సాక్షి, సిటీబ్యూరో: కరోనా వైరస్‌తో అందరికంటే ముందు వరుసలో ఉండి పోరాడుతున్న వైద్య సిబ్బంది తీవ్రమైన మానసిక ఒత్తిడితో ఇబ్బంది పడుతున్నారు. గత మూడు నెలలుగా ఇంటికి దూరంగా ఉంటూ..క్యాంటిన్‌లోనే తింటూ...తీవ్రమైన పని ఒత్తిడితో సతమతమవుతున్నారు. పడకల నిష్పత్తికి తగినంత వైద్య సిబ్బంది లేకపోవడంతో ఉన్న వారిపైనే అధిక భారం పడుతోంది. కాంటాక్ట్, ఔట్ సోర్సింగ్ ప్రతిపాదికన పనిచేస్తున్న వైద్య సిబ్బందిని ఇప్పటి వరకు రెగ్యులర్ చేయక పోవడం, కొత్త నియామకాలు లేక పోవడంతో ఉన్న వైద్య సిబ్బందిపై భారం పడుతోంది. కరోనా రోగులకు చికిత్స అందించే రిస్క్ ప్రదేశాల్లో పని చేయడం వారికి కత్తిమీద సాములా మారింది. దీంతో ఇప్పటికే అనేక మంది చెప్పాపెట్టకుండా విధులకు గైర్హాజరవుతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్(టిమ్స్)లో పూర్తి స్థాయి వైద్య సేవలు ఇప్పటి వరకుఅందుబాటులోకి రాక పోవడానికి కూడా ఇదే కారణమని తెలిసింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇక్కడి రోగులకు ఇక సేవలు అందించడం తమ వల్ల కాదని, జిల్లా ఆస్పత్రుల్లోనూ కోవిడ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని వైద్యులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో ప్రభుత్వం ఆ దిశగా ఏర్పాట్లు చేస్తుంది.
ఎక్కడి రోగులకు అక్కడే చికిత్సలు
మార్చి రెండో తేదీన తెలంగాణలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. కరోనా రోగుల నుంచి ఇతర రోగులకు వైరస్ సోకే ప్రమాదం ఉండటం, ఆ తర్వాత కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో గాంధీలోని ఇతర విభాగాలన్నీ ఖాళీ చేయించింది. ఆస్పత్రిని పూర్తిస్థాయి కోవిడ్ సెంటర్‌గా మార్చింది. ఇక్కడ కేవలం పాజిటివ్ కేసులకు మాత్రమే చికిత్స అందించనున్నట్లు ప్రకటించింది. తొలుత 1000 పడకలు ఉండగా, ఆ తర్వాత రోగుల రద్దీ పెరుగుతుండటంతో పడకల సామర్థ్యాన్ని 1500లకు పెంచింది. తాజాగా 1850కి పెంచింది. పడకల సంఖ్య అయితే పెంచింది కానీ..పడకలు, వాటిలోని రోగుల నిష్పత్తికి అనుగుణంగా వైద్య సిబ్బందిని నియమించలేదు. కోవిడ్ నిబంధనల ప్రకారం మొత్తం సిబ్బందిలో 2 బై 3 వంతు డ్యూటీలో ఉంటే.. 1 బై 3 వంతు క్వారంటైన్‌లో ఉండాల్సి వస్తుంది. టీచింగ్ ఆస్పత్రుల్లో కోవిడ్ సెంటర్లు ఏర్పాటు చేయక పోవడం, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కేసులన్నీ గాంధీకే తరలించడం, వైద్య సిబ్బంది, పడకల నిష్పత్తికి మించి రోగులు చేరడంతో చికిత్సల్లో జాప్యం చోటు చేసుకుంటుంది. అన్ని బోధనాసుపత్రులతో పాటు జిల్లా కేంద్రాలు, ఏరియా ఆస్పత్రుల్లోనూ కోవిడ్ సెంటర్లు ఏర్పాటు చేసి, కరోనా చికిత్సలను డీ సెంట్రలైజ్ చేయడం ద్వారా సమస్యను పరిష్కరించవచ్చని వైద్య ఆరోగ్యశాఖ భావిస్తోంది. ఆ మేరకు ఆయా ఆస్పత్రుల్లో పడకలు, ఐసీయూ విభాగాలను సిద్ధం చేసే పనిలో నిమగ్నమైంది. సీరియస్ కండిషన్‌లో ఉన్న రోగులు మినహా మిగిలిన నాన్ సింథమేటిక్ రోగులందరికీ ఆయా జిల్లా ఆస్పత్రుల్లోనే చికిత్సలు అందించనున్నట్లు తెలిసింది.
రోగి బంధువుల ఆగ్రహానికి కారణమిదే..
వైద్యులు కేవలం మందులు రాసి వెళ్లిపోతుంటారు. ఆ తర్వాత రోగి పూర్తి సంరక్షణ బాధ్యత నర్సులదే. ఆస్పత్రిలో రోగుల నిష్పత్తికి తగినంత మంది స్టాఫ్ నర్సులు, వార్డ్‌బోయ్స్ లేరు. 400 మంది నర్సులు ఉంటే..వీరిలో 200 మంది కాంట్రాక్ట్, 100 మంది ఔట్ సోర్సింగ్ ప్రతిపాదికనే పని చేస్తున్నారు. పనికి తగిన వేతనం లేకపోవడం, ఏళ్ల తరబడి పనిచేస్తున్నా ఉద్యోగాలు రెగ్యులర్ కాకపోవడం, ఉద్యోగ భద్రత లేకపోవడంతో కోవిడ్ బాధితుల సేవలకు వారు వెనుకాడుతున్నారు. ఐసోలేషన్ వార్డుల్లోని రోగులకు సహాయంగా బంధువులను అంగీకరించకపోవడం, మలమూత్ర విసర్జనకు వెళ్లే సమయంలో సహాయంగా ఎవరూ లేకపోవడంతో, వారు బాత్‌రూమ్‌ల్లో కాలుజారిపడి చనిపోతున్న ఘటనలూ లేకపోలేదు. అనివార్యంగానే రోగుల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది. ఇటీవల గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల్లోని వెద్యులపై రోగి బంధువుల దాడికి కూడా ఇదే కారణం.
Comments
Please login to add a commentAdd a comment