ఎంపీలో ‘ఐ’క్యతా రాగం! | Top Congress Leaders In Madhya Pradesh Says We Are United | Sakshi
Sakshi News home page

Published Wed, May 2 2018 8:09 PM | Last Updated on Mon, Jul 29 2019 5:59 PM

Top Congress Leaders In Madhya Pradesh Says We Are United - Sakshi

ప్రజలకు, కార్యకర్తలకు అభివాదం చేస్తున్న కమల్‌నాథ్‌, జ్యోతిరాదిత్య సింధియా

సాక్షి, భోపాల్‌ : నగరంలో మంగళవారం ప్రచండ భానుడు మండిపోతున్నాడు. 42 డిగ్రీల ఎండలో కాంగ్రెస్‌ కార్యకర్తలు తమ నాయకుడు కమల్‌నాథ్‌కు ఘనంగా స్వాగతం చెప్పేందుకు ఏమాత్రం వెరవలేదు. నాయకుడితోపాటు ఆరు గంటల రోడ్‌ షోలో అలుపెరగకుండా పాల్గొన్నారు. మరో ఆరు నెలల్లో ఎన్నికలు జరుగనున్న మధ్యప్రదేశ్‌లో ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీకి అధ్యక్షుడిగా నియమితులై రాష్ట్రానికి తిరిగొస్తున్న తమ నాయకుడికి స్వాగతం పలికేందుకు కాంగ్రెస్‌ కార్యకర్తలు ఎగబడ్డారు. 

‘స్లమ్‌డాగ్‌ మిలియనీర్‌’ సినిమాలోని ‘జయహో’ ట్రాక్‌లో పార్టీ పాట హోరెత్తుతుండగా, అందంగా అలంకరించిన ఒంటెలు, గుర్రాలతో పార్టీ కార్యకర్తలు మేళతాళాల మధ్య డాన్సులు చేశారు. ఛింద్వారా నియోజకవర్గానికి తొమ్మిదోసారి పార్లమెంట్‌ సభ్యుడిగా ప్రాతినిథ్యం వహిస్తున్న కమల్‌ నాథ్‌ మోటార్‌ వాహనంపై వస్తుండగా, ఆయన పక్కన పార్టీ ఎన్నికల ప్రచార బాధ్యతలను స్వీకరించనున్న కాంగ్రెస్‌ యువ నాయకుడు జ్యోతిరాదిత్య వెన్నంటి వచ్చారు. కార్యకర్తలు అందించిన కొబ్బరి బోండంను ఆయన స్వయంగా కమల్‌నాథ్‌తో తాగించారు.

విమానాశ్రయం నుంచి కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం వరకు ఈ స్వాగత యాత్ర సాగింది. సుమారు 15 కిలోమీటర్ల దూరం వరకు ఆరు గంటల పాటు సాగిన ఈ యాత్రలో దారంటూ కాంగ్రెస్‌ కార్యకర్తలు, పార్టీ అభిమానులు పూల వర్షం కురిపిస్తూ వచ్చారు. ఎంతో మంది రైతులు కూడా తమ ఎండ్ల బండ్లతో ర్యాలీలో భాగంగా కదిలి వచ్చారు. బీజేపీ పాలనలో తీవ్రంగా నష్టపోయిన రైతులు రాష్ట్రంలో పలుసార్లు సమ్మెలు చేసిన విషయం తెల్సిందే. కమల్‌నాథ్‌ ర్యాలీ పార్టీ కార్యాలయానికి చేరుకోగానే అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ వేదికపై ఆయన ప్రసంగించారు. ఆ తర్వాత కమల్‌నాథ్‌కు బహిరంగంగా మద్దతు ప్రకటించిన కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, మాజీ సీఎం దిగ్విజయ్‌ సింగ్, జ్యోతిరాదిత్య ప్రసంగించారు. తామంతా ఐక్యంగానే ఉన్నామన్న సందేశం ఇచ్చారు.

కాంగ్రెస్‌లో ఇంకా నాయకత్వం కోసం గొడవలు ఉన్నాయంటే నమ్ముతారా? అని ఓ కాంగ్రెస్‌ నాయకుడు ప్రేక్షకులనుద్దేశించి ప్రశ్నించగా, ‘లేదు లేదు. అదంతా గతం’ అంటూ ప్రజలు స్పందించారు. ఈ ముగ్గురు నాయకుల మధ్యనున్న కుమ్ములాటల వల్ల రాష్ట్రంలో అధికారానికి కాంగ్రెస్‌ 15 ఏళ్లు దూరంగా ఉండాల్సి వచ్చింది. ఈ ఐక్యత పైకి కనిపించేదేనా, నిజంగా వారిమధ్య ఐక్యత కుదిరిందా అన్నది ఇప్పుడే స్పష్టం చేయలేం గానీ, ఈసారి ఎలాగైనా విజయం సాధించాలన్న కాంక్ష వారిలో కనిపించింది. ‘హమ్‌ ఆపస్‌ మే లడ్‌ గయేతో దేశ్‌కు ఖౌన్‌ బచాయేగా!’ నినాదాల మధ్య సమావేశం ముగిసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

కమల్‌నాథ్‌కు స్వయంగా కొబ్బరి బోండం తాగిస్తున్న జ్యోతిరాదిత్య

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement