జాతీయతా భావాలనే మనసావాచా నమ్మిన మేధోవర్గాన్నీ, ఉద్యమ సారథ్యాన్నీ ఇచ్చిన పరిణామం వందేమాతరం ఉద్యమం. ఆ ఉద్యమం తెలుగువారికి అందించిన మేధో సంపన్నుడు, పత్రికా రచయిత ముట్నూరి కృష్ణారావు. ఆయన సంపాదకీయాల సంకలనం ‘లోవెలుగులు’ ఆధునిక జాతీయతా చైతన్యానికి గీత వంటిది. జాతిలో ఆ పెను నిద్రను వదిలించడానికి ఆయన ‘కృష్ణాపత్రిక’ను సాధనంగా చేసుకున్నారు. 1902 ఫిబ్రవరి 1న మచిలీపట్నంలో ప్రారంభమైన ‘కృష్ణాపత్రిక’కు 1907లో బెంగాల్ విభజన వ్యతిరేకోద్యమం నుంచి తిరిగి వచ్చిన తరువాత ముట్నూరివారు సంపాదకులయ్యారు. కృష్ణాపత్రికలో ‘తెల్లవారిని తుపాకులతో కాల్చుట’ అన్న వ్యాసం ప్రచురించినందుకు నాలుగేళ్ల పాటు సంపాదకత్వానికి దూరంగా ఉన్నా, మళ్లీ వచ్చి కొన ఊపిరి వరకు పత్రికను నడిపించారు.
చదవండి: జైహింద్ స్పెషల్: పెన్నులతో గన్నుల పైకి
కాశీనాథుని నాగేశ్వరరావు
1908లో ఆంధ్రపత్రిక వారపత్రిక, 1914లో ఆంధ్రపత్రిక దినపత్రిక స్థాపించిన స్వాతంత్య్ర సమరయోధుడు. భారతీయ పత్రికా రంగ చరిత్రను చేర్చకుండా ఎలాగైతే భారత స్వాతంత్య్ర సమర చరిత్ర సంపూర్ణం కాదో, తెలుగుప్రాంతాలలో జరిగిన ఉద్యమ చరిత్ర పరిపూర్ణం కావాలంటే ఆంధ్రపత్రిక చరిత్రను అలాగ అధ్యయనం చేయాల్సిందే. స్వాతంత్య్ర పోరాటానికి సంపూర్ణ మద్దతు ఇచ్చిన పత్రిక ఇది. స్వాతంత్య్ర సమరయోధులను ఎన్నో విధాలుగా ఆదుకున్న సంస్థ కూడా.
గాడిచర్ల హరిసర్వోత్తమరావు
బెంగాల్ విభజన వ్యతిరేకోద్యమంలో లాల్, పాల్, బాల్ ఇచ్చిన సందేశాలతో ఉత్తేజితుడైన గాడిచర్ల విద్యార్థి దశలోనే నేరుగా ఉద్యమంలో చేరారు. 1907లోనే బెజవాడ నుంచి ‘స్వరాజ్య’ వారపత్రికను ఆరంభించారు. పింగళి లక్ష్మీనారాయణ, బోడి నారాయణరావు ఆయనకు సహకరించారు. 1908లో గాడిచర్ల ‘విపరీత బుద్ధి’ పేరుతో సంపాదకీయం రాశారు. దానితో మూడేళ్లు కారాగార శిక్ష విధించారు. ఈ కేసులో అరెస్టు చేసినప్పుడు ఆయనకు సంకెళ్లు వేసి బెజవాడ వీధుల నుంచి తీసుకువెళ్లారని చెబుతారు. మద్రాస్ ప్రెసిడెన్సీలో జాతీయ భావాల వ్యాప్తికి శ్రమించిన ‘ఆంధ్రపత్రిక’ తొలి సంపాదకుడు గాడిచర్ల వారే. అలాగే మద్రాస్ ప్రెసిడెన్సీలో జైలుకు వెళ్లిన తొలి స్వాత్రంత్య సమరయోధుడూ ఆయనేనని కూడా అంటారు. వెల్లూరు కారాగారంలో ఆయన కఠోర అనుభవాలు చవిచూశారు. దత్తమండలాలుగా పేరొందిన ప్రాంతానికి రాయలసీమ పేరు ఇచ్చినది, ఎడిటర్ అన్న ఇంగ్లిష్ పదానికి సంపాదకుడు అన్న అనువాదాన్ని ఇచ్చిందీ గాడిచర్ల వారే.
చిలకమర్తి లక్ష్మీనరసింహం
బిపిన్ చంద్ర పాల్ 1907లో రాజమండ్రి వచ్చినప్పుడు వారి ఉపన్యాసాన్ని అనువదించినవారు చిలకమర్తి లక్ష్మీనరసింహం. గొప్ప కవి, నాటకకర్త, జాతీయవాది. ఆనాటి సభలో ఆశువుగా వినిపించినదే, ‘భరతఖండంబు చక్కని పాడియావు..’ పద్యం. 1906లో ఆయన రాజమండ్రిలో ‘మనోరమ’ పేరుతో పత్రిక స్థాపించారు. 1909లో ‘దేశమాత’ పత్రికను నెలకొల్పారు. మనోరమ సాహిత్యానికి పరిమితమైనా, దేశమాతను పేరుకు తగ్గట్టే వెలువరించారు. చిలకమర్తి బెంగాల్ సంఘ సంస్కర్తల జీవితాలను తన పత్రికల ద్వారా తెలుగువారికి పరిచయం చేశారు. దేశమాత పత్రిక ప్రారంభించడానికి ఆయన ప్రభుత్వం నుంచి వ్యతిరేకత ఎదుర్కొన్నారు.
కాంగ్రెస్ సంపాదక వర్గం
గాంధీజీ పిలుపుతో స్వరాజ్య సమరంలోకి వచ్చినా, తన వార్తాపత్రిక ‘కాంగ్రేసు’ను మాత్రం తీవ్ర జాతీయవాదుల భావాలకు వేదికగా చేశారు మద్దూరి అన్నపూర్ణయ్య. 1921 మే మాసంలో, మద్దూరి సంపాదకునిగా మొదట సైక్లోస్టయిల్డ్ పత్రికగా అది ఆరంభమైంది. రాజమహేంద్రవరం నుంచి ప్రచురణ ప్రారంభించి, తరువాత సుబ్రహ్మణ్యం ప్రారంభించిన సీతానగరం గౌతమీ సత్యాగ్రహాశ్రమానికి తరలింది. రాజమండ్రికి 23 కిలోమీటర్ల దూరంలోని ఈ ఆశ్రమానికి దక్షిణాది సబర్మతి అని పేరు. ఇంకా క్రొవ్విడి లింగరాజు, శ్రీరామచంద్రుని వెంకటప్ప, చండ్రుపట్ల హనుమంతరావు సంపాదక మండలిలో ఉన్నారు.
కానీ పత్రిక వెలువడిన ఒక దశాబ్దకాలంలో (1921–1932) వీరిలో ఎవరో ఒకరు కారాగారంలో ఉంటూ వచ్చారు. 1929 మే నెల కాంగ్రేసు 1857 ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామ సంస్మరణ సంచికగా వెలువడింది. ఇందులోనే అచ్చయిన ‘చిచ్చుర పిడుగు’ అన్న నాటిక అప్పుడే ఆ ఆశ్రమాన్ని సందర్శించిన గాంధీజీని కలవరపరచడమే కాదు, మద్దూరిని రెండున్నరేళ్లు కారాగారంలో ఉంచింది. నిజానికి అది రామచంద్రుని వెంకటప్ప రచన. రచయిత పేరు వేయలేదు. కానీ పోలీసులు కేసు పెట్టడంతో సంపాదకుడు కాబట్టి మద్దూరి బాధ్యత వహించి జైలుకు వెళ్లారు. భగత్‌సింగ్ బలిదానాన్ని శ్లాఘిస్తూ ‘వీరబలి’ పేరుతో సంపాదకీయం రాసినందుకు, వాడపల్లి (తూర్పు గోదావరి జిల్లాలో ఊరు. వెంకటేశ్వరస్వామి ఉత్సవంలో పోలీసులు కాల్పులు జరిపారు. ఏడుగురు చనిపోయారు) కాల్పుల వార్తలు ఇచ్చినందుకు ప్రభుత్వం ఈ పత్రిక మీద నిఘా ఉంచింది. చివరికి 1932 జనవరిలో మద్రాస్ గెజెట్ ‘కాంగ్రేసు’ చట్ట వ్యతిరేకమని ప్రకటించింది. జనవరి 12న పోలీసులు ఆశ్రమం మీద దాడి చేసి పత్రిక ఆస్తులన్నీ ధ్వంసం చేశారు.
సురవరం ప్రతాపరెడ్డి
మే 10, 1926న ప్రతాపరెడ్డి సారథ్యంలో ప్రారంభమైన ‘గోలకొండ పత్రిక’ సంపాదకీయాలు నిజాం ప్రభుత్వాన్ని భయపెట్టేవి. రాజ్యంలో వాస్తవాలను తెలియచేసేందుకు సురవరం ప్రతాపరెడ్డి ఈ పత్రిక స్థాపించారు. సంపాదకునిగా మొదట్లో ఆయన పేరు లేకున్నా, అన్నీ ఆయనే. సురవరం బహుభాషావేత్త, సాహిత్యవేత్త. నిజాం సంస్థానంలో నవాబు నడిపిన ‘మీజాన్’ తెలుగు వెర్షన్‌కు అడవి బాపిరాజు సంపాదకులు. అందులో నవాబు వ్యతిరేకోద్యమ వార్తలకూ ఆయన చోటిచ్చారు. మందుముల నరసింగరావు ‘రయ్యత్’ పత్రిక పూర్తిగా నిజాం వ్యతిరేక పత్రిక. ఇక ‘ఇమ్రోజ్’ ఉర్దూ పత్రిక నిర్వాహకుడు, రచయిత షోయబుల్లా ఖాన్‌ను రజాకార్లు హైదరాబాద్‌లో హత్యచేశారు.
ఇక్కడ ప్రస్తావించిన పత్రికలు, పత్రికా రచయితల పేర్లు చరిత్ర అనే సాగరం నుంచి తీసిన ఒక్క బొట్టులో భాగం మాత్రమే. స్వాతంత్య్ర సమరం, పత్రికలు సాగించిన ఉద్యమం వేరు చేసి చూడడం సాధ్యం కాదన్నది చారిత్రక వాస్తవం. వందలాది పత్రికలు, వందలాది మంది పత్రికా రచయితలు స్వాతంత్య్రోద్యమానికి అంకితం కావడం తిరుగులేని వాస్తవం. 1947 వరకు ఏ పత్రిక ఆశయమైనా దేశ స్వాతంత్య్ర సాధనే. దీనికి భూమికను అందించిన నిన్నటి సాంస్కృతిక పునరుజ్జీవనోద్యమంలో పత్రికలు నిశ్శబ్ద కర్తవ్యాన్ని నిర్వహించాయి. స్వాతంత్య్రోద్యమానికి గళం ఇచ్చాయి. పత్రికా రచన ఇంకొక మహత్కార్యం కూడా నెరవేరుస్తూ ఉంటుంది. చరిత్ర రచనకు ఆలంబన నిన్నటి వార్తాపత్రికలే. జాఫ్రీ సి వార్డ్ అన్నట్లు... ‘జర్నలిజం ఈజ్ మియర్లీ హిస్టరీస్ ఫస్ట్ డ్రాఫ్ట్’ .
– డా. గోపరాజు నారాయణరావు, ఎడిటర్, ‘జాగృతి
Comments
Please login to add a commentAdd a comment