నెలాఖరులోగా 90% ఉద్యోగుల పంపిణీ
కమలనాథన్ కమిటీ నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య 90 శాతం ఉద్యోగుల పంపిణీ ప్రక్రియను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని కమలనాథన్ కమిటీ నిర్ణయించింది. విభజన ప్రక్రియను వేగంగా పూర్తి చేసేందుకు సహకరించాలని రెండు రాష్ట్రాలను కోరింది. కేంద్ర ప్రభుత్వం నుంచి ఒత్తిడి ఉన్నందున మిగిలిన అన్ని శాఖల్లో ఉద్యోగుల పంపిణీపై ప్రత్యేక దృష్టి సారించాలని రెండు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శుల (సీఎస్‌లు)కు సూచించింది.
శుక్రవారం సచివాలయంలో తెలంగాణ సీఎస్ రాజీవ్‌శర్మ, ఏపీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు కమలనాథన్ కమిటీతో భేటీ అయ్యారు. ఆగస్టులో విభజన ప్రక్రియను పూర్తి చేసి సెప్టెంబర్‌లో కేంద్రానికి నివేదికను అందించాల్సి ఉంటుందని కమలనాథన్ వివరించారు. 52 శాఖలకు చెందిన విభజన పూర్తవగా.. ఏ ఉద్యోగులను ఏ రాష్ట్రానికి కేటాయించారనే జాబితాలను కమిటీ ప్రచురించింది.