రెండేళ్లలో లక్ష ఉద్యోగాలు | Lakhs of jobs will be given for two years, says KCR | Sakshi
Sakshi News home page

రెండేళ్లలో లక్ష ఉద్యోగాలు

Published Sun, Mar 15 2015 1:16 AM | Last Updated on Mon, Jul 29 2019 5:59 PM

రెండేళ్లలో లక్ష ఉద్యోగాలు - Sakshi

రెండేళ్లలో లక్ష ఉద్యోగాలు

* నోటిఫికేషన్లపై కసరత్తు షురూ: ముఖ్యమంత్రి కేసీఆర్
* అందరూ ఒప్పుకుంటే వయోపరిమితిలో పదేళ్ల సడలింపు
* ఉద్యోగుల విభజన పూర్తయితే ఖాళీలపై స్పష్టత
* కొత్తగా ఉపాధ్యాయ నియామకాలకు నో
* కేంద్ర నిధుల కోసం ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్తాం
* ఉభయ సభల్లో తీర్మానాలు చేసి ప్రధాని మోదీకి ఇద్దాం
* ప్రస్తుతం కరెంట్ కోతలేదు.. మే నెల తర్వాత కనబడదు
* భూములు విక్రయించే యోచనను విరమించుకున్నాం
* తెలంగాణ ఇచ్చింది సోనియానే.. కాదంటే మూర్ఖత్వమే
* మండలిలో డీఎస్ ప్రశ్నలకు సీఎం సుదీర్ఘ సమాధానం

 
సాక్షి, హైదరాబాద్: రెండేళ్లలో లక్ష ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చెప్పారు. కమల్‌నాథన్ కమిటీ ఉద్యోగుల విభజనను ఇంకా పూర్తి చేయనందున ఖాళీలపై స్పష్టత రాలేదని ఆయన తెలిపారు. ఉద్యోగ ఖాళీల లెక్కతేలిన అనంతరం భర్తీ ప్రక్రియను ప్రారంభిస్తామని పేర్కొన్నారు. కేంద్ర నిధులకు సంబంధించిన అంశంపై శనివారం శాసనమండలిలో ప్రతిపక్ష నేత డి.శ్రీనివాస్ అడిగిన పలు ప్రశ్నలకు సీఎం కేసీఆర్ సుదీర్ఘంగా సమాధానమిచ్చారు.
 
 నిధుల కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళతామని.. ప్రధానిని కలిసి విజ్ఞప్తులు చేద్దామని పేర్కొన్నారు. దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యాలను కేసీఆర్ వివరించారు. రెండేళ్లతో లక్ష ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పారు. ఇక రాష్ట్రంలోని పాఠశాలల్లో విద్యార్థులతో పోలిస్తే ఉపాధ్యాయులు ఎక్కువ మంది ఉన్నారని... రేషనలైజేషన్ చేసి అవసరమైన చోట వారిని నియమిస్తామని పేర్కొన్నారు. కొత్తగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఉర్దూ మాధ్యమంలో కొరత ఉన్నందున ఖాళీగా ఉన్న 1,500 పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామన్నారు. ఉద్యోగాలకు దరఖాస్తు చేసే నిరుద్యోగులకు వయో పరిమితిని ఇప్పటికే ఐదేళ్లు సడలించామని, అన్ని పక్షాలు అంగీకరిస్తే పదేళ్లు పెంచేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం పేర్కొన్నారు.
 
 గౌరవ వేతనాల్లో మనమే టాప్
 కేరళ రాష్ట్రంలో కేవలం 967 గ్రామ పంచాయతీలే ఉన్నాయని, అక్కడి ప్రభుత్వం సర్పంచులకు రూ. 6,600 గౌరవ వేతనంగా అందిస్తోందని సీఎం కేసీఆర్ చెప్పారు. రాష్ట్రం విషయానికి వస్తే స్థానిక సంస్థల ప్రతినిధులు (సర్పంచులు, ఎంపీటీసీలు కలిపి) సుమారు 15 వేల మంది ఉన్నారని... గౌరవ వేతనాల మొత్తంలో అన్నిరాష్ట్రాల కన్నా మనమే ముందు వరసలో ఉన్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో సర్పంచులకు గౌరవ వేతనం ఇచ్చే అంశాన్ని గతంలో ఏ ప్రభుత్వాలు పట్టించుకోలేదన్నారు. తాజాగా ప్రకటించిన రూ. 5 వేలకన్నా పెంచలేమని సీఎం స్పష్టం చేశారు. హైకోర్టు విభజన జరగకుంటే రాష్ట్ర విభజన పూర్తికానట్లేనని ప్రభుత్వం భావిస్తోందని.. ఆ విభజన జరగకుండా కొన్ని శక్తులు అడ్డుకుంటున్నాయని తాము భావిస్తున్నామని చెప్పారు. ఈ విషయమై త్వరలోనే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో చర్చిస్తామని కేసీఆర్ తెలిపారు.
 
 మే తర్వాత కోతలుండవు..
 రాష్ట్రంలో ఈ రోజువరకు ఎక్కడా విద్యుత్ కోత లేదని... మే నెల తర్వాత విద్యుత్ కోతలు ఉండబోవని సీఎం చెప్పారు. విభజన చట్టం ప్రకారం ఏపీలోని కృష్ణపట్నం, హిందుజా ప్రాజెక్టుల నుంచి రాష్ట్రానికి రావాల్సిన వాటా ను ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకున్నా మనకు మేలే జరిగిందని వ్యాఖ్యానించారు. ఏపీ ప్రభుత్వ విద్యుత్‌ను ఇచ్చినట్లయితే యూనిట్‌కు రూ. 7.5 చొప్పున చెల్లించాల్సి వచ్చేదని... రాష్ట్రంలో సింగరేణిలో ఉత్పత్తి ధర యూనిట్‌కు రూ. 3.5 మాత్రమేనని పేర్కొన్నారు. రాష్ట్రంలోని విద్యుత్ ప్రాజెక్టులను క్షణక్షణం పర్యవేక్షిస్తున్నందున 170 మెగావాట్ల విద్యుత్ అదనంగా లభ్యమైందని వెల్లడించారు. పీపీపీ పద్ధతిన గాయత్రి పవర్ ప్రాజెక్టు నుంచి జూన్ నెలలో సుమారు 500 మెగావాట్లు, ఫెర్టిలైజర్ సంస్థ గ్యాస్ ఇవ్వడం ద్వారా మరో 260 మెగావాట్ల విద్యుత్ రాష్ట్రానికి వస్తుందని సీఎం చెప్పారు. ఈ ఏడాది పవర్‌కట్ ఉంటే.. మార్చి 20నుంచి ఏప్రిల్ 20 మధ్య ఒకట్రెండు రోజుల పాటు ఉండవచ్చని పేర్కొన్నారు.
 
 వాటర్‌గ్రిడ్‌కు రూ. 13 వేల కోట్లు
 రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాటర్‌గ్రిడ్, మిషన్ కాకతీయ ప్రాజెక్టులకు బడ్జెట్‌లో కేటాయించిన నిధులే కాకుండా వివిధ ఆర్థిక సంస్థల నుంచి కూడా భారీగా నిధులు అందనున్నాయని సీఎం చెప్పారు. వాటర్‌గ్రిడ్‌కు హడ్కో ఏడాదికి రూ. 2,500 కోట్ల చొప్పున నాలుగేళ్ళలో రూ. 10 వేల కోట్లు, నాబార్డు నుంచి రూ. మూడు వేల కోట్లు ఇచ్చేందుకు అంగీకారం కుదిరిందని చెప్పారు. మిషన్ కాకతీయకు నాబార్డు రూ. వెయ్యి కోట్లు, జపాన్ ఆర్థిక సంస్థ (జైకా) రూ. 3 వేల కోట్లు ఇస్తున్నాయని సీఎం చెప్పారు.
 
 బీసీలను నిర్లక్ష్యం చేయం..
 రాష్ట్రంలో బలహీనవర్గాల సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేయబోమని కేసీఆర్ చెప్పారు. రాష్ట్రంలో బీసీలు 51 శాతం ఉన్నట్లు సమగ్ర సర్వేలో వెల్లడైందని.. వారి సంక్షేమానికి మరిన్ని పథకాలను ప్రవేశపెడతామని పేర్కొన్నారు. బడ్జెట్‌లో పేర్కొన్న రూ. 1.15 లక్షల కోట్లలో రాష్ట్ర సొంత రెవెన్యూ(ఎస్‌వోఆర్) రూ. 99 వేల కోట్లు ఉందని.. మిగతా రూ. 16 వేల కోట్లలో కమర్షియల్ ట్యాక్స్ బకాయిల నుంచి రూ. 5 వేల కోట్లు అందే అవకాశం ఉందని సీఎం తెలిపారు. కేంద్ర పథకాలకు నిధులు అందుతాయని ఆశిస్తున్నామన్నారు.
 
 నిధుల కోసం గతంలో భూములను అమ్మాలనుకున్న మాట వాస్తవమేనని.. ఇప్పుడు నిధులు పుష్కలంగా ఉన్నందున ఆ యోచనను విరమించుకున్నామని తెలిపారు. భూ క్రమబద్ధీకరణ ద్వారా 3.5 లక్షల పేద కుటుంబాలకు ఉచితంగా పట్టాలను అందజేయనున్నట్లు సీఎం చెప్పారు. 125 గజాలకు పైగా ఉన్న స్థలాలను తక్కువ ధరకు క్రమబద్ధీకరిస్తున్నామన్నారు. 12.5 శాతం రిజి స్ట్రేషన్ ధర ప్రకారం రూ. 133 కోట్లు వచ్చాయని.. ప్రక్రియ పూర్తయితే మరో రూ. వెయ్యికోట్లు ప్రభుత్వానికి వస్తాయని పేర్కొన్నారు.
 
 కేంద్రంపై ఒత్తిడి తెద్దాం..
 రాష్ట్రానికి నిధుల గురించి కేంద్రంతో కయ్యం పెట్టుకోవడం సబబు కాదని భావిస్తున్నామని, అమల్లో ఉన్న పలు పథకాలకు కేంద్రాన్ని నిధులు అడిగేందుకు ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలనుకుంటున్నామని సీఎం కేసీఆర్ చెప్పారు. నిధులకు సంబంధించి ఉభయ సభల్లో ఏకగ్రీవ తీర్మానాలు చేసి.. ప్రధాని మోదీకి,  నీతి ఆయోగ్ చైర్మన్, వైస్ చైర్మన్‌లకు అందజేద్దామని ఆయన పేర్కొన్నారు. కేంద్రం అమలుచేస్తున్న 122 పథకాలను ఇటీవల 66 కు తగ్గించిందని.. అదే సమయంలో రాష్ట్రానికి రావాల్సిన పన్నుల వాటాను భారీగా పెంచిందని సీఎం చెప్పారు. దేశవ్యాప్తంగా గతేడాది కన్నా ఈ సారి రూ. 1.78 లక్షల కోట్లను నేరుగా రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం అదనంగా ఇస్తోందని తెలిపారు. అందులో తెలంగాణకు అదనంగా సుమారు రూ. 4 వేల కోట్లు అందనున్నాయని సీఎం చెప్పారు.
 
 ఇచ్చింది సోనియానే...
 తెలంగాణ ఇచ్చింది ముమ్మాటికీ సోనియాగాంధీయేనని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. కాదని ఎవరు చెప్పినా వాళ్లు మూర్ఖులేనని వ్యాఖ్యానించారు. తెలంగాణ చరిత్ర రాసేవాళ్లెవరైనా సోనియాగాంధీ పేరును తప్పక  రాయాల్సిందేనన్నారు. తెలంగాణ ఇచ్చింది సోనియాగాంధీ అయితే.. తెచ్చిన ఘనత తెలంగాణ ప్రజలందరికీ దక్కుతుందని కేసీఆర్ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement