విభజన తంటాలు.. ఇంకెన్నాళ్లు? | Police Department Division Process Pending on Kamalnathan Committee | Sakshi
Sakshi News home page

విభజన తంటాలు.. ఇంకెన్నాళ్లు?

Published Mon, Jun 25 2018 5:16 AM | Last Updated on Mon, Jul 29 2019 5:59 PM

Police Department Division Process Pending  on Kamalnathan Committee

సాక్షి, హైదరాబాద్‌: పోలీస్‌శాఖలో విభజన ప్రక్రియ పూర్తి కాలేదు. డీఎస్పీలు, అదనపు ఎస్పీలు, నాన్‌ క్యాడర్‌ ఎస్పీలు రెండు రాష్ట్రాల మధ్య నాలుగేళ్లుగా నలిగిపోతున్నారు. డీఎస్పీ విభజన ఎప్పుడో జరగాల్సి ఉన్నా ఇప్పటివరకు సీనియారిటీ పంచాయితీ తేలలేదు. దీనిని రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు పెండింగ్‌ పెట్టాయి. అధికారులను విభజించాల్సిన కమల్‌నాథన్‌ కమిటీ తాత్కాలిక కేటాయింపులకు ఓకే చెప్పినా తుది కేటాయింపులపై హైకోర్టు స్టే ఉండటంతో ఏం చేయాలో తెలియక పోలీస్‌ శాఖకే వదిలేసింది. దీనితో రెంటికి చెడ్డ రేవడిలాగా పోలీస్‌ అధికారుల పరిస్థితి తయారైందన్న వాదన ఉంది.

ఇటీవల రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల సమావేశం జరిగింది. పెండింగ్‌లో ఉన్న విభజన పనులను పూర్తి చేసుకోవాలని, మధ్యేమార్గంగా వెళ్లాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా డీఎస్పీల విభజనపై ఓ నిర్ణయానికి వచ్చినా ఇప్పటివరకు అందులో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. కేంద్రానికి లేఖ రాసి తెలంగాణలో పనిచేస్తున్న డీఎస్పీలను ఇక్కడే కొనసాగించాలని, ఏపీలో పనిచేస్తున్న అధికారులను అక్కడే కొనసా గేలా చర్యలు చేపట్టాలని కోరాలని నిర్ణయించారు. ఇప్పటివరకు లేఖ రాయకపోవడం అనుమానాలకు తావిస్తోంది.

సీనియారిటీ వ్యవహారంపై రెండు రాష్ట్రాల పోలీస్‌ పెద్దలు ఓ నిర్ణయానికి రావాల్సి ఉంది. ఇంటిగ్రేటెడ్‌ డీఎస్పీ సీనియారిటీ రూపొందించడంపై దృష్టి పెట్టలేదు. సీనియారిటీ జాబితా సమీక్ష పేరుతో మూడున్నరేళ్ల ఏపీ పోలీస్‌శాఖ కాలం గడిపింది. ఇంతవరకు జాబితా రివ్యూ చేసి హైకోర్టులో దాఖలు చేయకపోవడంతో విభజన, పదోన్నతులు, పదవీ విరమణ సెటిల్‌మెంట్లు అన్నీ పెండింగ్‌లో పడిపోయాయని తెలంగాణ పోలీస్‌ అధికారులు అంటున్నారు. ఉమ్మడి ఏపీలో రూపొందించిన జీవో 108, 54 సీనియారిటీ జీవోలను రివ్యూ చేసే అధికారం ఏపీ ప్రభుత్వానికి ఉండటంతో ఆ అంశం ఏపీలోకి వెళ్లింది. దీనితో తమ చేతిలో ఎలాంటి అధికారం లేదని తెలంగాణ అధికారులు తేలికగా తీసుకున్నారు. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలకు ఆయా అధికారులు వినతిపత్రాలిచ్చి ఏళ్లు గడుస్తున్నాయే తప్పా విభజన పని ముందుకు సాగడం లేదు.  

కేంద్ర హోంశాఖ హెచ్చరించినా..
రెండు రాష్ట్రాల్లో కలిపి 36 మందికి కన్ఫర్డ్‌ కోటా కింద ఐపీఎస్‌లుగా పదోన్నతులు కల్పించాల్సి ఉండగా రెండు రాష్ట్రాల హోంశాఖలు నిర్లక్ష్యం వహిస్తూ వస్తున్నాయి. దీనిపై కేంద్ర హోంశాఖ ప్రతి ఏటా హెచ్చరిస్తూ వస్తూనే ఉంది. కన్ఫర్డ్‌ జాబితా కింద వేకెన్సీ ఉన్న పోస్టుల భర్తీకి ప్రతిపాదిత జాబితా పంపాలని కోరినా బుట్టదాఖలు చేస్తూ వస్తున్నాయని లేఖలో స్పష్టం చేసింది. నాలుగేళ్లుగా ప్యానల్‌ జాబితా పంపకపోవడంతో కన్ఫర్డ్‌ ఆశావహ అధికారులు నిరాశలో మునిగిపోయారు. గ్రూప్‌ వన్‌ డీఎస్పీగా సెలక్ట్‌ అయిన నాటి నుంచి 8 ఏళ్ల సర్వీసు పూర్తి చేస్తే ఐపీఎస్‌ పదోన్నతి రావాల్సి ఉంది. 11 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు ప్యానల్‌ జాబితా ఫైలు కదలకపోవడం తమ సర్వీసుపై ప్రభావం చూపుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సీనియారిటీ జాబితా పేరుతో నాలుగేళ్లుగా పెండింగ్‌లో పెట్టడంతో మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. ఇప్పటికైనా రెండు రాష్ట్రాల అధికారులు మధ్యేమార్గ నిర్ణయం తీసుకుంటే సమస్యలు పరిష్కారమవుతాయని కోరుతున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement