
వైద్యుల విభజన వివాదంపై సీఎం దృష్టి
♦ నేడు సచివాలయంలో ప్రత్యేక సమావేశం
♦ హాజరుకానున్న కమలనాథన్,వైద్య మంత్రి లక్ష్మారెడ్డి
సాక్షి, హైదరాబాద్: కమలనాథన్ కమిటీ విభజన జాబితాలో తమకు తీరని అన్యాయం జరిగిందంటూ తెలంగాణ ప్రభుత్వ వైద్యులు చేస్తున్న ఆందోళనలపై సీఎం కేసీఆర్ దృష్టి సారించారు. రెండు నెలలుగా రగులుతున్న ఈ వివాదానికి తెర పడకపోవడంతో సీఎం స్వయంగా జోక్యం చేసుకున్నారు. విభజనలో తెలంగాణకు అన్యాయం జరిగిందని వైద్యులు సోమవారం అసెంబ్లీ ప్రాంగణంలో సీఎంను కలసి విన్నవించారు. న్యాయం చేస్తానని ఈ సందర్భంగా సీఎం వారికి హామీ ఇచ్చారు. సీఎం ఆదేశాల నేపథ్యంలో మంగళవారం సచివాలయంలో ప్రత్యేక సమావేశం జరగనుంది. కమలనాథన్ కమిటీ చైర్మన్ కమలనాథన్ సహా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారీ, ప్రభుత్వ వైద్యుల స్టీరింగ్ కమిటీ చైర్మన్ లాలూప్రసాద్, ఇతర నేతలు ఈ సమావేశానికి హాజరుకానున్నారు.
ఆందోళనలు.. చర్చలు...
తెలంగాణకు ఆంధ్రా వైద్యులను కేటాయించారనేది ప్రభుత్వ వైద్యుల ప్రధాన ఆరోపణ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని బోధనాసుపత్రుల్లో 5,824 మంది ప్రభుత్వ వైద్యులున్నారు. విభజన చట్టం ప్రకారం 58:42 నిష్పత్తిన ఏపీకి 3,370, తెలంగాణకు 2,446 పోస్టులు కేటాయించాలి. అయితే కమలనాథన్ కమిటీ ఏపీకి 3,651, తెలంగాణకు 2,173 మందిని కేటాయిస్తూ జాబితా ఇచ్చింది. ఫలితంగా తెలంగాణ నష్టపోయిందని వైద్యులు అంటున్నారు. అలాగే తెలంగాణకు కేటాయించిన 2,173 పోస్టుల్లో 130 మంది వైద్యులు తమను ఏపీకి ఇవ్వాలని దరఖాస్తు చేసుకున్నా వారిని తెలంగాణకు కేటాయించారని ‘తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం’ ఆరోపించింది. ప్రజారోగ్య సంచాలకులు (డీహెచ్) పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, జిల్లా ఆసుపత్రులు, వైద్య విధాన పరిషత్‌ల్లో పనిచేసే 6,310 మంది ప్రభుత్వ వైద్యుల విభజనలోనూ తప్పులు దొర్లాయని లాలూప్రసాద్ ఆరోపిస్తున్నారు. ఈ విషయాన్ని కమలనాథన్ కూడా ఒప్పుకున్నందున డీహెచ్ పరిధిలోని వైద్యుల విభజన జాబితానూ పునఃపరిశీలించాలని కమిటీని వారు కోరుతున్నారు.