
అందరిలాగే పోలీసుల విభజన
* రెండు రాష్ట్రాలు సమన్వయంతో మార్గదర్శకాలు రూపొందించుకోవాలి
* కమలనాథన్ కమిటీ సూచన
సాక్షి, హైదరాబాద్: సాధారణ ఉద్యోగుల తరహాలోనే సివిల్ పోలీస్ సిబ్బందిని విభజించాలని కమలనాథన్ కమిటీ సూచించింది. స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, బెటాలియన్లు, గ్రేహౌండ్స్ తదితర ప్రత్యేక విభాగాల విభజనకు సంబంధించి చర్చించాల్సి ఉందని.. రెండు రాష్ట్రాలు సమన్వయంతో మార్గదర్శకాలు రూపొందించుకోవాలని చెప్పింది. ఉద్యోగుల విభజనపై చర్చించేందుకు కమలనాథన్ కమిటీ గురువారం తెలంగాణ సచివాలయంలో సమావేశమైంది.
తాత్కాలిక విభజన జాబితాలపై ఉద్యోగుల నుంచి వచ్చే అభ్యంతరాలను పరిశీలించి.. సంబంధిత విభాగాల ఉన్నతాధికారులు ఇచ్చే నివేదికల ఆధారంగా పరిష్కరించాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతోపాటు పదో షెడ్యూల్లో ఉన్న సంస్థలకు సంబంధించి ఉద్యోగుల విభజనపై చర్చ జరిగింది. నిర్బంధంగా ఆయా సంస్థల్లోని ఉద్యోగులను బదిలీ చేస్తున్నారని ఏపీ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. పదో షెడ్యూలు సంస్థలన్నీ భౌగోళికంగా తెలంగాణ ప్రాంతంలో ఉన్నందున ఇవన్నీ తమ రాష్ట్రానికే చెందుతాయని.. ఉద్యోగుల బదిలీల్లో తప్పేమీ లేదని తెలంగాణ ప్రభుత్వం వివరణ ఇచ్చినట్లు తెలిసింది.
ఉద్యోగుల విషయంలో రెండు రాష్ట్రాలు సామరస్యంతో పరిష్కరించుకోవాలని కమిటీ సభ్యులు సూచించినట్లు సమాచారం. ఈ సమావేశంలో కేంద్ర సిబ్బంది శిక్షణ, వ్యవహారాల శాఖ సంయుక్త కార్యదర్శి అర్చనా వర్మ, రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు రాజీవ్ శర్మ, ఐవైఆర్ కృష్ణారావులు పాల్గొన్నారు. తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ సమావేశంలో పాల్గొన్నప్పటికీ సెలవులో ఉన్న ఏపీ డీజీపీ జేవీ రాముడు హాజరు కాలేదు. దీంతో పోలీసు ఉద్యోగుల విభజనపై చర్చించేందుకు మరోసారి సమావేశం కావాలని ఈ కమిటీ నిర్ణయం తీసుకుంది. అనంతరం రెండు రాష్ట్రాలకు చెందిన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, టెక్నికల్ ఎడ్యుకేషన్, కో ఆపరేటివ్ సొసైటీస్ రిజిస్ట్రార్, గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ విభాగం, పే అండ్ అకౌంట్స్, స్టాంపులు రిజిస్ట్రేషన్ల ఐజీలతో సమావేశమయ్యారు. ఇప్పటికే ఆయా విభాగాల ఉద్యోగులు ఇచ్చిన ఆప్షన్లను పరిశీలించి.. రెండు రాష్ట్రాలకు కేటాయించారు. అందుకు సంబంధించి తాత్కాలిక విభజన జాబితాలను సిద్ధం చేశారు.