న్యూఢిల్లీ/భోపాల్: మధ్యప్రదేశ్‌లో మంగళవారం ఎంతో ఉత్కంఠతో సాగిన ఓట్ల లెక్కింపు బుధవారం ఉదయం వరకు కొనసాగింది. ఊహించినట్లుగానే ఏ పార్టీకీ సాధారణ ఆధిక్యం దక్కకుండా హంగ్ అసెంబ్లీ ఏర్పడింది. మొత్తం 230 సీట్లున్న శాసనసభలో సాధారణ ఆధిక్యానికి 116 సీట్లు అవసరం కాగా, కాంగ్రెస్ 114 సీట్లు సాధించి రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా నిలిచినప్పటికీ మెజారిటీ మార్కుకు కేవలం రెండే సీట్ల దూరంలో ఆగిపోయింది. బీజేపీ 109 స్థానాల్లో గెలిచింది. అయితే ఈ రాష్ట్రంలో ఎక్కువ ఓట్లు మాత్రం బీజేపీకే పడ్డాయి. కాషాయ పార్టీ 41 శాతం ఓట్లు దక్కించుకోగా, కాంగ్రెస్‌కు 40.9 శాతం ఓట్లు వచ్చినప్పటికీ బీజేపీ కన్నా 7 సీట్లు అధికంగా గెలుపొందింది. బీఎస్పీకి 2, ఎస్పీకి 1 సీటు దక్కగా, నాలుగు స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు. ఏ పార్టీకీ సాధారణ ఆధిక్యం లభించకపోవడంతో బీఎస్పీ, ఎస్పీలతోపాటు స్వతంత్ర ఎమ్మెల్యేలకు ప్రాధాన్యమేర్పడింది. అయితే తాము కాంగ్రెస్‌కే మద్దతివ్వాలని నిర్ణయించుకున్నట్లు బీఎస్పీ, ఎస్పీలు ప్రకటించాయి. స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతు కూడా తమకే ఉందని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు కమల్‌నాథ్ తెలిపారు. 15 ఏళ్ల తర్వాత మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటు ఖాయమైంది.
బీజేపీని గద్దె దింపేందుకే: మాయావతి
మధ్యప్రదేశ్‌లోనే కాక అవసరమైతే రాజస్తాన్‌లో కూడా కాంగ్రెస్‌కు తాము మద్దతివ్వాలని నిర్ణయించినట్లు బీఎస్పీ అధినేత్రి మాయావతి చెప్పారు. కాంగ్రెస్ సిద్ధాంతాలు కూడా తమకు నచ్చవనీ, కేవలం బీజేపీని మళ్లీ అధికారంలోకి రానివ్వకూడదన్న పట్టుదలతోనే కాంగ్రెస్‌కు మద్దతివ్వాలని నిర్ణయించామని మాయావతి తెలిపారు. కేంద్రంలో, పలు రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాల పాలనతో ప్రజలు అసంతృప్తిగా ఉన్నారనేందుకు నిదర్శనమే తాజా ఎన్నికల ఫలితాలని ఆమె పేర్కొన్నారు.
శివరాజ్ సింగ్ రాజీనామా
ఎన్నికల్లో బీజేపీ ఓటమికి పూర్తి బాధ్యత వహిస్తూ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన ఇప్పటికి వరుసగా 13 ఏళ్లపాటు మధ్యప్రదేశ్‌కు సీఎంగా ఉన్నారు. ‘నా రాజీనామాను గవర్నర్ ఆనందీబెన్ పటేల్‌కు సమర్పించాను. బీజేపీ ఓటమికి పూర్తి బాధ్యత నాదే. పార్టీ కార్యకర్తలు తీవ్రంగా శ్రమించారు. ప్రజలు కూడా మాపై ప్రేమ చూపారు. కానీ మేం కనీసం అత్యధిక సీట్లు కూడా గెలవలేదు. కమల్‌నాథ్‌కు అభినందనలు. ప్రచారంలో హామీ ఇచ్చినట్లు రైతు రుణమాఫీని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 10 రోజుల్లోపు అమలు చేయాలి’ అని చౌహాన్ విలేకరులతో అన్నారు. శివరాజ్ సింగ్ చౌహాన్ మంత్రివర్గంలోని 10 మందికి పైగా ప్రముఖులు ఈ ఎన్నికల్లో ఓటమిపాలవడం గమనార్హం.
రాహుల్‌కు సీఎం ఎంపిక బాధ్యత
15 ఏళ్ల అనంతరం మధ్యప్రదేశ్‌లో మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడనుండటంతో ఆ రాష్ట్రానికి సీఎంను ఎంపిక చేసే బాధ్యతను కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి అప్పగించారు. కాంగ్రెస్ కేంద్ర కమిటీ పరిశీలకులు ఏకే ఆంటోనీ, భన్వర్ జితేంద్ర సింగ్‌ల పర్యవేక్షణలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల సమావేశం బుధవారం భోపాల్‌లో జరిగింది. ముఖ్యమంత్రిని ఎంపిక చేసే బాధ్యతను రాహుల్ గాంధీకే అప్పగిస్తున్నట్లు ఈ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఎంపీసీసీ అధ్యక్షుడు కమల్‌నాథ్‌తోపాటు కాంగ్రెస్ ఎంపీ, రాహుల్‌గాంధీకి సన్నిహితుడు జ్యోతిరాదిత్య సింధియాలు మధ్యప్రదేశ్‌కు కాబోయే ముఖ్యమంత్రి రేసులో ఉండటం తెలిసిందే.
రుణమాఫీ హామీతోనే గెలుపు!
మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి రుణమాఫీ హామీనే ప్రధాన కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన పదిరోజుల్లోనే రైతు రుణాలను మాఫీ చేస్తామని రాహుల్ ఎన్నికల ప్రచారంలో హమీనిచ్చారు. దీంతో రైతులంతా గంపగుత్తగా కాంగ్రెస్‌కు ఓట్లు వేశారని రాష్ట్రీయ కిసాన్ మజ్దూర్ మహాసంఘ్ అధ్యక్షుడు శివ కుమార్ శర్మ అభిప్రాయపడ్డారు. రుణమాఫీ అవుతుంద న్న ఉద్దేశంతో రైతులు ప్రస్తుతం తమ వద్ద ఉన్న వరి పంట దిగుబడులను కూడా అమ్మకుండా అలాగే పెట్టుకున్నారు. ఈ వడ్లను అమ్మితే ఆ సొమ్ము నేరుగా రైతుల ఖాతాల్లోకి వెళ్తుంది. బ్యాంకులు రుణం కంతును వారి ఖాతాల్లోంచి తీసుకుంటాయి. ఈ కారణంతో రైతులు తమ దిగుబడిని కూడా అమ్మకుండా అలాగే పెట్టుకున్నారని శర్మ చెప్పారు. రుణమాఫీ సాధ్యం కాని హామీ అని శివరాజ్ సింగ్ గతంలో అన్నారు.
మధ్యప్రదేశ్ కాంగ్రెస్‌దే
Published Thu, Dec 13 2018 2:23 AM | Last Updated on Thu, Dec 13 2018 5:20 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment