సచివాలయ ఉద్యోగుల ధర్నా
♦ ఎస్‌వో, ఏఎస్‌వోల విభజన అర్ధంతరంగా వాయిదా
♦ నినాదాలతో హోరెత్తించిన ఉద్యోగ సంఘాలు
సాక్షి, హైదరాబాద్: సచివాలయ సెక్షన్ అధికారులు (ఎస్‌వో), సహాయ సెక్షన్ అధికారుల (ఏఎస్‌వో) విభజన కోసం బుధవారం కమల్‌నాథన్ కమిటీ నిర్వహించిన సమావేశం రసాభాసగా మారి అర్ధంతరంగా ముగిసింది. టీఎన్జీవోలు, ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం (అప్సా) నేతలు ఆందోళనకు దిగి నినాదాలతో హోరెత్తించడంతో సచివాలయంలోని డి-బ్లాక్ దద్దరిల్లింది. కమల్‌నాథన్ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ సమావేశం ప్రారంభంలోనే ఎస్‌వోలకు సంబంధించిన సమాచారం అసమగ్రంగా ఉందని టీఎన్జీవోల నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు.
23 ఎస్‌వో ఖాళీలతో పాటు అత్యంత రహస్య విభాగంలోని మరో 14 ఎస్‌వో పోస్టుల ఖాళీలను చూపకపోవడాన్ని ప్రశ్నించారు. ఈ ఖాళీలను ప్రకటించిన తర్వాతే సెక్షన్ అధికారుల విభజన జరపాలని, అప్పటి వరకు వాయిదా వేయాలని కోరారు. అయితే, కమల్‌నాథన్ కమిటీ ఎస్‌వోలతో పాటు ఏఎస్‌వోల విభజనను సైతం వాయిదా వేయడం వివాదానికి దారితీసింది. తక్షణమే ఏఎస్‌వోల విభజన పూర్తి చేయాలి అంటూ టీఎన్జీవోలు, అప్సా నేతలు, ఏఎస్‌వోలు ఆందోళనకు దిగారు.
తెలంగాణ సచివాలయంలో 145 ఏఎస్‌వో పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఏపీలో పనిచేస్తున్న 79 మంది తెలంగాణ ఉద్యోగులను సొంత రాష్ట్రానికి కేటాయించాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో ఏపీకి కేటాయించిన నాలుగో తరగతి తెలంగాణ ఉద్యోగులు, డ్రైవర్లు తమను తిరిగి తెలంగాణకు కేటాయించాలని ఆందోళనకు దిగారు. ఏఎస్‌వోలకు నాలుగో తరగతి ఉద్యోగులు, డ్రైవర్లు తోడు కావడంతో డి-బ్లాక్ కమిటీ హాల్ దద్దరిల్లింది. ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడటంతో పోలీసులు రంగంలోకి దిగి శాంతింపజేశారు.
ఎస్‌వో ఖాళీలను ప్రకటించాలి
రాష్ట్ర విభజన నాటికి ఖాళీగా ఉన్న 23 ఎస్‌వో పోస్టులతో పాటు రహస్య విభాగంలోని 14 ఎస్‌వో పోస్టుల ఖాళీలను సైతం ఆన్‌లైన్‌లో ఉంచాలని టీఎన్జీవోల నేతలు డిమాండు చేశారు. భార్యభర్తలిద్దరికీ ఏపీ స్థానికత ఉంటే స్పౌజ్ కేటగిరీ కింద అలాంటి వారిని తెలంగాణకు కేటాయించవద్దని కోరారు. ఆరోగ్య కారణాలను సైతం పరిగణనలోకి తీసుకోకూడదని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌తో సమానంగా విజయవాడ, గుంటూరులో వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని గుర్తు చేశారు. ఏపీలో పనిచేస్తున్న 79 మంది ఏఎస్‌వోలను తెలంగాణకు కేటాయించే విషయంలో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు సానుకూలంగా ఉన్నా కమల్‌నాథన్ కమిటీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.
త్వరలో మళ్లీ కమల్‌నాథన్ కమిటీ భేటీ
ఎస్‌వో, ఏఎస్‌వోల విభజన పూర్తి అయితే సచివాలయ ఉద్యోగుల విభజన పూర్తికానుంది. ఈ రెండు కేడర్లు మినహా సచివాలయంలోని మిగిలిన 8 కేడర్ల ఉద్యోగుల విభజనను ఇప్పటికే కమల్‌నాథన్ కమిటీ పూర్తి చేసింది. కోర్టు కేసులతో చాలా కాలంపాటు ఎస్‌వో, ఏఎస్‌వోల విభజనకు బ్రేక్ పడింది. ఇటీవల న్యాయపర ఇబ్బందులు తొలగిపోవడంతో ఈ రెండు కేడర్ల ఉద్యోగుల విభజన ప్రక్రియను కమల్‌నాథన్ కమిటీ చేపట్టింది. తాజా సమావేశం రసాభాసగా మారడంతో త్వరలో మళ్లీ సమావేశం నిర్వహించే అవకాశముంది.