
భోపాల్: మధ్యప్రదేశ్ సెక్రటేరియట్‌లో శనివారం ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది. సెక్రటేరియట్ భవన సముదాయం ‘వల్లభ భవన్’లోని మూడో అంతస్తులో మొదలైన మంటలు 4, 5 అంతస్తులకు కూడా వ్యాపించాయి. ఆయా అంతస్తుల్లోని ఫైళ్లు, ఇతర ఫరి్నచర్ పూర్తిగా కాలిపోయాయి. నీళ్ల ట్యాంకర్లతోపాటు సుమారు 50 అగ్ని మాపక శకటాలతో వచ్చిన సిబ్బంది దాదాపు ఏడు గంటలపాటు శ్రమించి మంటలను సాయంత్రం 4 గంటల సమయానికి అదుపులోకి తెచ్చారు.
శనివారం సెలవు కావడంతో ప్రభుత్వ కార్యాలయాలన్నీ మూతబడి ఉన్నాయి. ప్రమాదం జరిగిన సమయంలో భవన సముదాయంలో దాదాపుగా ఎవరూ లేరని అధికారవర్గాలు పేర్కొన్నాయి. ఘటనపై సవివర దర్యాప్తు కోసం సీఎం మోహన్ యాదవ్ అదనపు చీఫ్ సెక్రటరీ మహ్మద్ సులెమాన్ సారథ్యంలో ఏడుగురు సభ్యులతో కమిటీ వేశారు. 15 రోజుల్లోగా నివేదిక అందించాలని ఆదేశించారు.
2003లో బీజేపీ అధికారంలోకి వచ్చాక వల్లభ్ భవన్ జరిగిన అయిదో అగ్ని ప్రమాదమని కాంగ్రెస్ ఆరోపించింది. అవినీతి సాక్ష్యాలు బయటపడకుండా చేసేందుకే సెక్రటేరియట్‌లో అగ్ని ప్రమాదం అంటూ బీజేపీ ప్రభుత్వం కుట్ర పన్నిందని విమర్శించింది. ఘటనపై సీబీఐ దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేస్తూ ఆపార్టీ నేతలు సెక్రటేరియట్ వెలుపల రెండు గంటలపాటు నిరసన చేపట్టారు.