సాక్షి, హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల వైద్యుల విభజన తీవ్ర వివాదానికి దారితీసిన నేపథ్యంలో వైద్యుల నుంచి వచ్చే అభ్యంతరాలకు కమల్‌నాథన్ కమిటీ ఈ నెల 24 వరకూ గడువిచ్చింది. గత నెల 29న రాష్ట్ర కేడర్ పోస్టులైన వైద్యులను ఆయా రాష్ట్రాలకు విభజించి.. వివరాలను జనవరి 30న రీఆర్గనైజేషన్ వెబ్‌సైట్‌లో పెట్టిన విషయం తెలిసిందే.
ఏపీకి చెందిన 218 మంది, మరో 118 మంది స్థానికేతర వైద్యులను తెలంగాణకు కేటాయించడంపై తెలంగాణ వైద్యులు నిరసన వ్యక్తం చేశారు. వైద్య సంఘాలు సీఎం కేసీఆర్, ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డినీ కలిశాయి. మొత్తం 2,928 మంది వైద్యుల విభజన జరిగితే తెలంగాణకు 1,184 మందిని, ఏపీకి 1,744 మందిని కేటాయించారు.
అయితే 18ఎఫ్ క్లాజ్(అవసరాల మేరకు ఆప్షన్ ఇచ్చుకునే అవకాశం) ప్రకారం చాలామంది తెలంగాణకు ఆప్షన్ ఇచ్చారని, ఇది సరికాదని ఆరోపించారు. ఏపీలో 1,536 మంది వైద్యుల ఖాళీలు ఉండగా, 218 మందిని తెలంగాణకు కేటాయించడంపై కూడా వివాదం నెలకొంది. ఈ పరిస్థితుల్లో తెలంగాణ వైద్యశాఖ మంత్రితో పాటు, ముఖ్య కార్యదర్శి నుంచి కమల్‌నాథన్ కమిటీకి వినతులు వెళ్లాయి. వీటిని పరిశీలించిన కమిటీ...గురువారం వైద్యుల అభ్యంతరాలకు ఈనెల 24 వరకూ గడువిస్తూ నిర్ణయం తీసుకుంది.
ఏపీలో వైద్యుల అవసరం గుర్తించలేదు
ఆంధ్రప్రదేశ్‌లో 1,500కు పైగా వైద్యుల ఖాళీలు ఉన్నాయి. అక్కడి డాక్టర్లను ఇక్కడ కేటాయించడం ఏమిటి? అంటే చాలామంది వైద్యులు ఉన్నతాధికారులను మేనేజ్ చేసుకున్నారు. న్యాయబద్ధంగా స్పౌజ్ కేసులను తాము కాదనలేం. కానీ వందలాది మంది వైద్యులు ఇక్కడకు రావడమేంటి?
-తెలంగాణ రీఆర్గనైజేషన్ జేఏసీ అధ్యక్షుడు
డా.ఉమాశంకర్, కో చైర్మన్ డా.రమేష్‌రెడ్డి