సాక్షి, హైదరాబాద్: విరామం లేకుండా విధులు నిర్వహిస్తున్న వైద్య సిబ్బందిలో ఓపిక నశిస్తుండటం ఒకవైపు... రోగులకు సేవలందక ఆందోళనలు మరోవైపు.. వెరసి గాంధీ ఆస్పత్రిలో వాతావరణం వేడెక్కుతోంది. రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్య వందల్లో పెరుగుతుండటంతో ఆస్పత్రిపై ఒత్తిడి తీవ్రమవుతోంది. దీంతో వైద్యు లు, సిబ్బంది రోగులకు సకాలంలో సేవలందించడం ప్రహసనంగా మారింది. రోగులకు సమయానుకూలంగా ఆహారాన్ని అందించకపోవడం, దానికి తోడు వైద్యులు పేషంట్ ఆరోగ్యస్థితిని పరీశీలించడంలో జాప్యం కావడంతో పేషంట్లు, వారి అటెండెంట్లు వైద్య సిబ్బందితో వాదనకు దిగుతున్నారు. గత రెండు, మూడ్రోజులుగా వైద్యులు, సిబ్బందిపై దాడులు సైతం జరిగినట్లు అక్కడి సిబ్బంది చెబుతున్నారు. ఈ పరిస్థితులన్నీ వెరసి గురువారం ఏకంగా గాంధీ ఆస్పత్రిలో వైద్యులు ధర్నా చేపట్టే స్థాయికి చేరింది.(గాంధీ ఆస్పత్రిలో మనోజ్ పేరుతో వార్డు)
అసలేం జరుగుతోంది..?
వెయ్యి మంది రోగులను చేర్చుకుని వైద్య సేవలందించే సామర్థ్యమున్న గాంధీ ఆస్పత్రిని కోవిడ్–19 చికిత్సాలయంగా మార్చిన సర్కార్.. దాన్ని 1,850 మంది సామర్థ్యానికి పెంచింది. భవిష్యత్ అవసరాల కు పడకల కెపాసిటీ పెరిగినా.. సిబ్బందిని పెంచలేదు. ఇదే అసలు సమస్యగా మారింది. మరోవైపు కరోనా పేషంట్లకు చికిత్స అందించే డాక్టర్లు, సిబ్బంది రోజూ పూర్తిస్థాయిలో విధులకు హాజరు కావట్లేదు. వైద్యులు, సిబ్బందిని మూడు భాగాలుగా విభజించిన ప్రభుత్వం.. ప్రతి వారం విడతలుగా విధులు కేటాయిస్తోంది. దీంతో మూడింట రెండొంతుల వైద్యులు, సిబ్బంది క్వారంటైన్‌కు వెళ్తుండగా.. మిగతా సిబ్బంది విధులకు హాజరవుతున్నారు. ఈ పరిస్థితుల్లో వాస్తవ సిబ్బందిలో 33 శాతం మందే విధులు నిర్వహిస్తుండగా మరోవైపు సామర్థ్యానికి మించి చేరిన రోగులకు సేవలు అందట్లేదు. గాంధీ ఆస్పత్రికి మంజూరైన పోస్టుల ప్రకారం 350 మంది డాక్టర్లు, పీజీ, హౌస్ సర్జన్లు కలిపి మరో 450 మంది ఉండాలి. వీరితో పాటు 150 మంది రెగ్యులర్ నర్సులు, 200 మంది కాంట్రాక్టు నర్సులు, మరో 2 వేల మంది సెక్యూరిటీ, హౌస్‌కీపింగ్ సిబ్బంది ఉండాలి. ఆస్పత్రికి మంజూరైన 32 విభాగాల డాక్టర్లలో కేవలం జనరల్ మెడిసిన్, నెఫ్రాలజీ, కార్డియాలజీ, అనెస్తీషియా, గైనకాలజీ, పీడియాట్రిక్స్ విభాగాల కు చెందిన వైద్యులే కరోనా రోగులకు చికిత్స చేస్తున్నారు. వేల మంది కరోనా రోగులకు ఇంత తక్కువ మంది డాక్టర్లు ఉండటంతో పరిశీలన గాడి తప్పింది.
అస్తవ్యస్తంగా సౌకర్యాల కల్పన...
డాక్టర్ల సంఖ్య తక్కువగా ఉండడం ఒక కారణమైతే.. పేషంట్స్‌కు అందించాల్సిన సౌకర్యాల్లో తీవ్ర జాప్యం నెలకొంటోంది. కరోనా రోగికి అటెండెంట్ ఉండటం నిబం ధనలకు విరుద్ధం. దీంతో పేషంట్ సాదకబాధకాలన్నీ స్టాఫ్ నర్స్ లేదా వార్డు బాయ్ చూసుకోవాలి. కానీ వీరి సంఖ్య పరిమితంగా ఉండటంతో రోగుల ఆలనపాలన కరువవుతోంది. ఆహారం, మందులు ఇవ్వడంలో జా ప్యం జరుగుతోంది. సిబ్బందిలో మూడింటా రెండొంతు లు క్వారంటైన్‌కు వెళ్తుండగా.. మిగతా వారు మాత్రమే విధులకు వస్తుండటంతో ఈ సమస్య తలెత్తుతోంది.
తొలి ప్రాధాన్యత గాంధీ కావడంతో...
గాంధీ ఆస్పత్రిల్లో కరోనా పేషంట్ల సంఖ్య వేలల్లో ఉంది. రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల్లో 80% గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఉంటున్నాయి. వీరంతా తొలి ప్రాధాన్యత కింద గాంధీకే వెళ్తున్నారు. ఆస్పత్రిలో తొలి వంద కేసులు నమోదైనప్పుడు అత్యంత మెరుగైన సేవలందించినట్లు రోగులు చెప్పారు. అయితే రోగుల సంఖ్య తీవ్రమైనా సేవలందిం చే వైద్యులు, సిబ్బంది మాత్రం పెరగలేదు. దీంతో సేవల కల్పన అస్తవ్యçస్తంగా మారిం ది. మరోవైపు గచ్చిబౌలిలో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన ‘టిమ్స్’ ఇంకా పూర్తిస్థాయి లో అందుబాటులోకి రాలేదు. దీంతో అవిశ్రాంతంగా గాంధీలో సేవలందిస్తున్న సిబ్బందిపై ఒత్తిడి పెరుగుతోంది. వెరసి ఆస్పత్రిలో పరిస్థితులు గందరగోళంగా మారుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment