభివృద్ధి మంత్రాన్ని వదిలి.. మళ్లీ ‘హిందుత్వ’ జపమెందుకో!
ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ఎందుకు తమ వ్యూహాన్ని మార్చేసి... మళ్లీ హిందుత్వ జపం చేస్తోంది. మొదట అభివృద్ధి మంత్రం పఠించి... ఎన్నికల షెడ్యూల్ వెలువడటానికి ముందే యూపీలో ప్రాంతాల వారీగా భారీ స్థాయిలో ప్రధాని చేత ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయించిన కమలదళం తీరా సెమీఫైనల్ (దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన యూపీ అసెంబ్లీకి సార్వత్రిక ఎన్నికలకు రెండేళ్ల ముందు ఎన్నికలు జరుగుతాయి కాబట్టి.. దీన్ని సెమీఫైనల్‌గా అభివర్ణిస్తారు. భారత భవిష్యత్తు రాజకీయ ముఖచిత్రాన్ని యూపీ ఫలితాలు ప్రతిబింబిస్తాయనేది రాజకీయ పండితుల అభిప్రాయం) మొదలయ్యే నాటికి ఎందుకు రూటు మార్చేసింది. మళ్లీ హిందుత్వ ఎజెండాను ఎందుకు బలంగా ఎత్తుకుంది. అభివృద్ధి మంత్రం పనిచేయడం లేదని గట్టి సంకేతాలు అందాయా? అందుకే మళ్లీ పాతపాటే ఎత్తుకుందా? యూపీలో రెండు దశల ఎన్నికలు ముగిశాక తాజా పరిస్థితి ఎలా ఉందనే దానిపై సవివర కథనం... సమాజ్‌వాదీ పార్టీ అధికారంలో ఉండగా 2013లో పశ్చిమ యూపీలోని ముజఫర్‌నగర్ జిల్లాలో జాట్లు– ముస్లింలకు మధ్య ఘర్షణలు చెలరేగాయి. 60 మంది దాకా ప్రాణాలు కోల్పోగా, వేల సంఖ్యలో జనం నిరాశ్రయులయ్యారు. ముస్లిం వేధింపులు పెరగడంతో 2014–16 దాకా కైరానా నుంచి హిందూ కుటుంబాలు అభద్రతాభావంతో భారీగా వలసవెళ్లాయి. ఈ రెండు అంశాలనూ 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయవంతంగా వాడుకుంది. మొత్తం 403 స్థానాలున్న యూపీ అసెంబ్లీలో మిత్రపక్షాలు కాకుండా ఒక్క బీజేపీయే ఏకంగా 312 సీట్లతో జాక్‌పాట్ కొట్టింది. అయితే 2022 ఎన్నికలు ఆరు నెలల ముందు నుంచే యూపీలో రాజకీయాలు శరవేగంగా మారిపోయాయి. హిందుత్వ కార్డు ఈసారి పనికిరాదనుకున్న బీజేపీ.. ముందస్తు వ్యూహంతో అభివృద్ధి మంత్రాన్ని జపించింది. ఏకంగా సుమారు లక్ష కోట్లకు పైగా విలువైన పనులకు కొబ్బరికాయలు కొట్టింది. రహదారులు, ఎయిర్‌పోర్టులు, విశ్వ విద్యాలయాలు, ఎరువుల కార్మాగారాలు దేన్నీ వదలకుండా ఓట్లను రాబట్టే ప్రధాన రంగాల్లో సుమారు లక్ష కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు రిబ్బన్కటింగ్లు చేసి, పునాదిరాళ్లు వేసింది. రెండు నెలల్లో యూపీలో 16 ర్యాలీల్లో పాల్గొన్న ప్రధాని గత ఏడాది అక్టోబర్ నుంచి జనవరి 8న ఎన్నికల షెడ్యూల్ వచ్చే నాటికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏకంగా 16 పెద్ద ర్యాలీల్లో స్వయంగా పాల్గొని ఎన్నికల హీట్‌ను పెంచే ప్రయత్నం చేశారు. కేవలం మూడు నెలల వ్యవధిలోనే మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్‌లు ప్రతి మూడు అసెంబ్లీ స్థానాల్లో రెండింటిలో ర్యాలీ లేదా రోడ్–షో నిర్వహించారు. అసెంబ్లీ స్థానాలపరంగా చూస్తే ఈ ముగ్గురూ యూపీలోని 403 సీట్లలో 68 శాతం సీట్లు అనగా 275 నియోజకవర్గాలను చుట్టేశారు.. రాష్ట్రంలోని మొత్తం 75 జిల్లాలకుగాను 47 జిల్లాల్లో 112 సభలు, ర్యాలీలు జరగగా, అందులో మోదీ 16, అమిత్ షా 20, యోగి ఆదిత్యనాథ్ 76 కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఏక్ ఔర్ ధక్కా.. కుర్చీ పక్కా! çపశ్చిమ యూపీలో సమాజ్‌వాదీ– రాష్ట్రీయ లోక్‌దళ్ జట్టుకట్టడంతో ఈనెల 10వ తేదీన పశ్చిమ యూపీలో 58 స్థానాలకు జరిగిన తొలిదశ పోలింగ్‌లో ఎస్పీ అధినేత అఖిలేశ్‌యాదవ్ నేతృత్వంలోని కూటమికి స్పష్టమైన ఆధిక్యం కనిపించింది. పశ్చిమ యూపీ 26 శాతానికి పైగా ముస్లింలు, 3.5 శాతం జాట్లు ఓట్లు ఉండటం, వీరికి తోడు రాష్ట్ర వ్యాప్తంగా సగటున 10 శాతం ఉన్న యాదవ ఓట్లలో సింహభాగంగా ఎలాగూ ఎస్పీ కూటమికే పడతాయి. దానికి ఓబీసీల్లోని కొన్నివర్గాలు తోడైతే బీజేపీకి బలమైన ప్రత్యర్థిగా అవతరించిన ఈ కూటమికి 45 శాతం పైచిలుకు ఓట్లు సునాయాసంగా పడతాయని రాజకీయ పరిశీలకులు అంచనా వేశారు. అయితే తొలి దశలో 62.4 శాతం పోలింగ్ మాత్రమే నమోదు కావడంతో ప్రభుత్యానికి వ్యతిరేకంగా పెద్ద సంఖ్యలో రైతులు ఓటింగ్‌కు ముందుకు రాలేదని కొందరు వాదించారు. మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఏడాదికి పైగా జరిగిన ఉద్యమంలో కీలక భూమిక పోషించిన పశ్చిమ యూపీ రైతులు ఓటింగ్ వచ్చేసరికి ఆ స్థాయి పట్టుదలను చూపలేదని అభిప్రాయపడ్డారు. అయితే సోమవారం బీజేపీకి స్వల్ప మొగ్గున్న రెండోదశలోని 55 నియోజకవర్గాలకు జరిగిన పోలింగ్‌లోనూ 60.44 ఓటింగ్ శాతమే నమోదు కావడం గమనార్హం. అంటే ప్రభుత్వ వ్యతిరేకత, అనుకూలతలు దాదాపు సమంగా ఉన్నట్లు భావించొచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఏ పార్టీ లేదా కూటమి కనీసం 2 నుంచి 3 శాతం అధిక ఓట్లు సాధిస్తే.. విజయతీరాలకు చేరే అవకాశాలుంటాయనేది రాజకీయ పరిశీలకుల అంచనా. అంటే ఎవరైతే మిగిలిన ఆరు దశల్లో సర్వశక్తులూ ఒడ్డి ‘ఏక్ ఔర్ ధక్కా’ అంటారో.. వారికి అధికార పీఠం అందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని భావించొచ్చు. మొదటి దశ కాగానే.. హిందుత్వ వాడిని మరింత పెంచిన బీజేపీ మథురలో ఆలయం కడతామంటూ ఎన్నికలకు కొద్దినెలల ముందు కొత్త పల్లవి అందుకున్న బీజేపీ.. ఈ నెల 10çన తొలిదశ తర్వాత హిందుత్వ వాడివేడిని మరింతగా పెంచేసింది. గతంలో ఎస్పీ హయాంలో ‘అబ్బా జాన్ (ముస్లింను ఉద్దేశించి)’ అనే వారికే రేషన్‌తో పాటు ప్రభుత్వ పథకాలన్నీ అందేవని వ్యాఖ్యానించడం ద్వారా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మతపరమైన ఎజెండాను మరింతగా ముందుకుతెచ్చారు. ఆపై 80–20 (ఉత్తరప్రదేశ్ జనాభాలో హిందువులు– ముస్లింల నిష్పత్తి) మధ్య యుద్ధంగా 2022 అసెంబ్లీ ఎన్నికలను అభివర్ణించారు. ప్రధాని మోదీ కూడా ఉత్తరాఖండ్ ప్రచారంలో శనివారం మాట్లాడుతూ... దేవభూమి అయిన ఈ రాష్ట్రంలో ముస్లిం యూనివర్శిటీని పెట్టాలని కాంగ్రెస్ చూస్తోందని ఆరోపించారు. ఇలా హిందువుల ఓట్లను సంఘటితం చేయడానికి ప్రధానితో సహా బీజేపీ అగ్రనేతలంతా గట్టి ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిఘా సమాచారం, కేంద్రంలోని ఇంటలిజెన్స్ బ్యూరో పకడ్బందీగా ఇచ్చే ఫీడ్‌బ్యాక్, వాస్తవ సరిస్థితులను ప్రతిబింబించే ఆర్ఎస్ఎస్ ఇచ్చే నివేదికలు, బీజేపీ పార్టీపరంగా అందే రిపోర్టులు, స్వతంత్ర సంస్థలతో చేయించే సర్వేలు.. ఇలా బీజేపీకి ఇన్ని రకాలుగా క్షేత్రస్థాయిలో ఏం జరగుతోందనే సమాచారం అందుతుంది. వీటిల్లో అభివృద్ధి మంత్రం పనిచేయడం లేదని పక్కా సమాచారం ఉండటంతోనే మరోదారి లేక బీజేపీ మళ్లీ హిందుత్వ నినాదాన్ని (ఈసారి పనిచేయడం లేదని తెలిసీ) అందుకొని ఉండొచ్చనేది కొందరు రాజకీయ పండితుల అంచనా. – నేషనల్ డెస్క్, సాక్షి -
ఈ ప్రజా తీర్పు మత దురభిమాన సంకేతమేనా?
సందర్భం ప్రజాస్వామ్యం అంటే ఒక పెద్ద ఎన్నిక మాత్రమే అని సూత్రీకరించడం కష్టం. అది ప్రతి రోజూ లక్షలాది, కోట్లాది ప్రజాస్వామిక ప్రక్రియలకు, ప్రతీ నిత్యం జరిగే సూక్ష్మ ఘర్షణలకు సంబంధించినది. ప్రజాస్వామ్యంలో ఈ సూక్ష్మాతిసూక్ష్మ ఘర్షణలు నిత్యం జరుగుతూంటాయి. జరుగుతూనే ఉండాలి కూడా. ఈ కోణంలో చూస్తే, మనలో చాలామందికి 2019 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు దేశాన్ని, ప్రజలను అంధకారంలోకి నెట్టివేయనున్నట్లుగా కనిపిస్తుండవచ్చు. 2014 వేసవిలో కూడా చాలామంది ఇదేరకమైన అభిప్రాయాన్ని కలిగి ఉండేవారు. కానీ 2019 వేసవి ఒక అధికారాన్ని సుస్థిరపరిచిందని, దాన్ని తిరగతోడటం ఇక సాధ్యం కాదని పెరుగుతున్న భయాందోళనలను తోసిపుచ్చలేం. నరేంద్రమోదీ హయాంలో తొలి ఐదేళ్లు చాలామందికి విధ్వంసకర ఫలితాలను అందించాయి కాబట్టి నేటి ఫలితాలు వీరిని మరింత నిరాశలోని నెట్టవచ్చు. కానీ ఇలాంటివారే మోదీని తిరిగి ఎన్నుకున్నారు. ఈ ఫలితాలను మనం అంగీకరించితీరాలి. అన్ని నివేదికలూ మోదీ అసాధారణ జనాదరణను నిలబెట్టుకున్నారని స్పష్టం చేస్తున్నాయి. ఈ ఎన్నికల్లో పాల్గొన్న ఓటర్లు చాలామంది గత అయిదేళ్ల పాలనలో తమకేమీ ఒరగలేదని, ఉద్యోగాలు రాలేదని, పెద్దనోట్ల రద్దు తమను విపరీతంగా దెబ్బతీసిందని భావిస్తున్నప్పటికీ మోదీకి మరొక్క అవకాశం ఇవ్వాలని భావించారు. దాని పర్యవసానమే ఈ అసాధారణ ఫలితం. దేశాన్ని కాపాడగలరని, దేశాన్ని అంతర్జాతీయ స్థాయిలో గర్వించేలా చేశారని దేశానికి భవిష్యత్తులోనూ మంచి చేస్తారని భావించి నందునే జనం ఆయనకు ఓటేశారు. ఒకటి మాత్రం నిజం. ఈ ప్రజాతీర్పును విద్వేష రాజకీయాల, మత దురభిమానాల ప్రతిఫలనంగా తక్కువచేసి మాట్లాడలేం. ఈ ఎన్నికల్లో హిందూ ముస్లిం సమస్యపై కనీవినీ ఎరుగని స్థాయిలో సమాజాన్ని విభజించివేసిన వాస్తవాన్ని మనం తోసిపుచ్చలేం. కానీ ప్రజా మద్దతు స్థాయిని దీని ఆధారంగా వివరించలేం. మోదీని ఆయన ప్రభుత్వాన్ని బలపర్చిన కోట్లాది మంది వ్యక్తుల ఉద్దేశాలకు వక్రభాష్యాలు పలికే హక్కు మనకు లేదు. ఈ ఎన్నికల్లో రాహుల్ గాంధీ నిజమైన నేతగా ఆవిర్భవించారని కొంతమంది భావిస్తూ ఉండవచ్చు. కానీ ఓటర్లు, ప్రత్యేకించి హిందీ ప్రాబల్య ప్రాంత ఓటర్లు రాహుల్‌ని పూర్తిగా తిరస్కరించారు. అంటే దీనర్థం రాహుల్ పోరాడలేదని కాదు. ప్రతిపక్షం మొత్తంలో బీజేపీ ప్రభుత్వంపై తీవ్రమైన దాడి చేసిన మొట్టమొదటి నేత రాహుల్. చివరివరకూ దాన్ని కొనసాగిం చారు. కానీ మోదీ పట్ల ప్రజాదరణ మొగ్గు చూపిన తీరుతో రాహుల్ చెప్పిందీ, చేసింది పూర్తిగా అపరిపక్వతతో కొనసాగినట్లు కనిపించింది. గత ఎన్నికల్లో 44 ఎంపీ స్థానాలు సాధించిన కాంగ్రెస్ ఈ దఫా ఎన్నికల్లో కాస్తంత భిన్నంగా కనిపించలేకపోయింది. తమ శక్తికి, ప్రభావానికి మించిన ప్రచారంలో ఆ పార్టీ మునిగితేలింది. కానీ మోదీ విషయానికి వస్తే ప్రారంభం నుంచి ఆయన కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నించారు. తన ముందున్న మార్గంలో సిద్ధాంతపరంగా, సంస్థాగతంగా తనకు ఎదురుగా నిలబడింది కాంగ్రెస్ పార్టీయేనని, తన విధానాలపై నిర్భీతిగా, రాజీలేని విధంగా పోరాడుతున్నట్లు కనిపించిన ఒకే ఒక వ్యక్తి రాహుల్ గాంధీ అని మోదీ స్పష్టంగా గుర్తించారు. అందుకే ఇప్పటికీ బీజేపీ రాహుల్‌ను నిర్మాణాత్మకమైన ఆగ్రహంతో వెన్నాడుతోంది. ఎన్నడూ లేనివిధంగా ఈ దఫా ఎన్నికల్లో భావజాలం రీత్యా కాకుండా వ్యక్తిత్వం ఆధారంగా పోరాడుతూ వచ్చారు. తానెంతగానో అభిమానించే అమితాబ్ బచ్చన్ శైలిలో మోదీ తన్ను తాను తీర్చి దిద్దుకున్నారు. భారతీయ సినిమా చరిత్రలో ఒక దశాబ్దం పాటు అమితాబ్ 1 నుంచి 10 వరకు అన్నీ తానై పేరు గాంచారు. ప్రస్తుత వాతావరణంలో మోదీ కూడా భారత రాజకీయాల్లో 1 నుంచి 10 వరకు అన్నీ తానై నిలుస్తున్నారు. చాలామంది 2014 నాటి ఆధిపత్యాన్ని మోదీ ఈసారి చలాయించలేరని భావించారు. కానీ ఆధిపత్యంతో పనిలేకుండానే భారత రాజకీయాలను శాసించే స్థాయిని మోదీ ప్రస్తుతం చేరుకున్నారు. చాలా అంశాల్లో రాహుల్ మోదీకి సరి సమానంగా నిలబడాలని చూశారు కానీ మోదీకి సమీప దూరంలోనే నిలబడిపోయారు. ఈ దఫాకూడా మోదీకే ప్రజలు ఓట్లు వేశారు. కానీ విద్వేష రాజకీయాలకు, మత ఛాందస వాదానికి అనుకూలంగా వారు ఓటేశారని చెప్పడం అసందర్భం అనే చెప్పాలి. మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ మత దురభిమాన ప్రచారాన్ని నేను తక్కువ చేసి చెప్పడం లేదు. కానీ, సోషల్ మీడియాలోని విద్వేష శక్తులకంటే ఓటర్లు పరిణతి ప్రదర్శిం చారు. అలాగని ప్రజలు విజ్ఞతతో ఓటు వేయలేదని చెప్పడానికీ లేదు. ప్రజలు ఏం కోరుకున్నారు అని నిర్ణయించడానికి మనం ఎవరం? అలాగే ప్రజలు తప్పు అని మనం ఏ కోణంలోంచి నిర్ధారించగలం? జాతి మానసిక స్థితి ఎలా ఉందో గ్రహించడానికి సర్వేలకేసి పరిశీలించండి. దేశాన్ని పట్టిపీడిస్తున్న సమస్యల్లో ఉగ్రవాదం ప్రధానమైందని భారతీ యులు భావిస్తున్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కఠిన చర్యల తీసుకోగల నాయకుడిని వారు కోరుకుంటున్నప్పుడు ప్రజల నిర్ణయం తప్పు ఎలా అవుతుంది? 1980లు, 90లలో పుట్టి పెరిగినవారికి పాకిస్తాన్ ఉగ్రవాద అనుకూల చర్యలతో భారత్ ఎంత గాయపడిందో స్పష్టంగా తెలుసు. అలాంటప్పుడు పాకిస్తాన్‌కు గట్టి సమాధానం ఇవ్వగల నేత కనబడినప్పుడు ప్రజలు అలాంటి నేతకు మద్దతు ఇవ్వడం తప్పెలా అవుతుంది? ఇకపోతే ముస్లింల విషయం ఏమిటి? మోదీకి ముస్లింల పట్ల ప్రేమ లేదంటే ఆశ్చ ర్యపడాల్సింది లేదు. నిజానికి హిందూ వైభవం పునాదిని కలిగిన బీజేపీకే ఆ భావం లేదు. అలాగే తొలినుంచి ముస్లింలకు కూడా ఆరెస్సెస్ అన్నా, బీజేపీ అన్నా ప్రేమ లేదు. అయితే రాడికల్ రాజకీయాల స్వభావాన్ని చరిత్ర నేపథ్యంలో చూసినట్లయితే ఒకనాటి కరడుగట్టిన ఛాందసవాదులు తదనంతరం కాస్త ఉదారవాదంవైపు మళ్లడం తెలిసిందే. మనదేశంలోనూ ముస్లింల పట్ల అలాంటి మార్పు వస్తుందని ఎదురుచూడాల్సిందే మరి. ముస్లి ఓటు అనేది ఇప్పుడు అసందర్భ విషయంగా మారింది. గత అయిదేళ్లుగా ముస్లింలు ఈ దేశంలో చాలా భయభీతులతో జీవిస్తున్నారన్నది నిజం. అయితే దేశవిభజనానంతర హింసాత్మక పరిస్థితుల్లోనూ వారు జీవించగలిగారు. గత కొన్ని దశాబ్దాలుగా మహానగరాలు, పట్టణాల్లో తమపై జరిగిన దాడుల నేపధ్యంలోనూ వారు జీవించగలిగారు. గత అయిదేళ్ల బీభత్స పరిస్థితుల్లోనూ వారు జీవించగలిగారు. రేపు ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు? కానీ, అంబేడ్కర్ ఆనాడు చెప్పినట్లుగా ప్రజల జీవితాల్లో సూక్ష్మాతిసూక్ష్మమైన ఘర్షణలు, పోరాటాలు జరుగుతూనే ఉంటాయి. ఈ దేశంలోని 20 కోట్లమంది ముస్లింలతో ఎలా వ్యవహరించాలి అనే అంశంపై ఆరెస్సెస్ పునరాలోచించాల్సిన అవసరముంది. ఇన్ని కోట్లమందిని నిషేధించలేం. వీరిని క్యాంపుల్లో పెట్టి నిర్బంధించలేం. హతమార్చలేం. లేక వారు ఈ దేశంనుంచి మాయమైపోరు కూడా. భారతదేశంలోని అయిదింట ఒకవంతు జనాభాను రెండో తరగతి పౌరులుగా ముద్రిస్తూ వారిలో తీరని అసంతృప్తి, అశాంతిలను పెంచి పోషిస్తున్నంత కాలం ఈ దేశం వైభవంతో, సౌభాగ్యంతో ఉంటుందనుకోవడం సందేహమే. ముస్లింలను చిన్న చూపు చూసే రాజకీయాల్లో దేశభక్తి ఉండదు పైగా అవి జాతీయవాద వ్యతిరేకమైనవి కూడా. భారత్ అభివృద్ధి చెందాలని నిజంగా కోరుకుంటున్న భారత భక్తాదులు ఈ విషయాన్ని పదే పదే మననం చేసుకోవాల్సి ఉంది. మహ్మద్ ఫారూఖీ వ్యాసకర్త పాత్రికేయుడు, ‘ది వైర్’ సౌజన్యంతో.. -
వామ్మో.. ఇన్ని పేర్లు ఎలా మార్చగలం ?
సాక్షి, న్యూఢిల్లీ : తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అభ్యర్థి తరఫున ఎన్నికల ప్రచారానికి వచ్చిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బుధవారం కరీంనగర్లో జరిగిన ఎన్నికల సభలో మాట్లాడుతూ బీజేపీని గెలిపించినట్లయితే కరీంనగర్ పేరును కరిపురంగా మారుస్తామని ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరం పేరును కూడా మారుస్తామని అంతకుముందు బీజేపీ నాయకులు తెలిపారు. ఇప్పటికే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అలహాబాద్‌ను ప్రయాగ్ రాజ్‌గా, ఫైజాబాద్ జిల్లాను అయోధ్యగా... పలు నగరాల పేర్లను ఆదిత్యనాథ్ మారుస్తున్న విషయం తెల్సిందే. భారత దేశంలో నేడు ఉర్దూ పేర్లుగా కనిపించే అన్ని నగరాలు, వీధుల పేర్లలో 90 శాతం పేర్లు పర్షియన్–అరబిక్ పేర్లన్న విషయాన్ని ఏ హిస్టరీ అధ్యాపకుడిని అడిగినా తెలుస్తుంది. కాకపోతే ఎక్కువ పేర్లు పర్షియన్, తక్కువ పేర్లు అరబిక్ పదాల నుంచి వచ్చినవి. ఒక్క ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే 45 శాతం నగరాలు, పట్టణాలకు పర్షియన్–అరబిక్ పేర్లే. దేశంలో ఒక్క నగరాలు, వీధుల పేర్లే కాదు, మన బంధాలు, అనుబంధాలు, సంబంధాల్లో పర్షియన్–అరబిక్ పేర్లు చొచ్చుకుపోయాయి. మన ఆర్థిక, సామాజిక లావాదేవీల్లో కాకుండా, మన పాలనా వ్యవహారాల్లో కూడా ఇప్పటికీ పర్షియన్ పేర్లనే వాడుతున్నాం. మొత్తంగా మన సంస్కతిలో కలిసిపోయి మన సాహిత్యంలో, మన భాషల్లో కూడా ఈ పేర్లే ప్రతిఫలిస్తున్నాయి. అంతేకాదు, మనం కట్టుకునే గుడ్డల్లో తినే తిండిలో ఈ పేర్లే కలిసి పోయాయి. వీటన్నింటినీ ఎలా మార్చగలం ? మోదీ వేషధారణలో కూడా పర్షియన్ పేర్లే మన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ధరించే కుర్తా, పైజామా పర్షియన్ పదాలే. ఆయన కళ్లకు పెట్టుకునే ‘చస్మా’ కూడా పర్షియనే. షల్వార్–కమీజ్లతోపాటు పెళ్లిల్లో ఉత్తర భారతీయులు ఎక్కువగా ధరించే షేర్వానీ కూడా పర్షియన్ పదమే. మోదీ మాట్లాడే భాషలో సగానికిపైగా పర్షియన్ పదాలే ఉంటాయి. మాలిక్, మజుందార్, మజ్దూర్ పర్షియన్ పదాలే, సర్కార్, జిల్లా, తెహసిల్, తాలూకా పర్షియన్ పదాలే. మహారాష్ట్ర బీజేపీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌లో ఆయన ఇంటి పేరు కూడా పర్షియనే. ఉత్తరప్రదేశ్‌లోని మొఘల్ సరాయ్ రైల్వే స్టేషన్ పేరును యోగి పండిట్ దీన్‌దయాల్ ఉపాధ్యాయ్‌గా మార్చిన విషయం తెల్సిందే. అందులోని ‘దీన్ దయాల్’ పర్షియన్ పదమే. ప్రపంచంలోకేల్లా ఎల్తైన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని ఇటీవల మోదీ స్వయంగా ప్రారంభించిన విషయం తెల్సిందే. సర్దార్ పటేల్ పేరులోని సర్దార్ పదం పర్షియనే. ఇన్ని పేర్లను ఎలా మార్చగలం? మనం తినే పదార్థాల్లోనూ అవే పేర్లు తందూర్–పులావ్ కూడా పర్షియన్–ఆరబిక్ పేర్లే. హల్వా, జలేబి, సమోసాలతోపాటు కూరల్లో ఉపయోగించే పన్నీర్, ప్యాస్, నమక్ పర్షియన్–అరబిక్ పదాలే. తర్బూజా (పుచ్చకాయ) పర్షియన్ పదమే. చాయ్‌వాలా అంటూ మోదీని పిలుస్తారుకాని అందులో చాయ్ అచ్చంగా పర్షియన్ నుంచి వచ్చిందే. షరాబ్, దారూ పదాలు పర్షియనే. సైన్యంలోనూ తిట్టలోనూ అవే పదాలు భారత సైన్యంలోని సిపాయి, సుబేదార్, హవల్దార్ హోదాలు పర్షియన్ పదాలే. కమీనా, హరామీ పదాలు అవే. ఐదు నదులు కలిగిన పంజాబ్‌లో ఆబ్ (నది) పర్షియనే. ఫరీదాబాద్, హైదరాబాద్, అహ్మదాబాద్ అన్నింటో ఉన్న అబాద్ పర్షియన్ పదమే. అబాద్ అంటే పర్షియన్లో జనావాస ప్రాంతం. అఫ్టల్గంజ్లో గంజ్, సుల్తాన్ బజార్లో బజార్ పర్షియన్ పదాలే. ఉప్పల్ కలాన్‌లో కలాన్ (పెద్దది), ఖుర్ద్ (చిన్నది) పర్షియన్ పదాలే. గాంధీజీ చరఖా అక్కడిదే. జాతిపిత మహాత్మాగాందీ నూలు వడకడానికి ఉపయోగించిన ‘చరఖా’ పర్షియన్ నుంచి వచ్చిందే. సుభాస్ చంద్ర బోస్ ఏర్పాటు చేసిన ‘ఆజాద్ హిందూ ఫౌజ్’ పర్షియన్ మూలం నుంచి వచ్చిందే. భారత రెవెన్యూ భాషలో 90 శాతం పర్షియన్ పదాలే. నిత్య జీవితంలోనూ అవే పదాలు సాబూన్ (సబ్బు), దివార్ (గోడ), టక్యా (దిండు), పర్దా (తెర) పదాలు కూడా పర్షియన్ నుంచి వచ్చినవే. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక భారత ప్రభుత్వం అధికార భాషలోకి చొచ్చుకుపోయిన పర్షియన్ పదాలను మార్చి ఆ స్థానంలో ఆధునిక హిందీ భాషా పదాలను తీసుకరావాలని ప్రయత్నించింది. అందుకోసం 1955లో ఓ అధికార భాషా కమిషన్‌ను వేసింది. కొన్ని పదాలను ప్రయోగాత్మకంగా మార్చింది. రేడియో (ఎలక్ట్రికల్ బ్రాడ్‌కాస్టింగ్ డివైస్)ను విద్యుత్ ప్రసారణ అని, రైలును లోహ్ పత్ గామిని మార్చింది. వీటిపై కూడా సంస్కృత పదాల ప్రభావం ఉండడాన్ని ప్రముఖ హిందీ కవి హరివంశ్ రాయ్ బచ్చన్ తన జీవిత చరిత్రలో హేళన చేశారు. భాషా కమిషన్ సూచించిన పదాల్లో ఒక్కటి కూడా నేటికి అమల్లోకి రాలేదు. హిందీ, హిందు, హిందుస్థాన్, హిందుత్వ కూడా... హిందీ, హిందు, హిందుస్థాన్ పదాలు కూడా పర్షియన్ నుంచి వచ్చినవే. ఇండియన్ ఇంగ్లీషు పదం కూడా పర్షియన్ మూలమే. హిందు నుంచి వచ్చింది కనుక హిందు పర్షియన్ కనుక హిందుత్వ పదం కూడా పర్షియన్ మూలం నుంచి వచ్చినట్లే. ఇన్ని పేర్లను మార్చడం ఎవరి తరం కాదు కనుక. హిందూత్వ పేరును ముందుగా మార్చుకోవడం మంచిదేమో! (గమనిక : జాన్ టీ ప్లాట్స్ రాసిన ‘ఏ డిక్షనరీ ఆఫ్ ఉర్దూ, క్లాసికల్ హిందీ అండ్ ఇంగ్లీషు, ఫ్రాన్సిస్ జోసఫ్ స్టింగాస్ రాసిన ‘పర్షియన్–ఇంగ్లీషు డిక్షరీ’ ఆధారంగా ఈ వార్తా కథనం) -
అవి కాంగ్రెస్ విలువలకు విరుద్ధమన్న రాహుల్..
సాక్షి, న్యూఢిల్లీ : హిందుత్వం గురించి బ్రాహ్మణులకు మాత్రమే తెలుసని, దీనిపై వారే మాట్లాడగలరని సీనియర్ కాంగ్రెస్ నేత సీపీ జోషీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో ఆ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ విభేదించారు. కాంగ్రెస్ పార్టీ విలువలకు జోషీ వ్యాఖ్యలు విరుద్ధంగా ఉన్నాయని మండిపడ్డారు. ఏ వర్గం మనోభావాలు దెబ్బతినే ప్రకటనలకు పార్టీ నేతలు దూరంగా ఉండాలని సూచించారు. జోషీ తన పొరపాటును గుర్తించి పార్టీ సిద్ధాంతాలను గుర్తెరుగుతారని ఆశిస్తున్నానన్నారు. ఆయన తన ప్రకటనపై విచారం వెలిబుచ్చాలని రాహుల్ ట్వీట్ చేశారు. ప్రధాని మోదీని ఉద్దేశించి జోషీ చేసిన వ్యాఖ్యల వీడియో దుమారం రేపిన సంగతి తెలిసిందే. దేశంలో హిందుత్వ గురించి మాట్లాడుతున్న ఉమా భారతి, సాధ్వి రితంబర ఏ కులానికి చెందిన వారో తెలుసా అంటూ ఈ వీడియోలో ఆయన వ్యాఖ్యానించారు. ఈ దేశంలో మతం గురించి ఎవరికైనా తెలుసంటే వారు పండిట్లు, బ్రాహ్మణులు మాత్రమేనన్నారు. లోధి అయిన ఉమాభారతి, మరోవైపు ప్రధాని మోదీ హిందుత్వం గురించి మాట్లాడటాన్ని ఆయన ఆక్షేపిస్తూ మతం, పాలన వేర్వేరు అంశాలని వ్యాఖ్యానించారు. వారి మతాన్ని అనుసరించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందన్నారు. రాజస్ధాన్‌లోని నద్వారాలో జరిగిన ఓ కార్యక్రమంలో జోషీ ఈ వ్యాఖ్యలు చేశారు. రాజస్ధాన్‌లో డిసెంబర్ 7న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. -
రామ భక్తుడిగా రాహుల్ గాంధీ!?
సాక్షి, న్యూఢిల్లీ : ఇదివరకు ఎన్నికలు సమీపిస్తున్నాయంటే కేంద్రంలోని ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు ప్రజల్లోకి వివిధ రకాలుగా చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించేవారు. ఊరు, వాడా తిరుగుతూ పార్టీ సిద్ధాంతాలు, ఆశయాల గురించి ప్రజలకు అర్థమయ్యేలా చెప్పేందుకు ప్రయత్నించే వారు. ఎక్కడికెళితే అక్కడి సమస్యలను ఏకరువు పెట్టి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పేవారు. రాజకీయ ప్రత్యర్థులను ఆడిపోసుకునేవారు. ఇంకా ప్రజల్ని ఆకర్షించేందుకు వాగ్దానాల మీద వాగ్దానాలు చేసేవారు. 2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సీన్ మారిపోయింది. బీజేపీ నాయకులు ఏ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి వెళ్లినా ప్రధానంగా ‘హిందూత్వ’ నినాదాన్ని అందుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీని ముస్లిం పక్షపాత పార్టీ అని ఆడిపోసుకుంటున్నారు. ఆ ప్రచారాన్ని తిప్పికొట్టడంతోపాటు తాను కూడా హిందూత్వ వాదినని చెప్పుకోవడం కోసమేమో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ శివ భక్తుడిగా మారిపోయారు. ఇక ఆయన్ని జంధ్యం ధరిస్తున్న బ్రాహ్మణుడని పార్టీ వారు ప్రచారంలో పెట్టారు. అందుకని రాహుల్ గాంధీ ఏ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి వెళ్లినా ముందుగా అక్కడి హిందూ దేవాలయాలను సందర్శిస్తున్నారు. రాహుల్ గాంధీ సోమవారం నాడు మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారానికి వెళ్లి ఉజ్జయినిలోని మహా కాళేశ్వరుడి ఆలయాన్ని సందర్శించడమే కాకుండా అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. పార్టీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర అక్కడ రాహుల్ గాంధీ గోత్రం అడిగారంటే ఆయన అగ్రవర్ణానికి చెందిన బ్రాహ్మణుడిగా ప్రచారం జరగాలనే. నెహ్రూ–గాంధీ కుటుంబాన్ని మొదటి నుంచి లౌకికవాద, ఉదారవాద కుటుంబంగానే భారత రాజకీయాల్లో గుర్తించారు. రాజీవ్‌గాంధీ, క్రైస్తవ మతానికి చెందిన సోనియా గాంధీని పెళ్లి చేసుకోవడంతో కాంగ్రెస్‌పై క్రైస్తవ ముద్ర వేసేందుకు ప్రత్యర్థి పార్టీలు ముఖ్యంగా బీజేపీ ప్రయత్నిస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించడానికి కొన్ని రోజుల ముందే రాహుల్ గాంధీ జంధ్యం వేసుకునే బ్రాహ్మణుడు కాగా, పార్టీ బాధ్యతలు స్వీకరించాక పూర్తి స్థాయి శివభక్తుడిగా మారిపోయారు. సెప్టెంబర్ నెలలో రాహుల్ గాంధీ టిబెట్‌లోని కైలాస యాత్రకు కూడా వెళ్లి వచ్చారు. గత ఏప్రిల్ నెలలో కర్ణాటక ఎన్నికలు జరిగినప్పుడు కూడా ఆయన ఆ రాష్ట్రంలోని పలు గుళ్లూ గోపురాలను సందర్శించారు. రానున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బీజేపీ, అనుబంధ హిందూత్వ సంఘాలు అయోధ్య నినాదాన్ని అందుకుంది. ఈ విషయంలో బీజేపీని అడ్డుకునేందుకు రాహుల్ గాంధీ రామ భక్తుడిగా మారిపోయినా ఆశ్చర్య పోనక్కర్లేదు. -
హిందుత్వ రాజకీయాలతో లౌకికవాదానికి విఘాతం
కేయూ క్యాంపస్, న్యూస్‌లైన్ : ముస్లింల పట్ల తరతరాలుగా కొనసాగుతున్న వివక్షకు తోడు.. హిందుత్వ రాజకీయాలతో లౌకిక వాదానికి విఘాతం కలిగే అవకాశముం దని ప్రముఖ జర్నలిస్టు, రచయిత ఏఎం.ఎజ్దానీ(డానీ) అన్నారు. మానవహక్కుల నేత దివంగత డాక్టర్ బాలగోపాల్ రాసిన ‘ముస్లింల ఐడెంటిటీ-హిందుత్వ రాజకీయా లు’ పుస్తక పరిచయ సభ హన్మకొండలోని ఆర్ట్స కళాశాల సెమినార్ హాల్లో ఆదివారం జరిగింది. మానవ హక్కుల వేదిక జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఈ సభలో డానీ ముఖ్యవక్తగా మాట్లాడుతూ ప్రపంచానికి సమానత్వాన్ని చాటిచెప్పిన ఇస్లాం మతాన్ని ఆదరించాల్సింది పోయి హిందుత్వం పేరుతో రాజకీయాలు చేస్తున్న వారు ముస్లింలను అసాంఘిక శక్తులుగా పేర్కొనడం బాధాకరమన్నారు. బీజేపీ ప్రచారం చేస్తున్నట్లు గుజరాత్లో అంతగా అభివృద్ధి జరగలేదన్నారు. ఇక్కడ చంద్రబాబు సీఎంగాఉన్నప్పుడు ఎంతో అభివృద్ధి చేశానని చెప్పినా.. ఇప్పుడు టీడీపీ పరిస్థితి ఏమిటో గుర్తించాలన్నారు. బీజేపీ వైఖరి సిగ్గుచేటు 2002 సంవత్సరంలో నరేంద్రమోడీ సీఎంగా ఉన్నప్పుడే గోద్రా ఘటన జరిగినా ఆయననే ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడం గర్హనీయమని మానవ హక్కుల వేదిక ప్రధాన కార్యదర్శి వీఎస్.కృష్ణ అన్నారు. ప్రముఖ కవి, రచయిత సిరాజుద్దీన్ మాట్లాడుతూ తీవ్రవాదులందరూ ముస్లింలు కాదని, ఈ విషయాన్ని గుర్తించి ముస్లింలు అన్ని రంగాల్లో ఎదిగేలా ప్రోత్సహించాల్సిన అవసరముందన్నారు. సమావేశంలో దళితరత్న బొమ్మల కట్టయ్య, మానవ హక్కుల వేదిక జిల్లా అధ్యక్షురాలు కందాల శోభారాణి, జిల్లా ప్రధా న కార్యదర్శి బాదావత్ రాజు, బాధ్యులు డాక్టర్ సాదు రాజేష్, పాలకుర్తి సత్యం, వెంకటనారాయణ, బండి కోటి, యాదగిరి, దాడబోయిన రంజిత, బీరం రాము, ప్రకాష్, రవీందర్, సాహితి పాల్గొన్నారు. ఈ సదస్సులో తొలుత ‘ముస్లింల ఐడెంటిటీ-హిందుత్వ రాజకీయాలు’ పుస్తకాన్ని ఆవిష్కరించారు.