⇒ గతంలో 25 శాఖల్లో.. తాజాగా మరో 26 శాఖల్లో..
⇒ రెండు వారాల్లోగా అభ్యంతరాలు తెలియజేయాలి
⇒ కమలనాథన్ కమిటీ నోటిఫికేషన్ జారీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన అనంతరం రాష్ట్ర స్థాయి ఉద్యోగుల ప్రొవిజనల్ పంపిణీని 51 శాఖలకు చెందిన విభాగాల్లో కమలనాథన్ కమిటీ పూర్తి చేసింది. గతంలో 25 శాఖలకు చెందిన విభాగాల్లో పంపిణీ పూర్తి చేసిన కమిటీ మంగళవారం మరో 26 శాఖల విభాగాల్లోనూ పంపిణీని పూర్తి చేసింది. వర్క్ టు సర్వ్ ఆర్డర్‌లో ప్రస్తుతం తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో 26 శాఖలకు చెందిన విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులను ఇరు రాష్ట్రాలకు తాత్కాలిక పంపిణీ చేస్తూ కమలనాథన్ కమిటీ మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఆయా ఉద్యోగులు ఇచ్చిన ఆప్షన్లు, స్థానికత, మార్గదర్శకాల ఆధారంగా ఏ ఉద్యోగి ఏ రాష్ట్రంలో పనిచేయాలో నోటిఫికేషన్‌లో పేర్లతో సహా పేర్కొంది. అలాగే ఆయా ఉద్యోగుల సీనియారిటీ ర్యాంకును పంపిణీలో కమలనాథన్ కమిటీ స్పష్టం చేసింది.
ఆంధ్రప్రదేశ్ స్థానికత గల ఉద్యోగులను నిబంధనల మేరకు కొంత మందిని తెలంగాణకు.. అలాగే తెలంగాణ స్థానికత గల ఉద్యోగులను కొంత మందిని ఏపీకి కేటాయించారు. తాజాగా పంపిణీ అయిన ఉద్యోగులు ఏమైనా అభ్యంతరాలుంటే రెండు వారాల్లోగా తెలియజేసేందుకు గడువు ఇచ్చారు. నోటిఫికేషన్ జారీ అయిన 14 రోజుల్లోగా పంపిణీ చేసిన రాష్ట్రానికి వెళ్లి ఉద్యోగంలో చేరాలని స్పష్టం చేశారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగులనూ కమిటీ పంపిణీ చేసింది. రాష్ట్ర స్థాయి కేడర్ ఉద్యోగుల ప్రొవిజనల్ పంపిణీ దాదాపు సగం శాఖల్లో కమలనాథన్ కమిటీ పూర్తి చేసినట్లైంది.
5వ తేదీన కమలనాథన్ కమిటీ భేటీ
రాష్ట్ర స్థాయి కేడర్ ఉద్యోగుల పంపిణీపై ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు, భవిష్యత్‌లో చేపట్టాల్సిన చర్యలపై కమలనాథన్ కమిటీ ఈ నెల 5వ తేదీన సమావేశం కానుంది. ఈ సమావేశంలో తెలంగాణ, ఏపీ సీఎస్‌లు రాజీవ్ శర్మ, ఐ.వై.ఆర్. కృష్ణారావు, ఇరు రాష్ట్రాల పునర్విభజన విభాగం కార్యదర్శులు ప్రేమచంద్రారెడ్డి, రామకృష్ణారావు, కేంద్ర వ్యక్తిగత సిబ్బంది వ్యవహారాల శాఖ సంయుక్త కార్యదర్శి అర్చనా వర్మ పాల్గొంటారు.
51 విభాగాల్లో ఉద్యోగుల పంపిణీ
Published Wed, Jun 3 2015 4:10 AM | Last Updated on Sun, Sep 3 2017 3:07 AM
Advertisement
Advertisement