
వందేమాతరం ప్రాథమిక హక్కా!
వందేమాతరం గీతాన్ని ముందుగా ఏ భాషలో రాశారంటూ ఓ ఉద్యోగ నియామక పరీక్షల్లో అడిగిన ప్రశ్నకు తాను ‘బెంగాలీ భాషలో’ అంటూ సరైన సమాధానం ఇచ్చినప్పటికీ తనకు మార్కులు పడలేదంటూ ఓ నిరుద్యోగి పిటిషన్ దాఖలు చేయగా, హైకోర్టు జడ్జీ మురళీధరన్ పిటిషన్‌తో సంబంధం లేకుండా తీర్పు చెప్పారు. పౌరులుగా జాతీయ గీతాన్ని, జాతీయ జెండాను గౌరవించడం అందరి బాధ్యతని, అన్ని పాఠశాలల్లో, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో, క్రీడా మైదానాల్లో విధిగా జాతీయ గీతాన్ని ఆలపించాలని, దీన్ని వివిధ వర్గాల ప్రజలు పాటించాలని ఆయన తీర్పు చెప్పారు.
రాజ్యాంగంలోని మూడవ విభాగం, 226వ అధికరణం కింద తన ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు పౌరుడు కోర్టుకు వెళ్లవచ్చని, ఈ కేసులో పిటిషనర్ ఉద్యోగం నియామకం కోసం జరిగిన పరీక్షలో ప్రశ్నకు సరైన సమాధానం చెప్పినప్పటికీ మార్కులు ఇవ్వకపోవడాన్ని ప్రాథమిక హక్కుల కింద సవాల్ చేయవచ్చని న్యాయనిపుణులు చెబుతున్నారు. వందేమాతరం గీతాన్ని ఆలపించడం పౌరల ప్రాథమిక హక్కు కిందకు రానప్పుడు తీర్పు అలా ఎలా ఇస్తారని వారు అశ్చర్యపడుతున్నారు. పైగా సుప్రీం కోర్టు గత ఫిబ్రవరి నెలలో ‘వందేమాతరం’ గీతాలాపన ప్రాథమిక హక్కు కింద తప్పనిసరి చేయాలన్న డిమాండ్‌ను నిర్ద్వంద్వంగా త్రోసిపుచ్చింది. వందేమాతరం అనే జాతీయ గీతాలాపనం గురించి ప్రస్తావన భారత రాజ్యాంగంలో ఎక్కడా లేనందున తాము అలాంటి ఉత్తర్వులను ఇవ్వలేమని స్పష్టం చేసింది.
ఇప్పుడు మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పు సుప్రీం కోర్టు తీర్పునకు పూర్తి విరుద్ధంగా ఉంది. సరైనా కారణాలుంటే పౌరులు వందేమాతరం పాడకుండా ఉండవచ్చని కూడా హైకోర్టు తెలిపింది. అయితే ఆ సరైన కారణాలేమిటో తెలియజేయలేదు. 2016, నవంబర్ నెలలో సినిమా థియేటర్లు తప్పనిసరిగా జాతీయ గేయం ‘జన గణ మన అధినాయక జయహే’ ఆలపించాలని, అప్పుడు పౌరులందరూ లేచి నిలబడాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఆ తర్వాత కొన్ని థియేటర్లలో జాతీయ గేయాలాపన వస్తున్నప్పుడు దివ్యాంగులు లేవకపోవడం వల్ల, తమ మతం అనుమతించదంటూ ముస్లింలు లేవకపోవడం వల్ల తోటి ప్రేక్షకుల చేతుల్లో వారు తన్నులు తినాల్సి వచ్చింది. మినహాయింపుకు సరైన కారణాలు సూచించనట్లయితే వందేమాతరం విషయంలో కూడా అలాంటి హింసాత్మక సంఘటనలు జరగవచ్చు. ఈ దేశంలో ‘సబ్ కుచ్ చల్తే హై దేశ్‌భక్తికే నామ్‌పే’.