vande mataram
-
ఒడిస్సీ బాలినీస్ నృత్యాల వందేమాతర సంగమం!
బంకిమ్ చంద్ర ఛటోపాధ్యాయ విరచిత ‘వందేమాతరం‘ ఖ్యాతి మరోసారి విశ్వ యవనికపై తొణికిసలాండింది! వియత్నాంలోని బాలీలోని భారతీయ దౌత్య కార్యాలయం దీనికి వేదికైంది. భారత నృత్య శైలుల్లో ఒకటైన ఒడిస్సీకి బాలినీస్ శైలి కూడా తోడైంది. వందేమాతరమంటూ.. పదాలు సొగసుగా కదిలాయి. హావభావాలు వ్యక్తమయ్యాయి. ఈ వీడియో కాస్తా ఇప్పుడు నెట్లో వైరల్‌గా మారింది. పలువురి అభిమానాన్ని చూరగొంటోంది. ఎందుకు? ఏమిటి? ఎలా? చూసేయండి మరి! కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా బాలిలో వందేమాతరం పాటకు ప్రత్యేక శైలిలో నృత్య ప్రదర్శన జరిగింది. భారతదేశ 74వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా బాలిలో నిర్వహించారు. ఇది ఒడిస్సీ, బాలినీస్ సంప్రదాయ నృత్యాలను మిక్స్ చేసిన నృత్య ప్రదర్శన. ఇది ఎంతగా ఆకట్టుకుంటుందంటే..ప్రేక్షకులు మైమరిచి చూస్తుండి పోయేంతగా! ఆ యువతులిద్దరూ చాలా చక్కటి అభినయంతో చేశారు. బంకిం చంద్ర ఛటోపాధ్యాయ రాసిన జాతీయ గీతం వందేమాతరం పాట ప్రతి భారతీయుడిలో దేశభక్తి ఉప్పొంగేలే చేస్తుంది. తెలియని అనుభూతి కలిగుతుంది. అలాంటి అద్భుతమైన గీతానికి చక్కటి నృత్యంతో అబ్బురపరిచారు ఆ యువతులు. ఈ నృత్య ప్రదర్శన ఇచ్చిన ఇద్దరు యువతుల్లో ఒకరు బాలిలో ఒడిస్సీ టీచర్ డా పాంపిపాల్ కాగా, మరోకరు బాలినీస్ డ్యాన్సర్ మెలిస్సా ఫ్టోరెన్స్ షిల్లెవోర్ట్. ఇద్దరు వేర్వేరు డ్యాన్సర్లు కలిసి ఒక దేశ భక్తి పాటకు ఇచ్చి ఈ ప్రదర్శన అద్భుతః ! అన్నంతగా నెటిజన్లను ఆకట్టుకుంది. Vandhe Maatram - Odissa & Bali dancers pic.twitter.com/hzj4bSv26o — Aviator Anil Chopra (@Chopsyturvey) April 11, 2024 (చదవండి: అత్యంత ఖరీదైన టీకప్పు..ధర వింటే షాకవ్వుతారు!) -
‘ఫోన్ లిఫ్ట్ చేసి హలో కాదు.. వందేమాతరం అనండి’
Vande Mataram While Answering Calls.. దేశవ్యాప్తంగా 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. ఢిల్లీలోని ఎర్రకోటలో జాతీయ జెండాను ఎగురవేశారు. కాగా, స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల వేళ మహారాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి సుధీర్ ముంగంటివార్ కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రి సుధీర్ ముంగంటివార్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ఇక నుంచి మహారాష్ట్రలో ప్రభుత్వ అధికారులు, కార్మికులకు కీలక సూచన చేశారు.. వీరంతా తమ ఫోన్లు లిఫ్ట్ చేసిన వెంటనే హలో అని కాకుండా వందేమాతరం సమాధానం ఇవ్వాలని ఆర్డర్ వేశారు. కాగా, హలో అనే ఇంగ్లీష్ పదం.. అందుకే దాన్ని వదులుకోవడం మంచిది. వందేమాతరం అనేది కేవలం పదం కాదు, ప్రతీ భారతీయుడు అనుభవించే అనుభూతి అని ఆయన స్పష్టం చేశారు. భారతీయులు 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా ఆజాదీకా అమృత్ మహోత్సవ్ జరుపుకుంటున్నారు. అందుకే, అధికారులు హలో బదులుగా ఫోన్లో 'వందేమాతరం' అని చెప్పాలని తాను కోరుకుంటున్నాను అని తెలిపారు అయితే, దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు త్వరలోనే విడుదల కానున్నాయని మంత్రి క్లారిటీ ఇచ్చారు. ఇక, మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే పోర్ట్‌ఫోలియోలను అప్పగించిన కొద్దిసేపటికే మంత్రి సుధీర్ ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. మరోవైపు.. మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే ఆదివారం మంత్రులకు శాఖలను అప్పగించారు. ఇందులో డిప్యూటీ సీఎం, హోం శాఖ, ఆర్థిక శాఖలను దేవేంద్ర ఫడ్నవీస్‌కు అప్పగించి.. పట్టణ అభివృద్ధి శాఖ, పబ్లిక్ వర్క్స్ (పబ్లిక్ ప్రాజెక్ట్స్) పోర్ట్‌ఫోలియోలను సీఎం షిండే తీసుకున్నారు. బీజేపీ మంత్రి రాధాక్రిష్ణ విఖే పాటిల్ కొత్త రెవెన్యూ శాఖ బాధ్యతలు, బీజేపీ మంత్రి సుధీర్ ముంగంటివార్ అటవీ శాఖను అప్పగించారు. #Maharashtra minister Sudhir Mungantiwar directed his officials in the department to start telephonic conversations with 'Vande Mataram' instead of greeting a phone call with a 'hello' (@sahiljoshii) https://t.co/yUaWLV17oE — IndiaToday (@IndiaToday) August 15, 2022 ఇది కూడా చదవండి: 75 ఏళ్లలో ఎన్నో ఒడిదుడుకులు.. పేదలకు సాయం నా లక్ష్యం: ప్రధాని మోదీ -
Azadi Ka Amrit Mahotsav 2022: వెండితెరపై వందేమాతరం
సినీ ప్రేక్షకులకు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలు మరో ఏడాది పాటు కొనసాగనున్నాయి. ఎలాగంటే రానున్న రోజుల్లో పలు దేశభక్తి చిత్రాలు వెండితెరపై సందడి చేయనున్నాయి. ఓవైపు సినిమాలు.. మరోవైపు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ వేదికగా దేశభక్తి ఉప్పొంగనుంది. పలువురు స్వాతంత్య్రోద్యమ వీరుల చరిత్రలు, కాల్పనిక కథలతో దేశభక్తి చిత్రాలు రూపొందుతున్నాయి. వెండితెరపై వందేమాతరం అంటూ రానున్న ఆ ప్రాజెక్ట్స్ విశేషాలు తెలుసుకుందాం. బయోపిక్‌ల వెల్లువ స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్న పలువురు స్వాతంత్య్ర సమర యోధుల జీవితాల ఆధారంగా పలు చిత్రాలు నిర్మాణంలో ఉన్నాయి. భారత స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న అతి పిన్న వయస్కుడైన ఖుదీరామ్ బోస్ జీవితం వెండితెరపైకి రానుంది. ‘ఖుదీరామ్ బోస్’ టైటిల్‌తో జాగర్లమూడి పార్వతి సమర్పణలో విజయ్ జాగర్లమూడి నిర్మించారు. ఖుదీరామ్ పాత్రను రాకేష్ జాగర్లమూడి పోషించారు. ఇతర పాత్రల్లో వివేక్ ఒబెరాయ్, అతుల్ కులకర్ణి, నాజర్, రవిబాబు, కాశీ విశ్వనాథ్ కనిపిస్తారు. విద్యాసాగర్ రాజు దర్శకత్వంలో తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, బెంగాలీ, హిందీ భాషల్లో పాన్ ఇండియా సినిమాగా రూపొందిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఆదివారం ఈ చిత్రం మోషన్ పోస్టర్‌ను, ఫస్ట్ లుక్‌ను ప్రముఖ దర్శకుడు మణిరత్నం విడుదల చేశారు. అటు హిందీలో స్వాతంత్య్ర సమర యోధుడు వినాయక దామోదర వీర్ సావర్కర్ జీవితం ఆధారంగా ‘స్వతంత్య్ర్ వీర్ సావర్కర్’ టైటిల్‌తో సినిమా రూపొందుతోంది. వీర్ సావర్కర్ పాత్రను రణ్‌దీప్ హుడా చేస్తున్నారు. నటుడు మహేశ్ మంజ్రేకర్ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే 1971లో భారత్–పాక్ యుద్ధంలో పోరాడిన ఆర్మీ చీఫ్ సామ్ మానెక్ షా జీవితం ఆధారంగా సినిమా రానుంది. ‘సామ్ బహదూర్’ టైటిల్‌తో విక్కీ కౌశల్ టైటిల్ రోల్లో మేఘనా గుల్జార్ దర్శకత్వం వహిస్తున్నారు. 1971 భారత్ – పాక్ యుద్ధంలో పోరాడిన మరో వీర జవాను బ్రిగేడియర్ బల్‌రామ్‌సింగ్ మెహతా జీవిత కథతో రూపొందుతున్న చిత్రం ‘పిప్పా’. బల్రామ్ సింగ్ మెహతా పాత్రను ఇషాన్ కట్టర్ చేస్తున్నారు. బల్రామ్ సింగ్ మెహతా స్వయంగా రాసిన ‘ది బర్నింగ్ చఫీస్’ పుస్తకం ఆధారంగా రాజా కృష్ణమీనన్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. డిసెంబర్ 9న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలను కుంటున్నారు. 1971 యుద్ధంలోనే వీర మరణం పొందిన యువ సైనికుడు అరుణ్ ఖేతర్పాల్ జీవితంతో రూపొందుతున్న చిత్రం ‘ఇక్కీస్’. ఖేతర్పాల్ పాత్రను వరుణ్ ధావన్ పోషిస్తుండగా శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ చిత్రం రిలీజ్ కానుంది. జీవిత కథలు కాదు కానీ.. ఒకవైపు జీవితకథలతో సినిమాలు రూపొందుతుంటే మరోవైపు కాల్పనిక దేశభక్తి చిత్రాలు కూడా రానున్నాయి. వీటిలో ‘భారతీయుడు 2’ ఒకటి. దేశం కోసం ప్రాణాలర్పించడానికి సైతం వెనకాడని స్వాతంత్య్ర సమరయోధుడు సేనాధిపతి దేశానికి పట్టిన చీడపురుగులాంటి కన్న కొడుకుని మట్టుబెట్టే కథతో రూపొందిన చిత్రం ‘ఇండియన్’ (భారతీయుడు). కమల్‌హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రా నికి సీక్వెల్‌గా ‘భారతీయుడు 2’ రానుంది. కమల్‌హాసన్–శంకర్ కాంబినేషన్లోనే సీక్వెల్ రూపొందు తోంది. అటు హిందీలో కార్తీక్ ఆర్యన్ నటిస్తున్న ‘కెప్టెన్ ఇండియా’ యుద్ధం నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం. అయితే ఇది జీవిత కథ కాదు. దేశ చరిత్రలో ఓ కీలక రెస్క్యూ ఆపరేషన్ ఆధారంగా దర్శకుడు హన్సల్ మెహతా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో కార్తీక్ పైలెట్ పాత్ర చేస్తున్నారు. ఫీమేల్ ఓరియంటెడ్ చిత్రాల్లో దేశభక్తి నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం ‘తేజస్’. కంగనా రనౌత్ లీడ్ రోల్లో సర్వేశ్ మేవారి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో కంగన ఎయిర్ ఫోర్స్ ఫైటర్ పైలెట్‌గా నటిస్తున్నారు. ‘ఆకాశాన్ని ఏలాలనుకున్న ఓ మహిళ స్ఫూర్తిదాయకమైన కథ ఇది’ అన్నారు కంగనా రనౌత్. అక్టోబర్ 5న ఈ చిత్రం విడుదల కానుంది. ఓటీటీకి గాంధీ బయోపిక్ జాతి పిత మహాత్మా గాంధీ జీవితంతో వెండితెరపై పలు చిత్రాలు వచ్చాయి. ఇప్పుడు వెబ్ సిరీస్‌గా గాంధీ జీవితం రానుంది. గాంధీ దక్షణాఫ్రికాలో గడిపిన రోజులను, భారత స్వాతంత్య్రం కోసం చేసిన పోరాటాన్ని, గాంధీ జీవితంలో తెలియని కోణాలతో పలు సీజన్లుగా ఈ వెబ్ సిరీస్‌ని రూపొందించనున్నారు. ఈ సిరీస్‌లో గాంధీ పాత్రను ప్రతీక్ గాంధీ పోషించనున్నారు. ప్రముఖ చరిత్రకారుడు, రచయిత రామచంద్ర గుహ రచించిన ‘గాంధీ బిఫోర్ ఇండియా’, ‘గాంధీ: ద ఇయర్స్ దట్ ఛేంజ్డ్ ద వరల్డ్’ పుస్తకాల ఆధారంగా దర్శకుడు హన్సల్ మెహతా ఈ సిరీస్‌ను తెరకెక్కించనున్నారు. ఇంకా పలు దేశభక్తి చిత్రాలు, వెబ్ సిరీస్‌లు రానున్నాయి. -
వందేమాతరం అంటూ భవనం పై నుంచి దూకేసిన దొంగ.. షాక్‌లో పోలీసులు
ఇటీవలకాలంలో దొంగలు చాలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. విచిత్రమైన వాటిని దొంగలించి ప్రజలను, పోలీసులను షాక్‌కి గురి చేస్తున్నారు. సినిమాలోని డాన్లు మాదిరి దొంగతనం చేసి తప్పించుకోవడం వంటివి చేస్తున్నారు. అచ్చం అలానే ఇక్కడొక వ్యక్తి దొంగతనానికి వచ్చాడు. ఐతే సమయానికి పోలీసులు వచ్చేయడంతో...ఆ వ్యక్తి అరెస్టు అవుతానన్న భయంతో ఏం చేశాడో వింటే కచ్చితంగా షాక్ అవుతారు. అసలేం జరిగిందంటే....ముంబైలో కొలాబా ప్రాంతంలోని చర్చ్‌గేట్ సమీపంలోని ఒక భవనంలోకి 25 ఏళ్ల వ్యక్తి ప్రవేశించాడు. ఆ భవనం వాచ్మెన్ ఒక అపరిచిత వ్యక్తి గేటు పై నుంచి దూకి భవనంలోకి ప్రవేశించనట్లు గమనించాడు. దీంతో అతను ఎమర్జెన్సీ అలారం మోగించాడు. ఆ అలారం మోగడంతో భవనంలోని నివాసితులు అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించారు. ఇంతలో పోలీసులు కూడా సంఘటన స్థలానికి సమయానికి చేరుకున్నారు. దీంతో సదరు వ్యక్తి అరెస్టు అవుతానన్న భయంతో ఆ భవనం పైన నాల్గో అంతస్తులోని కిటికి అంచునే నిలబడిపోయాడు. అతన్ని కిందకి వచ్చేయమని పోలీసులు, నివాసితులు చెప్పిన అతను వినలేదు. ఆఖరికి అతన్ని అరెస్టు చేయమని పోలీసులు హామీ ఇచ్చిన అతన కన్విన్స్ అవ్వలేదు. ఇక చేసేదేమీ లేక పోలీసులు అగ్నిమాపక సిబ్బందిని కూడా రప్పించారు. వారు అతన్ని ప్లాస్టిక్ వలపైకి దూకేయమని కోరారు కూడా. దాదాపు మూడు గంటలపాటు అతన్ని ఒప్పించేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. ఇంతలో ఒక పోలీసు సేఫ్టి బెల్ట్ సాయంతో దొంగ వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించాడు. అంతే సదరు దొంగ వందేమాతరం అంటూ అరుస్తూ... నాల్గో అంతస్తు నుంచి దూకేశాడు. దీంతో ఒక్కసారిగా పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, నివాసితులు షాక్ అయ్యారు. ఈ ఘటన అక్కడ ఉన్నవారందర్నీ కలచి వేసింది. వెంటనే పోలీసులు ఆ వ్యక్తిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. సదరు వ్యక్తిని రోహిత్‌గా గుర్తించమని పోలీసులు చెప్పారు. ఐతే అతను చికిత్స పొందుతూ మృతి చెందడంతో అతని గురించి పూర్తి విషయాలు తెలియరాలేదని పోలీసులు వెల్లడించారు. (చదవండి: తోటి విద్యార్థినిపై సామూహిక అత్యాచారం.. వీడియో తీసి) -
జైహింద్ స్పెషల్: తెల్లవారిని తుపాకులతో కాల్చుట
జాతీయతా భావాలనే మనసావాచా నమ్మిన మేధోవర్గాన్నీ, ఉద్యమ సారథ్యాన్నీ ఇచ్చిన పరిణామం వందేమాతరం ఉద్యమం. ఆ ఉద్యమం తెలుగువారికి అందించిన మేధో సంపన్నుడు, పత్రికా రచయిత ముట్నూరి కృష్ణారావు. ఆయన సంపాదకీయాల సంకలనం ‘లోవెలుగులు’ ఆధునిక జాతీయతా చైతన్యానికి గీత వంటిది. జాతిలో ఆ పెను నిద్రను వదిలించడానికి ఆయన ‘కృష్ణాపత్రిక’ను సాధనంగా చేసుకున్నారు. 1902 ఫిబ్రవరి 1న మచిలీపట్నంలో ప్రారంభమైన ‘కృష్ణాపత్రిక’కు 1907లో బెంగాల్ విభజన వ్యతిరేకోద్యమం నుంచి తిరిగి వచ్చిన తరువాత ముట్నూరివారు సంపాదకులయ్యారు. కృష్ణాపత్రికలో ‘తెల్లవారిని తుపాకులతో కాల్చుట’ అన్న వ్యాసం ప్రచురించినందుకు నాలుగేళ్ల పాటు సంపాదకత్వానికి దూరంగా ఉన్నా, మళ్లీ వచ్చి కొన ఊపిరి వరకు పత్రికను నడిపించారు. చదవండి: జైహింద్ స్పెషల్: పెన్నులతో గన్నుల పైకి కాశీనాథుని నాగేశ్వరరావు 1908లో ఆంధ్రపత్రిక వారపత్రిక, 1914లో ఆంధ్రపత్రిక దినపత్రిక స్థాపించిన స్వాతంత్య్ర సమరయోధుడు. భారతీయ పత్రికా రంగ చరిత్రను చేర్చకుండా ఎలాగైతే భారత స్వాతంత్య్ర సమర చరిత్ర సంపూర్ణం కాదో, తెలుగుప్రాంతాలలో జరిగిన ఉద్యమ చరిత్ర పరిపూర్ణం కావాలంటే ఆంధ్రపత్రిక చరిత్రను అలాగ అధ్యయనం చేయాల్సిందే. స్వాతంత్య్ర పోరాటానికి సంపూర్ణ మద్దతు ఇచ్చిన పత్రిక ఇది. స్వాతంత్య్ర సమరయోధులను ఎన్నో విధాలుగా ఆదుకున్న సంస్థ కూడా. గాడిచర్ల హరిసర్వోత్తమరావు బెంగాల్ విభజన వ్యతిరేకోద్యమంలో లాల్, పాల్, బాల్ ఇచ్చిన సందేశాలతో ఉత్తేజితుడైన గాడిచర్ల విద్యార్థి దశలోనే నేరుగా ఉద్యమంలో చేరారు. 1907లోనే బెజవాడ నుంచి ‘స్వరాజ్య’ వారపత్రికను ఆరంభించారు. పింగళి లక్ష్మీనారాయణ, బోడి నారాయణరావు ఆయనకు సహకరించారు. 1908లో గాడిచర్ల ‘విపరీత బుద్ధి’ పేరుతో సంపాదకీయం రాశారు. దానితో మూడేళ్లు కారాగార శిక్ష విధించారు. ఈ కేసులో అరెస్టు చేసినప్పుడు ఆయనకు సంకెళ్లు వేసి బెజవాడ వీధుల నుంచి తీసుకువెళ్లారని చెబుతారు. మద్రాస్ ప్రెసిడెన్సీలో జాతీయ భావాల వ్యాప్తికి శ్రమించిన ‘ఆంధ్రపత్రిక’ తొలి సంపాదకుడు గాడిచర్ల వారే. అలాగే మద్రాస్ ప్రెసిడెన్సీలో జైలుకు వెళ్లిన తొలి స్వాత్రంత్య సమరయోధుడూ ఆయనేనని కూడా అంటారు. వెల్లూరు కారాగారంలో ఆయన కఠోర అనుభవాలు చవిచూశారు. దత్తమండలాలుగా పేరొందిన ప్రాంతానికి రాయలసీమ పేరు ఇచ్చినది, ఎడిటర్ అన్న ఇంగ్లిష్ పదానికి సంపాదకుడు అన్న అనువాదాన్ని ఇచ్చిందీ గాడిచర్ల వారే. చిలకమర్తి లక్ష్మీనరసింహం బిపిన్ చంద్ర పాల్ 1907లో రాజమండ్రి వచ్చినప్పుడు వారి ఉపన్యాసాన్ని అనువదించినవారు చిలకమర్తి లక్ష్మీనరసింహం. గొప్ప కవి, నాటకకర్త, జాతీయవాది. ఆనాటి సభలో ఆశువుగా వినిపించినదే, ‘భరతఖండంబు చక్కని పాడియావు..’ పద్యం. 1906లో ఆయన రాజమండ్రిలో ‘మనోరమ’ పేరుతో పత్రిక స్థాపించారు. 1909లో ‘దేశమాత’ పత్రికను నెలకొల్పారు. మనోరమ సాహిత్యానికి పరిమితమైనా, దేశమాతను పేరుకు తగ్గట్టే వెలువరించారు. చిలకమర్తి బెంగాల్ సంఘ సంస్కర్తల జీవితాలను తన పత్రికల ద్వారా తెలుగువారికి పరిచయం చేశారు. దేశమాత పత్రిక ప్రారంభించడానికి ఆయన ప్రభుత్వం నుంచి వ్యతిరేకత ఎదుర్కొన్నారు. కాంగ్రెస్ సంపాదక వర్గం గాంధీజీ పిలుపుతో స్వరాజ్య సమరంలోకి వచ్చినా, తన వార్తాపత్రిక ‘కాంగ్రేసు’ను మాత్రం తీవ్ర జాతీయవాదుల భావాలకు వేదికగా చేశారు మద్దూరి అన్నపూర్ణయ్య. 1921 మే మాసంలో, మద్దూరి సంపాదకునిగా మొదట సైక్లోస్టయిల్డ్ పత్రికగా అది ఆరంభమైంది. రాజమహేంద్రవరం నుంచి ప్రచురణ ప్రారంభించి, తరువాత సుబ్రహ్మణ్యం ప్రారంభించిన సీతానగరం గౌతమీ సత్యాగ్రహాశ్రమానికి తరలింది. రాజమండ్రికి 23 కిలోమీటర్ల దూరంలోని ఈ ఆశ్రమానికి దక్షిణాది సబర్మతి అని పేరు. ఇంకా క్రొవ్విడి లింగరాజు, శ్రీరామచంద్రుని వెంకటప్ప, చండ్రుపట్ల హనుమంతరావు సంపాదక మండలిలో ఉన్నారు. కానీ పత్రిక వెలువడిన ఒక దశాబ్దకాలంలో (1921–1932) వీరిలో ఎవరో ఒకరు కారాగారంలో ఉంటూ వచ్చారు. 1929 మే నెల కాంగ్రేసు 1857 ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామ సంస్మరణ సంచికగా వెలువడింది. ఇందులోనే అచ్చయిన ‘చిచ్చుర పిడుగు’ అన్న నాటిక అప్పుడే ఆ ఆశ్రమాన్ని సందర్శించిన గాంధీజీని కలవరపరచడమే కాదు, మద్దూరిని రెండున్నరేళ్లు కారాగారంలో ఉంచింది. నిజానికి అది రామచంద్రుని వెంకటప్ప రచన. రచయిత పేరు వేయలేదు. కానీ పోలీసులు కేసు పెట్టడంతో సంపాదకుడు కాబట్టి మద్దూరి బాధ్యత వహించి జైలుకు వెళ్లారు. భగత్‌సింగ్ బలిదానాన్ని శ్లాఘిస్తూ ‘వీరబలి’ పేరుతో సంపాదకీయం రాసినందుకు, వాడపల్లి (తూర్పు గోదావరి జిల్లాలో ఊరు. వెంకటేశ్వరస్వామి ఉత్సవంలో పోలీసులు కాల్పులు జరిపారు. ఏడుగురు చనిపోయారు) కాల్పుల వార్తలు ఇచ్చినందుకు ప్రభుత్వం ఈ పత్రిక మీద నిఘా ఉంచింది. చివరికి 1932 జనవరిలో మద్రాస్ గెజెట్ ‘కాంగ్రేసు’ చట్ట వ్యతిరేకమని ప్రకటించింది. జనవరి 12న పోలీసులు ఆశ్రమం మీద దాడి చేసి పత్రిక ఆస్తులన్నీ ధ్వంసం చేశారు. సురవరం ప్రతాపరెడ్డి మే 10, 1926న ప్రతాపరెడ్డి సారథ్యంలో ప్రారంభమైన ‘గోలకొండ పత్రిక’ సంపాదకీయాలు నిజాం ప్రభుత్వాన్ని భయపెట్టేవి. రాజ్యంలో వాస్తవాలను తెలియచేసేందుకు సురవరం ప్రతాపరెడ్డి ఈ పత్రిక స్థాపించారు. సంపాదకునిగా మొదట్లో ఆయన పేరు లేకున్నా, అన్నీ ఆయనే. సురవరం బహుభాషావేత్త, సాహిత్యవేత్త. నిజాం సంస్థానంలో నవాబు నడిపిన ‘మీజాన్’ తెలుగు వెర్షన్‌కు అడవి బాపిరాజు సంపాదకులు. అందులో నవాబు వ్యతిరేకోద్యమ వార్తలకూ ఆయన చోటిచ్చారు. మందుముల నరసింగరావు ‘రయ్యత్’ పత్రిక పూర్తిగా నిజాం వ్యతిరేక పత్రిక. ఇక ‘ఇమ్రోజ్’ ఉర్దూ పత్రిక నిర్వాహకుడు, రచయిత షోయబుల్లా ఖాన్‌ను రజాకార్లు హైదరాబాద్‌లో హత్యచేశారు. ఇక్కడ ప్రస్తావించిన పత్రికలు, పత్రికా రచయితల పేర్లు చరిత్ర అనే సాగరం నుంచి తీసిన ఒక్క బొట్టులో భాగం మాత్రమే. స్వాతంత్య్ర సమరం, పత్రికలు సాగించిన ఉద్యమం వేరు చేసి చూడడం సాధ్యం కాదన్నది చారిత్రక వాస్తవం. వందలాది పత్రికలు, వందలాది మంది పత్రికా రచయితలు స్వాతంత్య్రోద్యమానికి అంకితం కావడం తిరుగులేని వాస్తవం. 1947 వరకు ఏ పత్రిక ఆశయమైనా దేశ స్వాతంత్య్ర సాధనే. దీనికి భూమికను అందించిన నిన్నటి సాంస్కృతిక పునరుజ్జీవనోద్యమంలో పత్రికలు నిశ్శబ్ద కర్తవ్యాన్ని నిర్వహించాయి. స్వాతంత్య్రోద్యమానికి గళం ఇచ్చాయి. పత్రికా రచన ఇంకొక మహత్కార్యం కూడా నెరవేరుస్తూ ఉంటుంది. చరిత్ర రచనకు ఆలంబన నిన్నటి వార్తాపత్రికలే. జాఫ్రీ సి వార్డ్ అన్నట్లు... ‘జర్నలిజం ఈజ్ మియర్లీ హిస్టరీస్ ఫస్ట్ డ్రాఫ్ట్’ . – డా. గోపరాజు నారాయణరావు, ఎడిటర్, ‘జాగృతి -
అమోఘం.. అద్భుతం: మోదీ
న్యూఢిల్లీ: నాలుగేళ్ల చిన్నారి ఎస్తేర్ హమ్నాట్ ప్రస్తుతం ఇంటర్నెట్లో తెగ వైరలవుతోంది. ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీ సైతం చిన్నారిపై ప్రశంసలు కురిపించారు. ఇక నెటిజన్ల ప్రశంసలకైతే హద్దే లేకుండా పోయింది. మరి ఇంతకు ఆ చిన్నారి ఏం చేసింది.. ఎందుకు ఇన్ని ప్రశంసలు అందుకుంటుందో తెలియాలంటే ఇది చదవాల్సిందే. బంకీమ్ చంద్ర చటోపాధ్యాయ వందేమాతం వర్షన్‌ని ఆస్కార్ అవార్డ్ గ్రహీత, ప్రఖ్యాత భారతీయ సంగీతకారుడు ఏఆర్ రెహమాన్ చేసి ‘మా తూజే సలాం’ పేరిట రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. ఈ పాటను మిజోరాంకు చెందిన నాలుగేళ్ల చిన్నారి ఎస్తేర్ హమ్నాట్ అంతే హృద్యంగా పాడింది. చిన్నారి ప్రతిభకి మిజోరాం ముఖ్యమంత్రి జోరామ్‌తంగ ఫిదా అయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియోని ట్విట్టర్లో షేర్ చేశారు. ఇది కాస్త ప్రధాని మోదీ దృష్టిని ఆకర్షించింది. (చదవండి: అప్పులపాలై ఇంటికి తిరిగొచ్చిన పిల్లి!) మోదీ కూడా హమ్నేట్ టాలెంట్‌కు ముగ్దుడయ్యారు. ‘ఎస్తేర్ హమ్నేట్ వందేమాతర ప్రదర్శన అమోఘం.. అద్భుతం’ అని ప్రశంసిస్తూ జోరామ్‌తంగ ట్వీట్‌ని రీ ట్వీట్ చేశారు. ఇప్పటికే అమితాబ్ వంటి పెద్దల ప్రశంసలు పొందిన హమ్నేట్.. ఇప్పుడు ఏకంగా ప్రధాని మెప్పు కూడా పొందింది. దాంతో సోషల్ మీడియాలో తెగ వైరలయిన ఈ వీడియో.. మోదీ ప్రశంసలతో మరో సారి వెలుగులోకి వచ్చింది. ‘ప్రియమైన సోదర సోదరీమణులారా, మీరు భారతీయులని గర్వపడండి, ఇది ప్రేమ, సంరక్షణ, ఆప్యాయతలకు పుట్టిల్లు. మనోహరమైన వైవిధ్యత దీని సొంతం’ అనే క్యాప్షన్‌తో యూట్యూబ్‌లో షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. -
వందేమాతరం ఆలపించకపోవడంపై బీజేపీ ఆగ్రహం
భోపాల్: మధ్యప్రదేశ్ సచివాలయంలో ‘వందేమాతరం’ ఆలపించకపోవడం కాంగ్రెస్, బీజేపీల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్ సచివాలయంలో ప్రతినెల మొదటి పని దినం రోజున వందేమాతర గేయాన్ని ఆలపించాలని అప్పట్లో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. కాగా, జనవరి 1వ తేదీన మాత్రం సచివాలయంలో వందేమాతర గేయాన్ని ఆలపించలేదు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన మాజీ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డారు. ట్విటర్ వేదికగా కాంగ్రెస్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన చౌహాన్.. వందేమాతరం కేవలం జాతీయ గేయం మాత్రమే కాదని.. అది దేశభక్తిగా ప్రతీక అని తెలిపారు. సచివాలయంలో వందేమాతర గేయాన్ని ఆలపించే ఆనవాయితీని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. వందేమాతర గేయం ప్రజల హృదయాల్లో నూతన ఉత్తేజాన్ని కలిగిస్తుందన్నారు. ప్రభుత్వాలు వస్తాయి.. పోతాయి.. కానీ దేశం, దేశభక్తి కన్నా ఏది ఎక్కువ కాదనే విషయాన్ని కాంగ్రెస్ మరచిపోరాదని వ్యాఖ్యానించారు. అదే విధంగా క్యాబినేట్ మీటింగ్ ప్రారంభానికి ముందు కూడా వందేమాతరాన్ని ఆలపించాలని కోరారు. ప్రభుత్వం దీనిపై స్పందించని పక్షంలో జనవరి 6వ తేదీ ఉదయం 11 గంటలకు దేశభక్తులతో కలిసి సచివాలయ ప్రాంగణంలో తను వందేమాతర గేయాన్ని ఆలపిస్తానని తెలిపారు. శివరాజ్ సింగ్ చౌహాన్ వ్యాఖ్యలపై స్పందించిన మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్.. వందేమాతర గేయం ఆలపించని వారికి దేశభక్తి ఉండదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూపేంద్ర గుప్తా మాట్లాడుతూ.. ఎస్సార్ మొహంతి మంగళవారం రోజున సీఎస్‌గా బాధ్యతలు చేపట్టారని.. అధికారులు ఆ పనుల్లో బిజీగా ఉండటం వల్ల వందేమాతరాన్ని ఆలపించే కార్యక్రమం నిర్వహించలేకపోయి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. వందేమాతర గేయంపై బీజేపీ ఎందుకు రాద్ధాంతం చేస్తుందని నిలదీశారు. -
వందేమాతరం ప్రాథమిక హక్కా!
న్యూఢిల్లీ: తమిళనాడులోని అన్ని పాఠశాలలో జాతీయ గీతం ‘వందేమాతరం’ను వారానికోసారైనా ఆలపించాలని, అలాగే అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో నెలకోసారైనా పాడాలని మద్రాస్ హైకోర్టు మంగళవారం నాడిచ్చిన సంచలన తీర్పుపై న్యాయనిపుణులే అవాక్కవుతున్నారు. ఈ తీర్పుకు, ఈ తీర్పుకు దారితీసిన పిటిషన్‌కు ఎలాంటి సంబంధం లేకపోవడమే అందుకు కారణం. వందేమాతరం గీతాన్ని ముందుగా ఏ భాషలో రాశారంటూ ఓ ఉద్యోగ నియామక పరీక్షల్లో అడిగిన ప్రశ్నకు తాను ‘బెంగాలీ భాషలో’ అంటూ సరైన సమాధానం ఇచ్చినప్పటికీ తనకు మార్కులు పడలేదంటూ ఓ నిరుద్యోగి పిటిషన్ దాఖలు చేయగా, హైకోర్టు జడ్జీ మురళీధరన్ పిటిషన్‌తో సంబంధం లేకుండా తీర్పు చెప్పారు. పౌరులుగా జాతీయ గీతాన్ని, జాతీయ జెండాను గౌరవించడం అందరి బాధ్యతని, అన్ని పాఠశాలల్లో, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో, క్రీడా మైదానాల్లో విధిగా జాతీయ గీతాన్ని ఆలపించాలని, దీన్ని వివిధ వర్గాల ప్రజలు పాటించాలని ఆయన తీర్పు చెప్పారు. రాజ్యాంగంలోని మూడవ విభాగం, 226వ అధికరణం కింద తన ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు పౌరుడు కోర్టుకు వెళ్లవచ్చని, ఈ కేసులో పిటిషనర్ ఉద్యోగం నియామకం కోసం జరిగిన పరీక్షలో ప్రశ్నకు సరైన సమాధానం చెప్పినప్పటికీ మార్కులు ఇవ్వకపోవడాన్ని ప్రాథమిక హక్కుల కింద సవాల్ చేయవచ్చని న్యాయనిపుణులు చెబుతున్నారు. వందేమాతరం గీతాన్ని ఆలపించడం పౌరల ప్రాథమిక హక్కు కిందకు రానప్పుడు తీర్పు అలా ఎలా ఇస్తారని వారు అశ్చర్యపడుతున్నారు. పైగా సుప్రీం కోర్టు గత ఫిబ్రవరి నెలలో ‘వందేమాతరం’ గీతాలాపన ప్రాథమిక హక్కు కింద తప్పనిసరి చేయాలన్న డిమాండ్‌ను నిర్ద్వంద్వంగా త్రోసిపుచ్చింది. వందేమాతరం అనే జాతీయ గీతాలాపనం గురించి ప్రస్తావన భారత రాజ్యాంగంలో ఎక్కడా లేనందున తాము అలాంటి ఉత్తర్వులను ఇవ్వలేమని స్పష్టం చేసింది. ఇప్పుడు మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పు సుప్రీం కోర్టు తీర్పునకు పూర్తి విరుద్ధంగా ఉంది. సరైనా కారణాలుంటే పౌరులు వందేమాతరం పాడకుండా ఉండవచ్చని కూడా హైకోర్టు తెలిపింది. అయితే ఆ సరైన కారణాలేమిటో తెలియజేయలేదు. 2016, నవంబర్ నెలలో సినిమా థియేటర్లు తప్పనిసరిగా జాతీయ గేయం ‘జన గణ మన అధినాయక జయహే’ ఆలపించాలని, అప్పుడు పౌరులందరూ లేచి నిలబడాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఆ తర్వాత కొన్ని థియేటర్లలో జాతీయ గేయాలాపన వస్తున్నప్పుడు దివ్యాంగులు లేవకపోవడం వల్ల, తమ మతం అనుమతించదంటూ ముస్లింలు లేవకపోవడం వల్ల తోటి ప్రేక్షకుల చేతుల్లో వారు తన్నులు తినాల్సి వచ్చింది. మినహాయింపుకు సరైన కారణాలు సూచించనట్లయితే వందేమాతరం విషయంలో కూడా అలాంటి హింసాత్మక సంఘటనలు జరగవచ్చు. ఈ దేశంలో ‘సబ్ కుచ్ చల్తే హై దేశ్భక్తికే నామ్‌పే’. -
వందేమాతరంపై సంచలన తీర్పు..
చెన్నై: జాతీయ గేయం వందేమాతరంపై మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. బంకించంద్ర ఛటర్జీ రచించిన జాతీయ గేయం వందేమాతరాన్ని అందరూ పాడాల్సిందేనని తీర్పునిచ్చింది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు తప్పనిసరిగా జాతీయ గేయాన్ని ఆలపించాల్సిందేనని స్పష్టం చేసింది. వారంలో అది కూడా సోమ, శుక్రవారల్లో ఒకసారైనా పాడాలని తెలిపింది. ఈ మేరకు తీర్పునిస్తూ జస్టిస్ ఎంవీ మురళీధరణ్ తీర్పునిచ్చారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రవేట్ పాఠశాలల్లో వారానికి ఒకసారి, ప్రభుత్వ ప్రవేటు కార్యాలయ్యాల్లో నెలకోసారైన జాతీయ గేయాన్ని పాడాలన్నారు. బెంగాళీ, సంస్కృతం కఠినంగా ఉంటే తమిళంలోకి తర్జుమా చేసుకొని పాడాలని సూచించారు. ఒక వ్యక్తిలేదా, వ్యవస్థ పాడకుండా ఉంటే దానికి ఏదైనా బలమైన కారణం చూపించాలని జస్టిస్ మురళీధరణ్ పేర్కొన్నారు. -
సీఎం యోగి వ్యాఖ్యలతో వివాదం!
వందేమాతరం పాడకపోవడం దురుద్దేశమేనని కామెంట్ లక్నో: జాతీయగేయం వందేమాతరంపై ఉత్తరప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కొత్త వివాదానికి తెరలేపారు. వందేమాతరం పాడకపోవడం తీవ్రమైన విషయమని, దీనిని తీవ్రంగా పరిగణించి పరిష్కరించాల్సిన అవసరముందని ఆయన అన్నారు. ఈ విషయంలో దురుద్దేశపూరితంగా వ్యవహరించేవారితో ఎలా ఎదుర్కోవాలనే దానిపై దృష్టి పెట్టాల్సిన అవసరముందని చెప్పారు. ‘కొంతమంది వ్యక్తులు ఇప్పుడు తాము వందేమాతరం పాడబోమని పేర్కొంటున్నారు. వందేమాతరం పాడకపోవడం తీవ్రమైన విషయం.. వందేమాతరం పాడకపోవడం దురుద్దేశపూరితమే. ప్రతి ఒక్కరూ వందేమాతరం పాడాల్సిందే’ అని సీఎం యోగి అన్నారు. లక్నోలో శనివారం జరిగన ఓ పుస్తకావిష్కరణ సభలో సీఎం యోగి ప్రసంగించారు. అయితే, తమ ప్రభుత్వం ఏకైక అజెండా అభివృద్ధి మాత్రమేనని స్పష్టం చేశారు. 21వ శతాబ్దంలో కూడా ‘వందేమాతరం’ పాడకపోవడం అనేది అత్యంత చర్చనీయాంశంగా మార్చకూడదని పేర్కొన్నారు. యూపీలోని కొన్ని మున్సిపాలిటీలలో వందేమాతరం పాడటంపై అభ్యంతరాలు వ్యక్తమైన నేపథ్యంలో సీఎం యోగి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మీరట్ మున్సిపాలిటీ కార్పొరేషన్ సమావేశంలో వందేమాతరం పాడకపోవడంపై వివాదం రేగింది. అలాగే అలహాబాద్ మున్సిపాలిటీ కార్పొరేషన్ సమావేశంలో వందేమాతరం పాడటాన్ని తప్పనిసరి చేయాలంటూ బీజేపీ తీర్మానం పెట్టగా.. ఎస్పీ, ఇతర సభ్యులు తీర్మానాన్ని వ్యతిరేకించారు. -
వందేమాతరం ‘హోదా’ ఏమిటి?
- దేశ స్వాతంత్య్ర పోరాటంలో ముఖ్య భూమిక - జనం హృదయాల్లో నిలిచిపోయిన గేయం - చట్ట, రాజ్యాంగపరమైన గుర్తింపు మాత్రం లేదు! ‘వందేమాతరం’ గేయం భారత స్వాతంత్య్ర పోరాటంలో ముఖ్య భూమిక పోషించింది. స్వేచ్ఛా వాయువులు పీల్చాలనే భారతీయుల కాంక్షకు భావో ద్వేగ భూమికగా నిలిచింది. ఎందరో పోరాట యోధు లు వందేమాతరం ఆలపించి జైలు జీవితం అనుభవించారు. అంతగా పోరాట స్ఫూర్తిని నింపిన ‘వందేమాతరం’ గేయం దేశ స్వాతంత్య్రానంతరం తగిన గౌరవం పొందినా.. చట్టపరమైన, రాజ్యాంగపరమైన గుర్తింపు, రక్షణ దక్కలేదు. ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో వందేమాతరం ఆలపించలేదని ఏడుగురు ముస్లిం కౌన్సెలర్ల సభ్యత్వాన్ని రద్దు చేస్తూ తీర్మానించారు. తాము వందేమాతరం ఆలపించబోమని, అయినా తమ సభ్యత్వం రద్దు చెల్లదని ఆ కౌన్సెలర్లు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘వందేమాతరం’ గేయం, దానికి చట్టపర గుర్తింపునకు సంబంధించిన పరిస్థితి వివరాలివీ.. స్వాతంత్య్ర కాంక్షకు ప్రతీక బంకిమ్ చంద్ర చటర్జీ 1876లోనే వందేమాతరం గేయాన్ని రాశారు. అయితే విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ స్వరాలు కూర్చి ఆలపించాక బాగా ప్రాచు ర్యంలోకి వచ్చింది. 1896లో కోల్‌కతాలో జరిగిన కాంగ్రెస్ వార్షిక సభలో రవీంద్రుడు వందేమాతరం గేయాన్ని ఆలపించారు. అనంతర కాలంలో అది దేశవ్యాప్తమైంది. దేశభక్తికి, «బ్రిటిష్ పాలనపై ధిక్కారానికి ప్రతీకగా నిలిచింది. వందేమాతరం అని నినదించి ఎందరో జైలు జీవితాలు అనుభవించారు. 1911లో ఠాగూర్ ‘జనగణమన’ను రచించారు. దాన్ని ఆ ఏడాది డిసెంబర్ చివర్లో కోల్‌కతాలో జరిగిన కాంగ్రెస్ వార్షిక సమావేశాల్లో ఆలపించారు. 1947 ఆగస్టు14న రాత్రి 11 గంటలకు సమావేశమైన భారత రాజ్యాంగ సభ కూడా ఎజెండాలో మొదటి అంశంగా వందేమాతరంలోని మొదటి చరణాన్ని ఆలపించింది. ముస్లింలీగ్ అభ్యంతరం మేరకు మొత్తం గీతాన్ని పాడలేదు. సమావేశం చివర్లో జనగణమనను పాడారు. స్వాతంత్య్రం వచ్చాక వందేమాతరం, జనగణమనల్లో ఏది జాతీయ గీతంగా ఉండాలనే చర్చ ప్రారంభమైంది. రాజ్యాంగ సభ దీనిపై నిర్ణయాన్ని వెలువరించాలి. కాంగ్రెస్ ‘జనగణమన’ వైపు మొగ్గింది. కారణం.. బహిరంగ రహస్యమే. ముస్లింలను నొప్పించకూడదని! రాజ్యాంగ సభ చివరి సమావేశం 1950 జనవరి 24న జరిగింది. తీర్మానం ప్రవేశపెట్టి.. చర్చ అనంతరం అవసరమైతే ఓటింగ్ చేపట్టాలని భావించారు. కానీ ఆ అవసరం రాకుండా.. నాటి పెద్దలంతా ఒక అవగాహనకు వచ్చారు. దాంతో రాజ్యాంగ సభ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్.. ‘‘జనగణమన.. భారతదేశానికి జాతీయగీతంగా ఉంటుంది. దేశ స్వాతంత్య్ర పోరాటంలో చారిత్రక పాత్రను పోషించిన వందేమాతరం గేయాన్ని జనగణమనతో సమానంగా గౌరవించాలి. తప్పకుండా సమాన హోదా ఉండాలి..’’ అని ప్రకటించారు. ‘వందేమాతరం’పై నిబంధనలేమీ లేవు! ► రాజ్యాంగ, చట్టపరమైన రక్షణలేవీ వందేమా తరం గేయానికి లేవు. ► 1971 డిసెంబర్ 23న జాతీయ చిహ్నలను అవ మానించడాన్ని నిరోధించే చట్టాన్ని ప్రభుత్వం తెచ్చింది. రాజ్యాంగం, జాతీయజెండా, జాతీయ గీతాలను అవమానించకుండా నిరోధించే నిబంధనలను అందులో పొందుపర్చారు. కానీ జాతీయగీతంతో సమాన హోదా ఉండాల్సిన జాతీయగేయం ‘వందేమాతరం’ ప్రస్తావన ఆ చట్టంలో ఎక్కడాలేదు. ► 1976లో రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక విధులను రాజ్యాంగంలోని ‘ఆర్టికల్51ఎ’లో పొందుపర్చారు. ‘ప్రతి భారత పౌరుడు రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలి. రాజ్యాంగ విలువలను, సంస్థలను, జాతీయజెండాను, జాతీయ గీతాన్ని గౌరవించాలి’ అని అందులో పేర్కొన్నారు. అందులోనూ వందేమాతరం ప్రస్తావన లేదు. ► జాతీయ గేయమైన వందేమాతరానికి జనగణమనతో సమాన హోదా కల్పించాలని, ఆ మేరకు చట్ట సవరణ చేసేలా ఆదేశించాలని కోరుతూ గతేడాది నవంబర్‌లో గౌతమ్ ఆర్ మొరార్కా అనే వ్యక్తి ఢిల్లీ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ► ఈ పిల్ దాఖలైన తర్వాత.. ‘ఏయే సందర్భాల్లో వందేమాతరం ఆలపించాలనే విషయానికి సంబంధించి ఎలాంటి నిబంధనలు లేవు. వందేమాతరం గేయానికి న్యాయం జరగాలంటే ఆ మేరకు నిబంధనలను రూపొందించాల్సిన అవసరముంది’ అని ప్రభుత్వం 2016 నవంబర్ 22న రాజ్యసభకు తెలిపింది. ► మొరార్కా పిల్‌పై హైకోర్టు ఇచ్చిన నోటీసుకు 2017 ఫిబ్రవరి8న కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇచ్చింది.‘‘భారతీయుల మదిలో వందేమాతరం గేయానికి విశిష్ట స్థానముంది. అయితే జనగణమనతో సమానంగా దీనిని చూడలేం. సృజనాత్మకతను గౌరవించడానికి చట్టపరమైన రక్షణ కల్పించడం ఒక్కటే మార్గం కాదు. దేశానికి ఒకే జెండా, ఒకే జాతీయగీతం ఉంటాయి. అలాగని ఇతర గేయాలు, ప్రార్థనలకు తక్కువ గౌరవం ఇచ్చినట్లు కాదు. తమ మనసుకు నచ్చిన గీతాలు, పుస్తకాలు, చిహ్నాలను గౌరవించుకోకుండా పౌరులెవరినీ నిరోధించి నట్లు కాదు..’’ అని కోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో పేర్కొంది. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
వందేమాతరం ‘స్టేటస్’ ఏంటి?
‘వందేమాతరం’ గేయం... భారత స్వాతంత్య్రపోరాటంలో ముఖ్యభూమికను పోషించింది. స్వేచ్ఛా వాయువులు పీల్చాలనే భారతీయుల కాంక్షకు భావోద్వేగ భూమికగా నిలిచింది. బంకిమ్ చంద్ర చటర్జీ 1876లోనే దీన్ని రాసినా... విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ స్వరాలు కూర్చి ఆలపించడంతోనే బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. 1896లో కోల్‌కతాలో జరిగిన కాంగ్రెస్ వార్షిక సభలో రవీంద్రుడు వందేమాతరాన్ని ఆలపించారు. అనంతర కాలంలో దేశవ్యాప్తమైంది. దేశభక్తికి, బ్రిటిష్ పాలనపై దిక్కారానికి ప్రతీకగా నిలిచింది. వందేమాతరం అని నినదించి ఎందరో జైలు జీవితాలు అనుభవించారు. 1911 డిసెంబరులో ఠాగూర్ ‘జనగణమన’ను రచించారు. దీన్ని డిసెంబరు చివర్లో కోల్‌కతాలో జరిగిన కాంగ్రెస్ వార్షిక సమావేశాల్లో ఆలపించారు. 1947 ఆగష్టు 14న రాత్రి 11 గంటలకు సమావేశమైన రాజ్యాంగ సభ కూడా అజెండాలో మొదటి అంశంగా వందేమాతరంలోని మొదటి చరణాన్ని ఆలపించింది. ముస్లిం లీగ్ అభ్యంతరం మేరకు మొత్తం గీతాన్ని పాడలేదు. సమావేశం చివర్లో జనగణమనను పాడారు. స్వాతంత్య్రం వచ్చాక... వందేమాతరం, జనగణమనల్లో ఏది జాతీయగీతంగా ఉండాలనే చర్చ ప్రారంభమైంది. రాజ్యాంగ సభ దీనిపై నిర్ణయాన్ని వెలువరించాలి. కాంగ్రెస్ ‘జనగణమన’ వైపు మొగ్గింది. కారణం... బహిరంగ రహస్యమే. ముస్లింలను నొప్పింపకూడదని. రాజ్యాంగ సభ చివరి సమావేశం 1950 జనవరి 24న జరిగింది. తీర్మానం ప్రవశేపెట్టి...చర్చ అనంతరం అవసరమైతే ఓటింగ్ చేపట్టాలని భావించారు. కానీ ఆ అవసరం రాలేదు. నాటి పెద్దలంతా కలిసి ఒక అవగాహనకు వచ్చారు. దాంతో రాజ్యాంగ సభ అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ ఈ ప్రకటన చేశారు... ‘జనగణమన... భారతదేశానికి జాతీయ గీతంగా ఉంటుంది. దేశ స్వాతంత్య్రపోరాటంలో చారిత్రక పాత్రను పోషించిన వందేమాతరం గేయాన్నీ... జనగణమనతో సమానంగా గౌరవించాలి. తప్పకుండా సమాన హోదా ఉండాలి' ► రాజ్యాంగ, చట్టపరమైన రక్షణలేమీ వందేమాతరం గేయానికి లేవు. ► డిసెంబరు 23, 1971న జాతీయ చిహ్నలకు అవమానాలను నిరోధించే చట్టాన్ని అప్పటి భారత ప్రభుత్వం తెచ్చింది. రాజ్యాంగం, జాతీయ జెండా, జాతీయ గీతాలను అవమానించడకుండా నిరోధించే నిబంధనలను ఇందులో పొందుపర్చారు. జాతీయగీతంతో సమానహోదా ఉండాల్సిన జాతీయ గేయం ‘వందేమాతరం’ ప్రస్తావన ఈ చట్టంలో ఎక్కడా లేదు. ► 1976లో ర్యాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక విధులను చేర్చారు. వీటిని అర్టికల్ 51ఎ... లో పొందుపర్చారు. ‘ప్రతి భారత పౌరుడు రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలి. రాజ్యాంగ విలువలను, సంస్థలను, జాతీయ జెండాను, జాతీయ గీతాన్ని గౌరవించాలి’ అని పేర్కొన్నారు. ఇందులోనూ వందేమాతరం ప్రస్తావన లేదు. ► జాతీయ గేయమైన వందేమాతరానికి జనగణమనతో సమానహోదా కల్పించాలని, ఆ మేరకు చట్ట సవరణ చేసేలా ఆదేశాలు జారీచేయాలని కోరుతూ గత ఏడాది నవంబరులో ఢిల్లీ హైకోర్టులో గౌతమ్ ఆర్ మొరార్కా అనే ఆయన పిల్ దాఖలు చేశారు. ► పిల్ దాఖలైన తర్వాత... ‘ఏయే సందర్భాల్లో వందేమాతరం అలపించాలనే విషయానికి సంబంధించి ఎలాంటి నిబంధనలు లేవు. వందేమాతరం గేయానికి న్యాయం జరగాలంటే ఈ నిబంధనలను రూపొందించాల్సిన అవసరం ఉంది’ అని ప్రభుత్వం నవంబరు 22, 2016న రాజ్యసభకు తెలిపింది. ► మొరార్కా పిల్‌పై హైకోర్టు ఇచ్చిన నోటీసుకు ఫిబ్రవరి 8, 2017న కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. కేంద్రం దాఖలు చేసిన ఆఫిడవిట్లో... ‘‘భారతీయుల మదిలో వందేమాతరం గేయానికి విశిష్టమైన స్థానముంది. అయితే జనగణమనతో సమానంగా దీనిని చూడలేం. సృజనాత్మకతను గౌరవించడానికి చట్టపరమైన రక్షణ కల్పించడం ఒక్కటే మార్గం కాదు. దేశానికి ఒకే జెండా, ఒకే జాతీయగీతం ఉంటాయి. అలాగని ఇతర గేయాలు, ప్రార్థనలకు తక్కువ గౌరవం ఇచ్చినట్లు కాదు. తమ మనసుకు నచ్చిన గీతాలు, పుస్తకాలు, చిహ్నాలను గౌరవించుకోకుండా పౌరులెవరినీ నిరోధించినట్లు కాదు’’ అని పేర్కొంది. వందేమాతరం... పాడనందుకు కౌన్సిలర్ల సభ్యత్వం రద్దు బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ మున్సిపల్ కార్పొరేషన్లో ‘వందేమాతరం’పై వివాదం ముదురుతోంది. ఈ నెల 28న (మంగళవారం) కార్పొరేషన్ సమావేశంలో సభ్యులందరూ లేచి నిలబడి వందేమాతరం ఆలపించడం మొదలుపెట్టారు. ఏడుగురు ముస్లిం కౌన్సిలర్లు వందేమాతరం ఆలపించడానికి నిరాకరించి.. బాయ్‌కాట్ చేసి వెళ్లిపోయారు. బుధవారం సమావేశమైన కార్పొరేషన్ సభ్యులు... ఈ ఏడుగురు కౌన్సిలర్ల సభ్యత్వాన్ని రద్దు చేస్తూ తీర్మానాన్ని ఆమోదించారు.. బీజేపీకి చెందిన మేయర్ హరికాంత్ అహ్లువాలియా ఈ తీర్మానాన్ని ప్రతిపాదించారు. ‘మా మతం... షరియా చట్టాలు వందేమాతరాన్ని అంగీకరించవు. రాజీనామా చేయడానికైనా సిద్ధమే... కానీ వందేమాతరం ఆలపించం’ అని కౌన్సిలర్లు దివాన్జీ షరీఫ్, షాహిద్ అబ్బాసీలు అన్నారు. సభ్యత్వాలను రద్దు చేయడాన్ని తుగ్లక్ చర్యగా అభివర్ణించారు. దీనిపై న్యాయపోరాటం చేస్తామని వెల్లడించారు. –సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
‘మీరు ఈ సమావేశంలో వద్దు పోండి’
లక్నో: వందేమాతరం ఆలపించని ఏడుగురు కార్పొరేటర్లను తాను నిర్వహిస్తున్న సమావేశానికి హాజరుకావొద్దని మీరట్ కార్పొరేషన్ మేయర్ ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లో వారు ఈ సమావేశంలో ఉండకూడదని గదమాయించి అన్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు బయటకొచ్చింది. ఇందులో రికార్డయిన ప్రకారం మీరట్ మున్సిపల్ కార్పొరేషన్ మంగళవారం ఓ ప్రత్యేక సమావేశం నిర్వహించింది. ఇందులో కార్యక్రమాలు ప్రారంభమవడానికి ముందు అంతా వందేమాతరం ఆలపించాలని మీరట్ మేయర్ హరికాంత్ అహ్లువాలియా ఆదేశించారు. ఈయన బీజేపీ నేత. ప్రస్తుతం మీరట్ కార్పొరేషన్లో బీజేపీదే మెజార్టీ. ఈ నేపథ్యంలో అందులో ఉన్న ఓ ఏడుగురు కార్పొరేటర్లు వందేమాతరం ఆలపించబోమని, అసలు అలాంటిది వద్దంటూ తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో ఆయన వారిని అసలు ఆ సమావేశంలో ఉండొద్దని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు వివరణ ఇచ్చే వరకు కూడా మున్ముందు జరగబోవు నగర్ నిఘమ్ సమావేశాలకు హాజరవ్వకూడదని ఆర్డర్ కూడా జారీ చేశారు. అయితే, బలవంతంగా ఎవరితోనూ వందేమాతరం పాడించవద్దని సుప్రీంకోర్టు గతంలో తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. -
అసలైన జాతీయగీతం.. వందేమాతరం
'భారత్ మాతాకీ జై' నినాదం తాలూకు వివాదం ఇంకా చల్లారక ముందే మరో వివాదం మొదలైంది. అసలైన జాతీయగీతం జనగణమణ కాదని, వందేమాతరమే అసలైన జాతీయ గీతమని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి భయ్యాజీ జోషి అన్నారు. ప్రస్తుతం జనగణమణ మన జాతీయ గీతమని, అందువల్ల దాన్ని గౌరవించాల్సిందేనని, అయితే సరైన అర్థం తీసుకుంటే వందేమాతరమే మన జాతీయ గీతం కావాలని ఆయన అన్నారు. ముంబైలో దీన దయాళ్ ఉపాధ్యాయ రీచ్ సంస్థలో మాట్లాడుతూ ఆయనీ విషయం తెలిపారు. అయితే రాజ్యాంగం ప్రకారం జనగణమణ ఉంది కాబట్టి దాన్నే మనం కూడా పరిగణనలోకి తీసుకుంటున్నామన్నారు. జనగణమణ ఎప్పుడో రాశారని, కానీ అందులో అప్పటి ప్రభుత్వాన్ని ఉద్దేశించి రాశారని భయ్యాజీ జోషి అన్నారు. వందేమాతరంలో మాత్రం దేశ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించారని చెప్పారు. ఈ రెండింటి మధ్య తేడా ఇదేనని, రెండింటినీ గౌరవించాల్సిందేనని ఆయన తెలిపారు. వందే మాతరం అంటే.. భరతమాతకు వందనం అని అర్థం. దీన్ని బంకిం చంద్ర చటోపాధ్యాయ రాశారు. ఇది స్వాతంత్ర్య సమరం సమయంలో కీలకపాత్ర పోషించింది. 1950లో దీని మొదటి రెండు పాదాలను కలిపి జాతీయ గేయంగా ప్రకటించారు. -
'వందేమాతరం.. బలవంతంగా పాడించరాదు'
వందేమాతరం గేయాన్ని ఎవరితోనూ బలవంతంగా పాడించొద్దని కేంద్ర మానవ వనరుల శాఖ సహాయమంత్రి ఉపేంద్ర కుశ్వాహ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి. 'వందేమాతరం పాడాలన్న నిర్ణయాన్ని ఎవరిపై రుద్దవద్దు, ఎవరిని బలవంత పెట్టవద్దు' అని రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ(ఆర్ఎల్ఎస్) అధ్యక్షుడు కుశ్వాహ వ్యాఖ్యానించారు. బిహార్ లోని గోపాల్‌గంజ్ జిల్లాలోని కొన్ని పాఠశాలల్లో వందేమాతరం ఆలాపనపై నిషేంధించడం గురించి విలేకరులు మంత్రిని ప్రశ్నించగా ఆయన ఈ విధంగా స్పందించారు. వందేమాతరం ఆలపించాలా? వద్దా? అనే అంశాన్ని ప్రజలకే వదిలేయాలన్నారు. ఏ చట్టం, నిబంధనలు ప్రజలకు ఇబ్బంది కలిగించేలా ఉండవని ఉపేంద్ర కుశ్వాహ ఇటీవలే ప్రస్తాంవించిన విషయం తెలిసిందే. -
వరంగల్‌లో వందేమాతరం
-
నిర్మాత వై.హరికృష్ణ కన్నుమూత
ప్రముఖ నిర్మాత, పంపిణీదారుడు వై.హరికృష్ణ(74) శుక్రవారం రాత్రి 12 గంటల 30 నిమిషాలకు కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన ఊపిరితిత్తుల వ్యాధితో బాధ పడుతున్నారు. హరికృష్ణకు భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. నవయుగ పంపిణీ సంస్థలో చిరు ఉద్యోగిగా కెరీర్ ప్రారంభించిన హరికృష్ణ... అంచెలంచెలుగా ఎదిగి నిర్మాత స్థాయికి ఎదిగారు. తాను నమ్మిన వామపక్ష భావాలను వదలిపెట్టకుండా, సందేశంతో కూడిన చిత్రాలను నిర్మించారు. లక్ష్మీచిత్ర ఫిలింస్ పతాకంపై టి.కృష్ణ దర్శకత్వంలో ఆయన నిర్మించిన ‘వందేమాతరం’, ‘దేవాలయం’ చిత్రాలు అటు అవార్డులను, ఇటు రివార్డులనూ సొంతం చేసుకున్నాయి. అలాగే... అరుణకిరణం, ఇన్స్పెక్టర్ ప్రతాప్, మమతల కోవెల లాంటి విజయవంతమైన చిత్రాలు నిర్మించారాయన. ఇదా ప్రపంచం, కల్యాణ తాంబూలం, పద్మావతి కల్యాణం చిత్రాలతో ప్రేక్షకులకు సందేశాలను అందించారాయన. జనాన్ని జాగృతం చేసే చిత్రాలను నిర్మించిన హరికృష్ణ మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు. ఆయన మరణం పట్ల తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి, నిర్మాతల మండలి తీవ్ర సంతాపాన్ని వెలిబుచ్చాయి.