భోపాల్: దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ తరుణంలో మధ్యప్రదేశ్ యూనిట్ బీజేపీ పార్టీ అధికార ప్రతినిధి 'గోవింద్ మాలూ' గుండెపోటుతో మరణించారు. ఈ విషయాన్ని స్థానిక పార్టీ నాయకుడు గురువారం తెలిపారు. బుధవారం భోపాల్ నుంచి ఇంటికి వచ్చిన తరువాత రాత్రి భోజనం చేశారు. ఆ తరువాత ఇంటి వద్ద గుండెపోటుకు గురయ్యారని సన్నిహితులు పేర్కొన్నారు.
గుండెపోటు రావడంతోనే హుటాహుటిగా గోవింద్ మాలూను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కానీ అయన అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మాలూ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ గురువారం ఉదయం ఇండోర్ చేరుకున్నారు.
గోవింద్ మాలూ బీజేపీకి పెద్ద ఆస్తి అని మోహన్ యాదవ్ అన్నారు. కార్డియాక్ అరెస్ట్‌తో మాలూ ఆకస్మిక మృతి పట్ల చాలా బాధపడ్డాను. పార్టీకి సంబంధించిన అనేక బాధ్యతలు ఆయన నిర్వహించారని సీఎం పేర్కొన్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు విష్ణు దత్ శర్మ, పార్టీ రాష్ట్ర సంస్థ ప్రధాన కార్యదర్శి హితానంద్, ఇతర సీనియర్ నేతలు కూడా మాలూ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.
మాలూ బీజేపీ రాష్ట్ర విభాగానికి మీడియా ఇన్‌ఛార్జ్‌గా పనిచేశారు. అంతేకాకుండా రాష్ట్ర మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ వైస్ చైర్మన్‌గా కూడా పనిచేశారు. రాజకీయాల్లోకి రాకముందు స్థానిక వార్తాపత్రికల్లో స్పోర్ట్స్ రివ్యూలు రాశారు. ఆయనకు తల్లి, భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment