- టీఆర్టీసీ ఉద్యోగుల కమిటీ సొంతంగా మార్గదర్శకాలు
- నేడు ఆర్టీసీ ఎండీకి నివేదిక సమర్పణ
- ఆప్షన్లు ఉండొద్దని స్పష్టీకరణ
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగుల విభజనకోసం జారీ అయిన కమలనాథన్ కమిటీ మార్గదర్శకాలను యథాతథంగా ఆర్టీసీలో కూడా వర్తింపజేసే ప్రయత్నాలను వ్యతిరేకిస్తున్న తెలంగాణ ఉద్యోగ సంఘాలు సొంతంగా మార్గదర్శకాలను రూపొందిం చాయి. తెలంగాణ ఆర్టీసీ అధికారుల సంఘం, సూపర్‌వైజర్ల సంఘం, మజ్దూర్ యూనియన్‌తో కూడిన ఉమ్మడి కార్యాచరణ కమిటీ ఈ మార్గదర్శకాలను సిద్ధం చేసింది.
ఈ నివేదికను మంగళవారం సంస్థ ఎండీకి అందజేయనున్నారు. కమలనాథన్ కమిటీ మార్గదర్శకాలు ఆర్టీసీకి వర్తించనందున సంస్థ సొం తంగా మార్గదర్శకాలను రూపొందించాలని గతంలోనే రెండు రాష్ట్రాల సీఎస్‌లు ఉమ్మడిగా ఆదేశాలను జారీ చేశారు. అయినా వాటిని పక్కనపెట్టి కమలనాథన్ కమిటీ మార్గదర్శకాల పేరు మార్చి యథాతథంగా అమలు చేయాలని సంస్థ ఇటీవల నిర్ణయించిన విషయం తెలిసిందే.
అయితే తెలంగాణ ఉద్యోగుల ఉమ్మడి కార్యాచరణ కమిటీ దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇటీవల హైలెవల్ కమిటీ పేరుతో సంస్థ జారీ చేసిన మార్గదర్శకాల్లోంచి తాము విభేదించే అంశాలను తొలగించాలని, తమ నివేదికలోని అంశాలను అందులో చేర్చాలని ఉద్యోగుల కమిటీ గట్టిగా కోరుతోంది. వాటిని పరిగణనలోకి తీసుకోకుంటే ఆందోళనబాట పట్టేందుకు సిద్ధమని హెచ్చరించింది.
ఉద్యోగ సంఘాల కమిటీ నివేదికలో కొన్ని ప్రధానాంశాలు
ఆర్టీసీ ఉద్యోగుల పంపిణీలో ‘ఆప్షన్లు’ వద్దు.
స్థానికత ఆధారంగానే ఉద్యోగులను కేటాయించాలి. నాలుగు నుంచి పదవ తరగతి వరకు చదువుకున్న ప్రాంతమే ప్రామాణికం
ఆర్టీసీలో ప్రస్తుతం పనిచేస్తున్న ఇతర రాష్ట్రాల వారిని ఏపీకి కేటాయించాలి. ఏపీఎస్ ఆర్టీసీ పేరుతో వారు సంస్థలో చేరినందున వారు ఆ రాష్ట్రానికే చెందాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఒక్కో కేసును పరిశీలించి అవసరమైతే వారి కేటాయింపులో మార్పుచేర్పులు చేసుకోవాలి.
రెండు ప్రాంతాల్లో వికలాంగులు ఉన్నందున ఎక్కడివారు అక్కడే పనిచేయాలి. వైకల్యం ఆధారంగా ఆప్షన్లు కోరుకోవటం సరికాదు.
స్పౌజ్, తీవ్ర అనారోగ్య సమస్యలు, ఇతర ప్రత్యేక కారణాలు చూపి హైదరాబాద్‌లో పనిచేసేందుకు మొగ్గు చూపే ఏపీ వారికి నేరుగా అవకాశం ఇవ్వొద్దు. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ పదేళ్లపాటు కొనసాగే అవకాశం ఉన్నం దున, హైదరాబాద్‌లో ఉండే ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ పోస్టుల్లో వారిని కేటాయించాలి.