* తెలంగాణకు చెందిన మొత్తం సిబ్బందిని ఇస్తామంటూ ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదన
* అంగీకారం కోరుతూ సీఎస్ రాజీవ్‌శర్మకు ఏపీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు లేఖ
* దీనిపై ఇంకా అభిప్రాయం వెల్లడించని తెలంగాణ ప్రభుత్వం
* టీ సర్కార్ నిర్ణయాన్ని బట్టి ఉద్యోగులను కేటాయించనున్న కమల్‌నాథన్ కమిటీ
సాక్షి, హైదరాబాద్: సచివాలయంతో పాటు హైదరాబాద్‌లోని వివిధ శాఖాధిపతుల కార్యాలయాల్లో పనిచేస్తున్న తెలంగాణకు చెందిన నాలుగో తరగతి ఉద్యోగులను పూర్తిగా తెలంగాణకు ఇస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇందుకు అంగీకారం కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు తెలంగాణ సీఎస్ రాజీవ్ శర్మకు ఇటీవల లేఖ కూడా రాశారు. దీనికి తెలంగాణ ప్రభుత్వం సమ్మతిస్తే... సచివాలయంతో పాటు హైదరాబాద్‌లోని శాఖాధిపతుల కార్యాలయాల్లో పనిచేస్తున్న తెలంగాణకు చెందిన నాలుగో తరగతి ఉద్యోగులందరినీ కమల్‌నాథన్ కమిటీ తెలంగాణకు కేటాయించే అవకాశముంది.
అయితే దీనిపై ఇంకా తెలంగాణ ప్రభుత్వం స్పందించలేదని ఏపీ ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణకు చెందిన నాలుగో తరగతి ఉద్యోగులను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించడంపై వారంతా తీవ్ర నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఆందోళన చేపట్టిన ఉద్యోగులు సచివాలయంలో ధర్నా నిర్వహించినప్పుడు ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు స్వయంగా వారి వద్దకు వచ్చి... తెలంగాణలోనే ఉండేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో కమల్‌నాథన్ కమిటీ మార్గదర్శకాల్లో ఈ మేరకు ఒక ప్రొవిజన్‌ను కూడా పేర్కొంది.
ఎక్కువ శాతం ఇక్కడి వారే..
సచివాలయంలోను, ఇతర శాఖాధిపతుల కార్యాలయాల్లోను ఎక్కువగా తెలంగాణ ప్రాంతానికి చెందిన వారే నాలుగో తరగతి ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. సచివాలయంలో మొత్తంగా 1,419 నాలుగో తరగతి పోస్టులు ఉండగా... అందులో 616 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మిగతా 803 మంది ఉద్యోగుల్లో దాదాపు 70 శాతం వరకూ తెలంగాణకు చెందిన వారే. హైదరాబాద్‌లోని శాఖాధిపతుల కార్యాలయాల్లో మొత్తం 4,161 నాలుగో తరగతి పోస్టులుండగా... ఇందులో 1,208 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
మిగతా 2,953 మంది ఉద్యోగుల్లో 90 శాతం వరకు తెలంగాణకు చెందినవారే ఉన్నారు. పునర్‌వ్యవస్థీకరణ చట్టం ప్రకారం పోస్టులు, ఉద్యోగులను జనాభా నిష్పత్తి మేరకు ఇరు రాష్ట్రాలకు పంపిణీ చేయాల్సి ఉంటుంది. అయితే ఇలాంటి చిరుద్యోగులను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయిస్తే... అక్కడికి వెళ్లి పనిచేయడం చాలా ఇబ్బందిగా మారుతుందనే అభిప్రాయం వ్యక్తమైంది. దీంతో నాలుగో తరగతి ఉద్యోగుల విషయంలో ఇరు రాష్ట్రాలు ఏ రాష్ట్రానికి చెందిన ఉద్యోగులను ఆ రాష్ట్రం తీసుకోవడానికి అంగీకరించిన పక్షంలో... అందుకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని కమల్‌నాథన్ కమిటీ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో తెలంగాణకు చెందిన నాలుగో తరగతి ఉద్యోగులందరినీ తెలంగాణకే ఇచ్చేందుకు సిద్ధమంటూ ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించింది.
వస్తే ఖాళీలన్నీ భర్తీ..
తెలంగాణకు చెందిన నాలుగో తరగతి ఉద్యోగులందరినీ రాష్ట్రానికే ఇస్తే... ప్రస్తుతం ఉన్న ఖాళీలన్నీ వారితో భర్తీ అవుతాయని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. మంజూరై ఖాళీగా ఉన్న నాలుగో తరగతి పోస్టుల్లో.. తెలంగాణకు సచివాలయంలో 265, శాఖాధిపతుల కార్యాలయాల్లో 549 ఖాళీ పోస్టులు వస్తాయి. దీంతో రాష్ట్రానికి చెందినవారు ఎక్కువగా ఉన్నా... ఈ ఖాళీల్లో భర్తీ చేయవచ్చునని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
నాలుగో తరగతి ఉద్యోగులు తెలంగాణకే!
Published Wed, Jan 7 2015 2:17 AM | Last Updated on Mon, Jul 29 2019 5:59 PM
Advertisement
Advertisement