
నాథ్ నియామకం ఆత్మహత్యా సదృశ్యమే!
న్యూఢిల్లీ: పంజాబ్ రాష్ట్ర పార్టీ రాజకీయ కార్యకలాపాల విషయంలో కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చేసిన తప్పే పదే పదే చేస్తోంది. వచ్చే ఏడాది పంజాబ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల జరుగనున్న నేపథ్యంలో ఇక్కడి కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలను పార్టీ సీనియర్ నాయకుడు కమల్‌నాథ్‌కు అప్పగించడం కాంగ్రెస్ పార్టీకి ఆత్మహత్యా సదృశ్యమే అవుతుంది. ఇందిరాగాంధీ మరణానంతరం సిక్కులకు వ్యతిరేకంగా జరిగిన అల్లర్లతో ప్రత్యక్ష సంబంధం ఉందన్న ఆరోపణలను ఎదుర్కోవడమే కాకుండా నానావతి కమిషన్ ముందు విచారణకు హాజరైన కమల్‌నాథ్‌ను నియమించడం అంటే సిక్కుల గాయంపై ఉప్పుచల్లడమేనని విశ్లేషకులు భావిస్తున్నారు.
సరైన సాక్ష్యాధారాలు లేవన్న కారణంగా నానావతి కమిషన్ ఆయన్ని దోషిగా తేల్చకపోవచ్చుగానీ సిక్కులు మాత్రం ఆయన్ని ఉపేక్షించలేరు. అందుకనే ఆయన తాజా నియామకాన్ని వ్యతిరేకిస్తూ పంజాబ్‌లో పలుచోట్ల సిక్కులు కొవ్వొత్తుల నిరసన ప్రదర్శనలు జరిపారు (పంజాబ్, హర్యానా పార్టీ వ్యవహారాల ఇంచార్జిగా కమల్‌నాథ్‌ను నియమిస్తూ కాంగ్రెస్‌పార్టీ అధిష్టానం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెల్సిందే). డ్రగ్స్, ప్రభుత్వ అవినీతి, బలహీనమైన ఆర్థిక పరిస్థితి లాంటి రాష్ర్ట సమస్యలపై జరుగుతున్న చర్చ కాస్త కమల్‌నాథ్ నియామకంతో ఒక్కసారిగా సిక్కుల ఊచకోత సంఘటన వైపు మళ్లింది.
సిక్కులకు వ్యతిరేకంగా 1984లో జరిగిన అల్లర్లలో మూడువేల మందికి పైగా సిక్కులు మరణించడాన్ని సిక్కులు అంత తొందరగా మరిచిపోతారనుకుంటే అంతకన్నా తెలివిమాలిన పని మరోటి ఉండదు. ఒకవేళ వాళ్లు మరచి పోదామనుకున్న అధికార శిరోమణి అకాలీ దళ్, దానితో తాజాగా జతకట్టిన భారతీయ జనతా పార్టీలు మరచిపోనిస్తాయా ? మూసివేసిన 75 కేసులను తిరగతోడేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందానికి అనుమతిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలోనే కమల్‌నాథ్‌ను నియమించడం ఎంత వివాదాస్పదం అవుతుంది?
కమల్‌నాథ్‌ను నానావతి కమిషన్‌ను దోషిగా తేల్చకపోయినా రకాబ్‌గంజ్‌లో ఓ అల్లరిమూకకు ఆయన నాయకత్వం వహించారని, ఆయన కనుసన్నల్లోనే అక్కడి గురుద్వార్‌ను కూల్చేశారని అప్పట్లో మీడియాలో ప్రముఖంగా వార్తలు వచ్చాయి. సంఘటన జరిగిన స్థలంలో కమల్‌నాథ్‌ను తాము చూశామని అప్పటి ఢిల్లీ పోలీసు కమిషనర్ సుభాష్ టాండన్, అదనపు పోలీసు కమిషనర్ గౌతమ్ కౌల్ స్పష్టం చేశారు. ఇది పూర్తిగా నిజమంటూ అప్పడు ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో పనిచేస్తున్న సంజయ్ సూరి నానావతి కమిషన్ ముందు సాక్ష్యం ఇచ్చారు. ఇవన్ని విషయాలను సిక్కు ప్రజలు అంత త్వరగా మరచిపోతారని భావించడం తొందరపాటే.
ఒకప్పుడు స్వర్ణ దేవాలయంపై బ్లూస్టార్ ఆపరేషన్‌ను తీవ్రంగా వ్యతిరేకంచిన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత రాష్ర్ట నాయకుడు అమరిందర్ సింగ్ సమర్థించడం కూడా సమస్యను మరింత జఠిలం చేస్తోంది. 30 ఏళ్ల క్రితం సంఘటనను ప్రజలు అప్పుడే మరిచిపోయారని అనడం రాజకీయ పరిపక్వత లేకపోవడమని భావించలేం. స్థానిక పార్టీలో నెలకొన్న కలహాల దృష్టితోనే ఆయన వ్యాఖ్యానించి ఉండవచ్చు. 30 ఏళ్లక్రితమే ప్రజలు మరచిపోయి ఉంటారనుకుంటే పాత కేసులను తిరగతోడేందుకు కేంద్రం అనుమతిచ్చేది కాదు. అమరిందర్ సింగ్, మాజీ పార్టీ రాష్ట్ర చీఫ్ ప్రతాప్ సింగ్ భజ్వా మధ్యనున్న కలహాలు మనకు తెలియనికావు.