గాంధీఆస్పత్రి: కోవిడ్–19 నోడల్ కేంద్రమైన సికింద్రాబాద్ గాంధీఆస్పత్రిలో ఇప్పటి వరకు పదివేలకు పైగా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు, 4,056 మంది పాజిటివ్ రోగులతో పాటు మొత్తం 10,128 మందికి వైద్యసేవలు అందించినట్లు గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజారావు వెల్లడించారు. ఈ మేరకు వివరాలతో కూడిన నివేదికను మంగళవారం మీడియాకు విడుదల చేశారు. తీవ్రమైన ఒత్తిడిలోనూ ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వర్తిస్తున్న వైద్యులు, సిబ్బందిని ఆయన అభినందించారు. మార్చి రెండో వారంలో గాంధీ ఆస్పత్రిలో కరోనా తొలి పాజిటివ్ కేసు నమోదైనప్పటి నుంచి ఇప్పటి వరకు పదివేల మందికిపైగా నిర్ధారణ పరీక్షలు, వైద్యచికిత్సలు అందించినట్లు చెప్పారు. సీఎం కేసీఆర్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, వైద్య ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు యుద్ధ ప్రాతిపదికన అన్ని వసతులు, సౌకర్యాలు సమకూర్చుకుని బాధితులకు మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నామన్నారు. 290 మంది 12 ఏళ్లలోపు చిన్నారులతోపాటు నియోనెటాల్ ఇన్సెంటివ్ కేర్ యూనిట్ (ఎన్‌ఐసీయూ)లో 35 మంది నవజాత శిశువులకు వైద్యసేవలు అందించామన్నారు. కరోనా పాజిటివ్ వచ్చిన 135 మంది గర్భిణుల్లో 37 మందికి గైనకాలజీ విభాగ వైద్యులు సిజేరియన్ సర్జరీలు నిర్వహించి తల్లిబిడ్డలకు పునర్జన్మ ప్రసాదించారని వివరించారు. రివకరీ అయిన 3423 మందిని డిశ్చార్జి చేశామన్నారు. ప్రస్తుతం గాంధీఆస్పత్రిలో 535 మంది వైద్యసేవలు పొందుతున్నారని, వీరిలో 220 మంది పరిస్థితి విషమంగా ఉందన్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి ఇన్సెంటివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)లో వైద్యచికిత్సలు అందిస్తున్నామని, కరోనాతో గాంధీలో ఇప్పటివరకు 202 మందితో పాటు వివిధ రుగ్మతలతో మృతి చెందారని ఆయన స్పష్టం చేశారు.
మరణం చివరి అంచుల దాకా..
కరోనాతో పాటు వివిధ రుగ్మతలతో బాధపడుతున్న పలువురు రోగులు ప్రాణాపాయ స్థితిలో మరణం చివరి అంచుల దాకా వెళ్లిన 1,395 మందికి మెరుగైన వైద్యం అందించి పునర్జన్మ ప్రసాదించినట్లు రాజారావు వివరించారు. రోగ నిరోధకశక్తి తక్కువగా ఉన్నవారితో పాటు న్యూమోనియా, కేన్సర్, కిడ్నీ, ఆస్తమా, లీవర్, గుండె సంబంధిత తదితర రుగ్మతలతో బాధపడుతున్న వారిని కరోనా వైరస్ త్వరగా సోకే అవకాశం ఉందన్నారు. ఆయా రుగ్మతల బారిన పడిన 2,074 మంది సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుని డిశ్చార్జి అయ్యారని వివరించారు. ప్రాణాపాయస్థితిలో ఉన్న రోగులకు ఆక్సిజన్, వెంటిలేటర్ సహాయం అందించి, వైరస్‌తో అహర్నిశలూ పోరాడి ప్రాణాలు పోసినట్లు తెలిపారు.
ప్రాణం పోసిన ప్లాస్మాథెరపీ...
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ (ఐసీఎంఆర్) ఆదేశాల మేరకు గాంధీ ఆస్పత్రిలో ప్లాస్మాథెరపీ చికిత్సలు కొనసాగుతున్నాయని రాజారావు తెలిపారు. ఇప్పటి వరకు ఎనిమిది మందికి ప్లాస్మాథెరపీ చికిత్సలు అందించగా వారంతా కోలుకున్నారని, సంపూర్ణ ఆరోగ్యంతో కొంతమందిని డిశ్చార్జి చేశామని వివరించారు.
జాగ్రత్తలు పాటించండి...
భౌతిక దూరంతో పాటు మాస్క్‌లు, శానిటైజర్లు వినియోగించి తగిన జాగ్రత్తలు తీసుకుంటే కరోనా వైరస్ దరిజేరదని గాంధీఆస్పత్రి సూపరింటెండెంట్ రాజారావు స్పష్టం చేశారు. చేతులను నిత్యం పరిశుభ్రం చేసుకోవాలన్నారు. అదే సమయంలో కరోనా భయం వీడాలన్నారు. కరోనా వస్తే మరణం తథ్యమనే అపోహ చాలామందిలో ఉందని, కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగానే తీవ్ర భయాందోళనకు గురికావడంతో శరీరంలోని పలు అవయవాలు సరిగా స్పందించకపోవడంతో సమస్య మరింత జటిలమవుతుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment