సీఎంను కలవనీయలేదని రైతు ఆత్మహత్యాయత్నం
సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ఘటన
- పంటలు ఎండిపోయి.. ఐదు లక్షలు అప్పులుండటంతో మనస్తాపం
- గతంలోనూ ఆత్మహత్యాయత్నం.. ఆదుకుంటామని ప్రభుత్వ పెద్దల హామీ
- సీఎంను కలసి బాధలు చెప్పుకోవాలని వచ్చిన ఆలూరు రైతు మల్లేశ్
- అనుమతి లభించకపోవడంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం
సాక్షి, హైదరాబాద్, గట్టు: అందరికీ తిండిపెట్టే వాడే అయినా ఎవరికీ పట్టని రైతన్న అతను.. ఒకటి తరువాత ఒకటిగా ఐదు బోర్లు వేశాడు. ఒక్కదాంట్లోనూ నీరు పడక ఆందోళన చెందాడు. ఎండుతున్న పంటలు.. అప్పుల భారం.. ఏం చేయాలో తోచక సీఎం వద్ద గోడు వెళ్ల బోసుకుని సాయం కోరాలనుకున్నాడు. కానీ ముఖ్యమంత్రిని కలిసేందుకు భద్రతా సిబ్బం ది అనుమతించక తీవ్ర నిరాశకు లోనయ్యాడు. క్యాంపు కార్యాలయం వద్దే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. జోగు ళాంబ గద్వాల జిల్లా గట్టు మండలం ఆలూరుకు చెందిన రైతు మల్లేశ్ (36) వ్యథ ఇది.
ర్యాలంపాడు రిజర్వాయర్ ముంపు గ్రామ మైన ఆలూరుకు చెందిన రైతు రాంపురం కుర్వ మల్లేశ్. ఆయనకు భార్య సత్యమ్మ, కూతురు మోనిక, కొడుకు అయ్యప్ప ఉన్నారు. వారికి గ్రామశివారులో 2.07 ఎకరాల మెట్ట పొలం ఉంది. అందులో మల్లేశ్ గత మూడేళ్లుగా ఐదు బోర్లు వేశాడు. అందులో ఒక్కదానిలోనే నామ మాత్రంగా నీళ్లు పడ్డాయి. మల్లేశ్ అటు బోర్ల కోసం, ఇటు పంట పెట్టుబడుల కోసం ఐదు లక్షల వరకు అప్పులు చేశాడు. ఆశించిన దిగు బడి రాక, గిట్టుబాటు ధర లభించక ఆవేదన చెందాడు. దీంతో 2015లోనే ఆత్మహత్య చేసు కోవడానికి ప్రయత్నించాడు. అయితే మల్లేశ్ పరిస్థితి గురించి విచారణ చేసి నివేదిక ఇవ్వా ల్సిందిగా సీఎం పేషీ నుంచి రెవెన్యూ అధి కారులకు ఆదేశాలు వచ్చాయి. ఆదుకుంటా మని మల్లేశ్‌కు ప్రభుత్వ పెద్దలు, అధికారులు హామీలిచ్చారు కూడా.. అయినా సాయం అందకపోవడంతో నిరాశకు లోనయ్యాడు.
ప్రభుత్వం ఆదుకోలేదనే ఆవేదనతోనే..
ఏడాది కింద మల్లేశ్ గుడిసె కాలిపోయింది. అందులో ఆయన కుటుంబసభ్యుల సామాన్లు కాలిపోయాయి. దీంతో మల్లేశ్ జీవితంపై విరక్తి చెందాడు. సీఎం కేసీఆర్‌ను కలసి బాధలు చెప్పుకోవాలనుకొని సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చాడు. భద్రతా సిబ్బంది లోనికి వెళ్లనివ్వక పోవడంతో వెంట తెచ్చు కున్న పురుగుల మందు తాగాడు. దీంతో భద్రతా సిబ్బంది వెంటనే మల్లేశ్‌ను గాంధీ ఆసుపత్రికి తరలించారు. మల్లేశ్ కోలుకుం టున్నాడని, ప్రాణాపాయమేమీ లేదని వైద్యులు తెలిపారు.
మల్లేశ్ కుటుంబసభ్యులను కలిసిన కలెక్టర్
సీఎం క్యాంపు ఆఫీసు వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన రైతు మల్లేశ్ కుటుంబాన్ని జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్ రజత్‌కుమార్‌షైనీ కలిశారు. ఆలూరులోని పొలంలో ఉన్న గుడిసె వద్దకు వెళ్లిన ఆయన.. మల్లేశ్ భార్య సత్యమ్మకు ధైర్యం చెప్పారు. కుటుంబ వివరాలు సేకరించి, సమస్యలు తెలుసుకున్నారు.
సీఎం దృష్టికి తీసుకెళ్లేందుకే..
ఆస్పత్రిలో చికిత్స అనంతరం మల్లేశ్ మీడియాతో మాట్లాడారు. అప్పులు తీర్చే మార్గం లేక సీఎంను కలిసేందుకు వచ్చానని, ఆర్థిక ఇబ్బందులతోనే ఆత్మహత్యాయత్నం చేశానని చెప్పారు. తనలాగే ఎంతో మంది రైతులు బోర్లు వేసినా నీళ్లు రాక, పంటలు పండక, అప్పుల పాలై బాధలు పడుతున్నారని... వాళ్లందరి బాధలను సీఎం దృష్టికి తీసుకెళ్లానుకున్నానని పేర్కొన్నారు. ఇప్పటికైనా తనకు ముఖ్యమంత్రిని కలిసే అవకాశం ఇవ్వాలని కోరారు. సీఎంను కలిసే అవకాశం ఇవ్వకుంటే ఆత్మహత్య చేసుకుంటానని పేర్కొన్నారు.
కేసీఆర్‌కు రైతుల ఉసురు తగులుతుంది
సీఎం కేసీఆర్ రైతుల బాధలు పట్టించుకోవడం లేదని... ముఖ్యమంత్రికి రైతుల ఉసురు తగులుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి వ్యాఖ్యానించారు. పంటలకు గిట్టుబాటు ధర రాక, బోర్లు వేసినా నీళ్లుపడక రైతులు అప్పుల పాలవుతున్నారని.. ఆవేదనతో రోజుకొకరు ఆత్మహత్యకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో పాలన తుగ్లక్‌ను మరిపిస్తోందని.. ఉద్యమాల ద్వారానైనా పాలకుల కళ్లు తెరిపిద్దామనుకుంటే కుటిల రాజకీయాలతో అణచివేస్తున్నారని పేర్కొన్నారు. ఇకనైనా రైతులను ఆదుకునే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
– వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి