
సరిగ్గా అసెంబ్లీ ఎన్నికలకు ఆరు నెలల ముందు మధ్యప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పగ్గాలు చేపట్టిన 72 ఏళ్ల కమల్‌నాథ్ పటిష్టమైన వ్యూహరచనతో ఎన్నికల్లో పార్టీ విజయానికి బాటలు వేశారు. రాష్ట్ర ప్రజల్లో మంచి పట్టున్న శివరాజ్ సింగ్ చౌహాన్‌ను ఎదుర్కోవడానికి, ప్రజలను తమ వైపు తిప్పుకోవడానికి ఆయన పలు ప్రణాళికలు, పథకాలు రూపొందించారు. పార్టీలో నేతల మధ్య ఆధిపత్య పోరాటాల్ని, అంతర్గత కుమ్ములాటలను నివారించి నేతలందరికీ ఏకతాటిపై నడిపించారు. ఫలితాల అనంతరం సీఎం పీఠంపై పోరులో ముందున్నారు.
అప్పుడు ఇందిరకు.. ఇప్పుడు రాహుల్‌కు!
1979లో మొరార్జీ దేశాయ్ ప్రభుత్వాన్ని ఎదుర్కోవడానికి ఇందిరా గాంధీకి ఎంతగానో సహకరించిన కమల్‌నాథ్ దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత మధ్య ప్రదేశ్‌లో బీజేపీ సర్కారును ఎదుర్కోవడానికి ఆ ఇందిరా గాంధీ మనుమడు రాహుల్ గాంధీకి అండగా నిలవడం విశేషం. లోక్‌సభలో సీనియర్ మోస్ట్ సభ్యుడయిన కమల్ నాథ్ ఇందిర కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. సంజయ్‌గాంధీ, కమల్‌నాథ్‌లు ఇందిరా గాంధీకి రెండు చేతులని అప్పట్లో పార్టీ నేతలు అభివర్ణించేవారు. కమల్‌నాథ్‌ను ఇందిరాగాంధీ తన మూడో కుమారుడని చెప్పేవాడని చెప్పుకుంటుంటారు. 1980లో మొదటి సారి చింద్వారా లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎన్నికయిన కమల్‌నాథ్ ఇంతవరకు 9 సార్లు ఇదే నియోజకవర్గం నుంచి లోక్‌సభకు వెళ్లారు. యూపీఏ హయాంలో మంత్రిగా పని చేశారు. కేంద్రంలో యూపీఏ సర్కారు నిలదొక్కుకోవడానికి ప్రధాన శక్తిగా వ్యవహరించారు.
డూన్ స్కూల్ స్నేహం...
ఉత్తర ప్రదేశ్‌లోని కాన్పూర్‌లో మహేంద్రనాథ్, లీనా నాథ్ దంపతులకు జన్మించిన కమల్‌నాథ్ డూన్ స్కూల్లో చదివారు. కోల్‌కతా యూనివర్సిటీ కాలేజీలో బీకాం చేశారు. కమల్ సతీమణి అల్కానాథ్. వీరికి ఇద్దరు కొడుకులు. 1968లో కాంగ్రెస్ పార్టీలో చేరిన కమల్‌నాథ్ అనతికాలంలోనే పార్టీ పెద్దలకు సన్నిహితుడయ్యారు. కమల్‌కు డూన్ స్కూల్లో ఇందిర కొడుకు సంజయ్ ఆప్తమిత్రుడు. తద్వారా గాంధీ కుటుంబానికి సన్నిహితుడయ్యారు. సంజయ్ గాంధీ కోటరీలో ముఖ్యుడిగా పేరు పొందారు. 2009–11 మధ్య కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పని చేశారు.
వికీలీక్స్ దుమారం..
కేంద్ర ప్రభుత్వంలో కీలక వ్యక్తిగా వ్యవహరించిన కమల్‌నాథ్‌కు అమెరికా తొత్తు అని, దేశానికి సంబంధించిన పలు రహస్యాలను అమెరికాకు చేరవేసేవాడని ‘వికీలీక్స్’ వెల్లడించడం అప్పట్లో(1976) తీవ్ర సంచలనం కలిగించింది.గతంలో యూపీఏ సర్కారుపై పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం వచ్చినప్పుడు ప్రభుత్వానికి మద్దతివ్వడం కోసం కమల్‌నాథ్ కొందరు ఎంపీలకు లంచాలిచ్చారని కూడా వార్తలు వచ్చాయి. రాడియా టేపుల వ్యవహారంలో నాథ్ పేరు వినపడింది. పర్యావరణ మంత్రిగా ఉండగా పర్యావరణ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయడం, పర్యావరణ మదింపును ప్రవేశపెట్టడం, పర్యావరణ బ్రిగేడ్‌లు ఏర్పాటు చేయడం వంటి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జౌళిశాఖ సహాయ మంత్రి హోదాలో నూతన జౌళి విధానం తెచ్చారు. ఆయన హయాంలో పత్తి ఎగుమతులు పతాక స్థాయికి చేరాయి. వాణిజ్య, పరిశ్రమల మంత్రిగా ఎఫ్‌డీఐలు 7 ఏడు రెట్లు పెరిగేలా చూశారు. విదేశీ వాణిజ్య విధానాన్ని తెచ్చి ఎగుమతుల పెంపు, భారీగా ఉపాధి కల్పనకు దోహదపడ్డారు.
రచయిత కూడా..
వందల కోట్లకు అధిపతి అయిన కమల్‌నాథ్ రాజకీయ నాయకుడిగానే కాక పారిశ్రామిక వేత్తగా, వ్యవసాయదారుడిగా, సామాజిక సేవకుడిగా కూడా రాణించారు. ‘ఇండియాస్ ఎన్విరాన్మెంటల్ కన్‌సర్న్స్’, ‘ఇండియాస్ సెంచరీ’, ‘భారత్ కీ శతాబ్ది’ పేరుతో పుస్తకాలు కూడా రాశారు.
Comments
Please login to add a commentAdd a comment