శివరాజ్‌సింగ్ చౌహాన్(పాత చిత్రం)
భోపాల్: మధ్యప్రదేశ్ సచివాలయంలో ‘వందేమాతరం’ ఆలపించకపోవడం కాంగ్రెస్, బీజేపీల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్ సచివాలయంలో ప్రతినెల మొదటి పని దినం రోజున వందేమాతర గేయాన్ని ఆలపించాలని అప్పట్లో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. కాగా, జనవరి 1వ తేదీన మాత్రం సచివాలయంలో వందేమాతర గేయాన్ని ఆలపించలేదు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన మాజీ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డారు.
ట్విటర్ వేదికగా కాంగ్రెస్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన చౌహాన్.. వందేమాతరం కేవలం జాతీయ గేయం మాత్రమే కాదని.. అది దేశభక్తిగా ప్రతీక అని తెలిపారు. సచివాలయంలో వందేమాతర గేయాన్ని ఆలపించే ఆనవాయితీని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. వందేమాతర గేయం ప్రజల హృదయాల్లో నూతన ఉత్తేజాన్ని కలిగిస్తుందన్నారు. ప్రభుత్వాలు వస్తాయి.. పోతాయి.. కానీ దేశం, దేశభక్తి కన్నా ఏది ఎక్కువ కాదనే విషయాన్ని కాంగ్రెస్ మరచిపోరాదని వ్యాఖ్యానించారు. అదే విధంగా క్యాబినేట్ మీటింగ్ ప్రారంభానికి ముందు కూడా వందేమాతరాన్ని ఆలపించాలని కోరారు. ప్రభుత్వం దీనిపై స్పందించని పక్షంలో జనవరి 6వ తేదీ ఉదయం 11 గంటలకు దేశభక్తులతో కలిసి సచివాలయ ప్రాంగణంలో తను వందేమాతర గేయాన్ని ఆలపిస్తానని తెలిపారు.
శివరాజ్ సింగ్ చౌహాన్ వ్యాఖ్యలపై స్పందించిన మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్.. వందేమాతర గేయం ఆలపించని వారికి దేశభక్తి ఉండదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూపేంద్ర గుప్తా మాట్లాడుతూ.. ఎస్సార్ మొహంతి మంగళవారం రోజున సీఎస్‌గా బాధ్యతలు చేపట్టారని.. అధికారులు ఆ పనుల్లో బిజీగా ఉండటం వల్ల వందేమాతరాన్ని ఆలపించే కార్యక్రమం నిర్వహించలేకపోయి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. వందేమాతర గేయంపై బీజేపీ ఎందుకు రాద్ధాంతం చేస్తుందని నిలదీశారు.
Comments
Please login to add a commentAdd a comment