మానవ మృగం వికృత క్రీడ
తండ్రి బాధ్యత మరచి వదిలివెళ్లిపోతే.. తల్లే అన్నీ తానై పోషించింది. ఆ తల్లీబిడ్డకు ఏ అండా లేదని తెలుసుకున్న ఓ మృగం బాలికపై కన్నేశాడు. సమయం దొరికినప్పుడల్లా అనుభవించాడు. ఆపై అనుమానం పెంచుకున్నాడు. ఆమె ఆత్మహత్యకు కారకుడయ్యాడు. ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు తానూ ఆత్మహత్యాయత్నం చేశాడు.
* బాలికతో వివాహేతర సంబంధం
* ఆపై అనుమానించి చితకబాదిన వైనం
* అడ్డుకోబోయిన తల్లిపైనా విచక్షణారహితంగా దాడి
* అవమానం తట్టుకోలేక బాధితురాలి బలవన్మరణం
* కేసు నుంచి బయటపడేందుకు ఆత్మహత్యాయత్నం
గుమ్మఘట్ట : అనంతపురం జిల్లా గుమ్మఘట్ట మండలం బీటీపీ గ్రామానికి చెందిన ఆషాబీ(15) సోమవారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. తనతో పాటు తన తల్లిపై అదే గ్రామానికి చెందిన టీడీపీ నేత సోదరుడు బెస్త రఘు దాడి చేసి కొట్టడాన్ని అవమానంగా భావించిన ఆ బాలిక చివరకు బలవన్మరణానికి పాల్పడింది. ఈ సంఘటన తీవ్ర సంచలనం రేపింది. తన బిడ్డ చావుకు కారణమైన రఘుపై చర్యలు తీసుకోవాలని ఆషాబీ తల్లి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఆమె కథనం ప్రకారం...
భర్త నిరాదరణకు గురై...
బీటీపీకి చెందిన గోరీబీ వివాహం రాయదుర్గానికి చెందిన నజీర్‌తో 18 ఏళ్ల కిందట అయింది. వారికి ఆషాబీ పుట్టింది. ఆమె పుట్టిన కొన్నాళ్లకే భార్యాభర్తలిద్దరూ విడిపోయారు. అప్పటి నుంచి గోరీబీ తన కుమార్తెతో కలసి పుట్టింట్లోనే ఉంటోంది. తల్లీ కూలి పనులకు వెళ్తుండగా, కుమార్తె కూడా కుట్టు పని నేర్చుకుంది. వచ్చిన బొటాబొటీ డబ్బులతో ఇద్దరు ఉన్నదాంట్లోనే తిని బతుకున్నారు.
కన్నేసిన కామాంధుడు
తల్లీబిడ్డలకు మగ దిక్కు లేదని గ్రహించిన బెస్త రఘు అనే కామాంధుడు ఆషాబీపై కన్నేశాడు. కొంతకాలంగా తల్లి లేని సమయంలో ఇంటికి వచ్చిపోతూ ఉండేవాడు. ఆ విధంగా ఆ బాలికను లొంగదీసుకున్నాడు. సమయం దొరికినప్పుడల్లా ఆమెను వదిలేవాడు కాదు.
మేనమామ ఇంటికి వెళ్లడంతో...
సోమవారం రాత్రి ఆషాబీ తన మేనమమా ఇంటికి వెళ్లింది. రాత్రి 10 గంటలకు రఘు గోరీబీ ఇంటికెళ్లాడు. ఆ సమయంలో తల్లీబిడ్డ లేకపోవడంతో ఆవేశానికి లోనయ్యాడు. అరగంట తరువాత వారిద్దరూ ఇంటికి రాగానే వారితో పాటు లోనికెళ్లాడు. గడియపెట్టి ‘ఎవర్నడిగి వెళ్లావ్. అంతా నీ ఇష్టమేనా? అంటూ గద్దించాడు. దీంతో గోరీబీ అభ్యంతరం తెలిపింది. మా ఇష్టం. నువ్వెరు చెప్పడానికంటూ ఆమె నిలదీసింది. ఫస్ట్ ఇక్కడి నుంచి బయటకెళ్లంటూ హెచ్చరించింది. మగ దిక్కు లేదని మాపై ఏమిటీ నీ దౌర్జన్యమంటూ ప్రశ్నించింది. ఆమె మాటలు ఆ మృగంలో మరింత ఆక్రోశాన్ని పెంచాయి. అంతే ఆవేశంతో ఊగిపోయాడు రఘు. తల్లీ ఎదుటే ఆషాబీని గొడ్డును బాదినట్లు బాదాడు. అడ్డుకోబోయిన తల్లినీ చితకబాదాడు. రాత్రి వేళ రాద్ధాంతం చేయడంతో ఇరుగు పొరుగు వారు పోగయ్యారు.
అవమానభారం తట్టుకోలేక..
దీంతో అవమానభారంతో కుంగిపోయిన ఆషాబీ విషపు గుళికలు మింగింది. వెంటనే ఆమెను గుమ్మఘట్ట పీహెచ్‌సీకి, అక్కడి నుంచి రాయదుర్గం ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. చికిత్స ప్రారంభించేలోపే ఆషాబీ ప్రాణం విడిచింది.
భయంతో ఆత్మహత్యాయత్నం
ఆషాబీ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుసుకున్న రఘు మంగళవారం తానూ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇదే అనుమానంతో భార్యను కూడా చంపుకున్నాడనికేసు తనకు ఎక్కడ చుట్టుకుంటుందోనన్న భయంతో బెస్త రఘు మంగళవారం పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇలాంటి అనుమానాలతోనే భార్యను కూడా చంపుకున్నాడని, తన కూతురు చావుకు కారణమైన రఘుపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రఘుపై 306 సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ ప్రసాద్ తెలిపారు.