Division process
-
విభజన తంటాలు.. ఇంకెన్నాళ్లు?
సాక్షి, హైదరాబాద్: పోలీస్‌శాఖలో విభజన ప్రక్రియ పూర్తి కాలేదు. డీఎస్పీలు, అదనపు ఎస్పీలు, నాన్ క్యాడర్ ఎస్పీలు రెండు రాష్ట్రాల మధ్య నాలుగేళ్లుగా నలిగిపోతున్నారు. డీఎస్పీ విభజన ఎప్పుడో జరగాల్సి ఉన్నా ఇప్పటివరకు సీనియారిటీ పంచాయితీ తేలలేదు. దీనిని రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు పెండింగ్ పెట్టాయి. అధికారులను విభజించాల్సిన కమల్‌నాథన్ కమిటీ తాత్కాలిక కేటాయింపులకు ఓకే చెప్పినా తుది కేటాయింపులపై హైకోర్టు స్టే ఉండటంతో ఏం చేయాలో తెలియక పోలీస్ శాఖకే వదిలేసింది. దీనితో రెంటికి చెడ్డ రేవడిలాగా పోలీస్ అధికారుల పరిస్థితి తయారైందన్న వాదన ఉంది. ఇటీవల రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల సమావేశం జరిగింది. పెండింగ్‌లో ఉన్న విభజన పనులను పూర్తి చేసుకోవాలని, మధ్యేమార్గంగా వెళ్లాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా డీఎస్పీల విభజనపై ఓ నిర్ణయానికి వచ్చినా ఇప్పటివరకు అందులో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. కేంద్రానికి లేఖ రాసి తెలంగాణలో పనిచేస్తున్న డీఎస్పీలను ఇక్కడే కొనసాగించాలని, ఏపీలో పనిచేస్తున్న అధికారులను అక్కడే కొనసా గేలా చర్యలు చేపట్టాలని కోరాలని నిర్ణయించారు. ఇప్పటివరకు లేఖ రాయకపోవడం అనుమానాలకు తావిస్తోంది. సీనియారిటీ వ్యవహారంపై రెండు రాష్ట్రాల పోలీస్ పెద్దలు ఓ నిర్ణయానికి రావాల్సి ఉంది. ఇంటిగ్రేటెడ్ డీఎస్పీ సీనియారిటీ రూపొందించడంపై దృష్టి పెట్టలేదు. సీనియారిటీ జాబితా సమీక్ష పేరుతో మూడున్నరేళ్ల ఏపీ పోలీస్‌శాఖ కాలం గడిపింది. ఇంతవరకు జాబితా రివ్యూ చేసి హైకోర్టులో దాఖలు చేయకపోవడంతో విభజన, పదోన్నతులు, పదవీ విరమణ సెటిల్మెంట్లు అన్నీ పెండింగ్‌లో పడిపోయాయని తెలంగాణ పోలీస్ అధికారులు అంటున్నారు. ఉమ్మడి ఏపీలో రూపొందించిన జీవో 108, 54 సీనియారిటీ జీవోలను రివ్యూ చేసే అధికారం ఏపీ ప్రభుత్వానికి ఉండటంతో ఆ అంశం ఏపీలోకి వెళ్లింది. దీనితో తమ చేతిలో ఎలాంటి అధికారం లేదని తెలంగాణ అధికారులు తేలికగా తీసుకున్నారు. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలకు ఆయా అధికారులు వినతిపత్రాలిచ్చి ఏళ్లు గడుస్తున్నాయే తప్పా విభజన పని ముందుకు సాగడం లేదు. కేంద్ర హోంశాఖ హెచ్చరించినా.. రెండు రాష్ట్రాల్లో కలిపి 36 మందికి కన్ఫర్డ్ కోటా కింద ఐపీఎస్‌లుగా పదోన్నతులు కల్పించాల్సి ఉండగా రెండు రాష్ట్రాల హోంశాఖలు నిర్లక్ష్యం వహిస్తూ వస్తున్నాయి. దీనిపై కేంద్ర హోంశాఖ ప్రతి ఏటా హెచ్చరిస్తూ వస్తూనే ఉంది. కన్ఫర్డ్ జాబితా కింద వేకెన్సీ ఉన్న పోస్టుల భర్తీకి ప్రతిపాదిత జాబితా పంపాలని కోరినా బుట్టదాఖలు చేస్తూ వస్తున్నాయని లేఖలో స్పష్టం చేసింది. నాలుగేళ్లుగా ప్యానల్ జాబితా పంపకపోవడంతో కన్ఫర్డ్ ఆశావహ అధికారులు నిరాశలో మునిగిపోయారు. గ్రూప్ వన్ డీఎస్పీగా సెలక్ట్ అయిన నాటి నుంచి 8 ఏళ్ల సర్వీసు పూర్తి చేస్తే ఐపీఎస్ పదోన్నతి రావాల్సి ఉంది. 11 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు ప్యానల్ జాబితా ఫైలు కదలకపోవడం తమ సర్వీసుపై ప్రభావం చూపుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సీనియారిటీ జాబితా పేరుతో నాలుగేళ్లుగా పెండింగ్‌లో పెట్టడంతో మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. ఇప్పటికైనా రెండు రాష్ట్రాల అధికారులు మధ్యేమార్గ నిర్ణయం తీసుకుంటే సమస్యలు పరిష్కారమవుతాయని కోరుతున్నారు. -
భూ రికార్డులు, కొలతలు రెడీ!
‘జిల్లాల విభజన’కు సిద్ధమవుతున్నాం.. 1924 నాటి దస్త్రాల కంప్యూటరీకరణ కార్యాలయాల ఎంపిక, రికార్డుల విభజన పూర్తి వివరాలు వెల్లడించిన శాఖ ఏడీ ప్రభాకర్ కాజీపేట : కొత్తగా ఏర్పాటు కానున్న జిల్లాలకు అనుగుణంగా భూరికార్డులు, కొలతల శాఖ కార్యాలయానికి సంబంధించి చేపట్టిన దస్త్రాలు, సిబ్బంది విభజన ప్రక్రియ పూర్తి కావొచ్చిందని శాఖ ఏడీ ప్రభాకర్ తెలిపారు. కాజీపేటలోని కార్పొరేషన్ సర్కిల్ కార్యాలయ ఆవరణలో ఉన్న భూమి రికార్డులు, కొలతల శాఖ జిల్లా కార్యాలయంలో ఆయన శుక్రవారం మాట్లాడారు. ఈ సందర్భంగా తమ శాఖ కార్యాలయానికి సంబంధించి జిల్లాల విభజన అంశాలపై పలు వివరాలను వెల్లడించారు. సమగ్ర సమాచారం లేకున్నా.. ఇప్పటి వరకు జిల్లా యూనిట్‌గా సేవలు అందించిన భూరికార్డులు, కొలతల శాఖ కార్యాలయం ఇక నుండి నాలుగుగా విడిపోయి ప్రజలకు సత్వర సేవలందించేలా కలెక్టర్ కరుణ చొరవతో ఏర్పాట్లు చేస్తున్నామని ఏడీ ప్రభాకర్ తెలిపారు. జిల్లాల విభజనపై సమగ్ర సమాచారం లేనప్పటికీ ముసాయిదాకు అనుగుణంగా మహబూబాబాద్, భూపాలపల్లి, వరంగల్, హన్మకొండ జిల్లాలను దృష్టిలో పెట్టుకుని రికార్డులను వేరు చేస్తున్నట్లు చెప్పారు. సిబ్బంది తక్కువగా ఉన్నా ప్రత్యేక సిబ్బందిని నియమించుకుని అవసాన దశలో ఉన్న 1924 నాటి దస్త్రాలను కంప్యూటరీకరణ చేయడంతో పాటు వేరు చేస్తున్నామని తెలిపారు. అధికారికంగా ప్రొఫెసర్ జయశంకర్(భూపాలపల్లి), మహబూబాబాద్ జిల్లాలకు సంబంధించిన రికార్డులు, సిబ్బంది పంపిణీ ప్రక్రియ ఓ కొలిక్కి వచ్చిందని పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి తుది ముసాయిదా రాగానే మిగతా జిల్లాలకు సంబంధించి ఏర్పాట్లు చేస్తామన్నారు. ఇక భూపాలపల్లి, మహబూబాబాద్‌ల్లో ఇప్పటికే కార్యాలయాల ఏర్పాటుకు కావాల్సిన భవనాలను ఎంపిక చేశామని తెలిపారు. ఇక కాజీపేట మినీ సర్కిల్ కార్యాలయ ఆవరణలోనే హన్మకొండ జిల్లా కార్యాలయం కొనసాగుతుందని ఆయన చెప్పారు. ఏడీలుగా ఇన్స్పెక్టర్లు ప్రస్తుతం తమ శాఖకు సంబంధించి జిల్లాలో తన(ఏడీ)తో పాటు ఇద్దరు ఇన్స్పెక్టర్లు, ఆరుగురు డిప్యూటీ ఇన్స్పెక్టర్లు, ఓ సూపరింటెండెంట్, 27 మంది సర్వేయర్లు, ఎనిమిది మంది డిప్యూటీ సర్వేయర్లు, ఇద్దరు సీనియర్ అసిస్టెంట్లు, ఐదుగురు జూనియర్ అసిస్టెంట్లు ఉన్నారనిప్రభాకర్ తెలిపారు. వీరిలో ఇద్దరు ఇన్స్పెక్టర్లకు కొత్తగా ఏర్పడనున్న జిల్లాల్లో రెండింటికి ఏడీలుగా ఇన్చార్జి బాధ్యతలు అప్పగించనుండగా.. మరో జిల్లాకు తాను కొనసాగే అవకాశముందని పేర్కొన్నారు. ఇక కింది స్థాయి సిబ్బందిని కార్యాలయ నిర్వహణకు అనుగుణంగా కేటాయించనున్నట్లు తెలిపారు. ప్రస్తుత వరంగల్ జిల్లాలో 50మండలాలకు 27 మంది సర్వేయర్లే ఉండగా.. వారే మిగతా మండలాలకు ఇన్చార్జిలుగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. ఇదేక్రమంలో ఉన్న సిబ్బందితోనే కొత్త జిల్లాల కార్యకలాపాలు సాగేలా ఏర్పాట్లు చేసుకుంటున్నామని ప్రభాకర్ వివరించారు. లుండగా 27సర్వేయర్ పోస్టుల్లో మాత్రమే సిబ్బంది ఉన్నారని, మిగిత మండలాల్లో పోస్టులు ఖాళీగా ఉండటంతో ఇప్పటికే అనేక మంది సర్వేయర్లు పక్క మండలాల అదనపు బాధ్యతలను నిర్వర్తిస్తున్నట్లు చెప్పారు. ఉన్న సిబ్బందితోనే జిల్లా కార్యాలయాల ఏర్పాటుకు సన్నహాలు పూర్తి చేస్తున్నట్లు చెప్పారు. నిజాం కాలంనాటి దస్త్రాలే అయినా అన్ని రకాల గ్రామాల చిత్రపటాలు, సేత్వార్, టిపన్లు అవసరమైన అన్నీ భద్రపర్చడంతో పాటు డిజిటలైజేషన్ ప్రక్రియ చురుకుగా సాగుతోందని వివరించారు. అందుబాటులోని లేని కొన్ని గ్రామాల చిత్రపటాలు, కొన్ని దస్త్రాలను అవసరానికి అనుగుణంగా భూ పరిపాలన రాష్ట్ర కమిషనర్ కార్యాలయం నుంచి తెప్పించి ప్రజా సమస్యలకు పరిష్కారం చూపిస్తున్నామని తెలిపారు. భూములకు ఉహించని ధరలు పెరుగడం కూడా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా భూవివాదాలు పెరుగడానికి కారణమవుతోందని ప్రభాకర్ పేర్కొన్నారు. -
గ్రీన్‌సిగ్నల్ 3జిల్లాలు
► నియోజకవర్గాలు, మండలాల కూర్పుపై ► అధికార యంత్రాంగం కసరత్తు ► వికారాబాద్ జిల్లాలోకి కొడంగల్ నియోజక ► వర్గం మొగ్గుకొన్ని మండలాలు ► అటు.. ఇటు విభజన శాస్త్రీయంగా ఉండాలి ► కలెక్టర్ల వర్క్‌షాప్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : జిల్లాల విభజన ప్రక్రియకు ప్రభుత్వం అధికారికంగా శ్రీకారం చుట్టింది. విభజన పారదర్శకంగా, ప్రజలకు పరిపాలనాసౌలభ్యం ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం జరిగిన కలెక్టర్ల వర్క్‌షాప్‌లో దిశానిర్దేశం చేశారు. జిల్లా మూడు జిల్లాలుగా విభజనకు దాదాపు రంగం సిద్ధమైంది. అయితే ఏయే నియోజకవర్గంలో ఏ మండలాన్ని చేర్చాలి.. ఆ నియోజకవర్గాన్ని ఏ జిల్లా కేంద్రం పరిధిలోకి తీసుకురావడం వల్ల ప్రజలకు పరిపాలన సౌలభ్యం అవుతుందన్న అంశంపై శాస్త్రీయంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు 64 మండలాలుగా ఉన్న మహబూబ్‌నగర్ జిల్లాలో 5 అర్బన్ మండలాలు, 5 రూరల్ మండలాలు అదనంగా రానున్నాయి. వనపర్తి, మహబూబ్‌నగర్, గద్వాల, నాగర్‌కర్నూల్, నారాయణపేటతో పాటు ఆ పట్టణ ప్రాంతాలను ప్రత్యేక మండలాలుగా చేయనున్నారు. ఇక ప్రతి రెవెన్యూ డివిజన్లో కనీసం ఒక గ్రామాన్ని మండల కేంద్రంగా చేసేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో కొన్ని మండలాల భౌగోళిక స్వరూపం సైతం కొంత మారే అవకాశం కనపడుతోంది. ఉదాహరణకు జడ్చర్ల నియోజకవర్గ పరిధిలోని మిడ్జిల్ మండలం నాగర్‌కర్నూల్ జిల్లా పరిధిలోకి పంపించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. అలాగే దేవరకద్ర నియోజకవర్గ పరిధికి చెందిన కొత్తకోట, అడ్డాకులను వనపర్తి జిల్లా పరిధిలోకి, దేవరకద్ర, భూత్పూర్, చిన్నచింతకుంటను మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలోకి తేనున్నారు. ► ఇక కల్వకుర్తి రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఏర్పాటుచేయడం దాదాపు ఖరారైంది. ఆ నియోజకవర్గ పరిధిలో ఉన్న మండలాలతో కలిపి ప్రత్యేక రెవెన్యూ డివిజన్‌ను ఏర్పాటుచేయాలని సమావేశంలో ప్రతిపాదనలకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ► కొత్తగా ఏర్పడే వనపర్తి, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో ఒక్కో జిల్లాలో నాలుగు నియోజకవర్గాలు ఉండేలా ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ► మహబూబ్‌నగర్ జిల్లాలో మాత్రం 6 నియోజకవర్గాలు ఉండే విధంగా అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసినా ఆ నియోజకవర్గ పరిధిలోని మండలాలు ఇతర జిల్లాలకు వెళ్లనున్నాయి. ► మక్తల్ నియోజకవర్గ పరిధిలోని ఆత్మకూర్‌ను వనపర్తి జిల్లాలో కలపాలని ప్రతిపాదనలు వచ్చాయి. ► కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలోని మాడ్గుల్, ఆమన్‌గల్ మండలాలను ఇబ్రహీంపట్నం జిల్లాలో కలిపేందుకు ప్రభుత్వం నుంచి సానుకూలత వ్యక్తమైనట్లు తెలిసింది. ► మహబూబ్‌నగర్ జిల్లాకు సమీపంలో ఉన్న రంగారెడ్డి జిల్లా పరిధిలోని కుల్కచర్ల, దోమ, గండీడ్ మండలాలను తొలుత మహబూబ్నగర్జిల్లాలో కలపాలని భావించినా.. అక్కడి ప్రజలు విముఖత వ్యక్తం చేయడంతో వికారాబాద్ జిల్లాలోనే కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తోంది. కొడంగల్... రంగారెడ్డి జిల్లాలోకి ? ఇక కొడంగల్ నియోజకవర్గాన్ని మహబూబ్‌నగర్ జిల్లాలోనే కొనసాగించాలని భావించిన ఆ నియోజకవర్గ ప్రజలు అనేక మంది తమను రంగారెడ్డి జిల్లాలో కలపాలని ప్రభుత్వానికి విజ్ఞప్తులు రావడంతో వారి అభిష్టం మేరకు వ్యవహరించాలని, మెజార్టీ నిర్ణయానికి అనుగుణంగా వ్యవహరించాలని, బలవంతంగా ఏ ప్రాంతాన్ని మరో ప్రాంతంలో కలిపే ప్రయత్నం చేయొద్దని సీఎం జిల్లా అధికారులకు సూచించినట్లు తెలిసింది. భౌగోళికంగా రంగారెడ్డి జిల్లాకు అత్యంత సమీపంలో ఉండే కొడంగల్ నియోజకవర్గాన్ని రంగారెడ్డి జిల్లాలో కలిపే అంశాన్ని అక్కడి ప్రజల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం తీవ్రంగా పరిశీలించింది. -
ఆర్టీసీలో ఈడీల విభజన
ఏపీకి ఆరుగురు, తెలంగాణకు ముగ్గురు సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో ఉద్యోగుల విభజన ప్రక్రియ మొదలైంది. తొలుత ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్లను విభజిస్తూ రెండు రాష్ట్రాలకూ కేటాయించారు. ఆంధ్రప్రదేశ్‌కు ఆరుగురు, తెలంగాణకు ముగ్గురు ఈడీలను ఇచ్చారు. జి.జయరావు, ఎం.వెంకటేశ్వరరావు, ఎ.కోటేశ్వరరావు, ఎ.రామకృష్ణ, ఎన్.భువనేశ్వరప్రసాద్, ఎన్.వెంకటేశ్వరరావులను ఏపీకి, ఎ.పురుషోత్తం, ఎం.రవీందర్, ఆర్.నాగరాజులను తెలంగాణకు కేటాయిస్తూ ఆర్టీసీ ఎండీ ఎన్.సాంబశివరావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీకి కేటాయించిన ఆరుగురు ఈడీల్లో ఇద్దరు ఈడీలు హైదరాబాద్‌లోని పరిపాలన, ఆపరేషన్స్, ఇంజనీరింగ్, మెడికల్, ఐటీ వ్యవహారాలు పర్యవేక్షిస్తారు. నలుగురు ఈడీలు ఏపీలోని కడప, నెల్లూరు, విజయవాడ, విజయనగరం జోన్లలో ఈడీలుగా కొనసాగనున్నారు. అయితే ఆరుగురు ఈడీల్లో ఎవరెవరు ఏ బాధ్యతలు నిర్వహిస్తారనేదానిపై ఆర్టీసీ ఎండీ త్వరలో విడిగా ఉత్తర్వులు జారీ చేయనున్నారు. ఈడీ ఎన్.భువనేశ్వరప్రసాద్ మాత్రం ఇరు రాష్ట్రాల్లో ఫైనాన్స్ వ్యవహారాలు పర్యవేక్షించనున్నారు. ఏపీకి కేటాయించిన ఈడీ జి.జయరావు పోలవరం ముంపు ప్రాంతానికి చెందినవారు. ఆయన తెలంగాణ కోరుకోగా.. ఏపీకి కేటాయించారు. రెండు రోజుల్లో ఆయా విభాగాధిపతుల విభజన పూర్తి చేయనున్నట్లు ఆర్టీసీ ఎండీ ఉద్యోగ సంఘాలకు హామీనిచ్చినట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఉమ్మడి ఆస్తులపై షీలాభిడే కమిటీ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ఈయూ నేతలు పద్మాకర్, పలిశెట్టి దామోదరరావులు తెలిపారు. -
విభజన వేగంగా జరగాలని కేంద్రం ఒత్తిడి
-
అసెంబ్లీ విభజన పై అధికారుల కసరత్తు
-
పోలీసు విభజన షురూ!
విభాగాల వారీగా స్థానికత నమోదు రాష్ట్రం వెలుపలనున్న ఆస్తుల వివరాల సేకరణ ప్రస్తుత భవనంలోనే రెండు రాష్ట్రాల డీజీపీలు! సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీసు విభాగంలో విభజన ప్రక్రియ మొదలైంది. అన్ని విభాగాల అధికారులు సిబ్బంది, ఆస్తుల వివరాల సేకరణపై దృష్టి సారించారు. సిబ్బంది స్థానికతను తెలుసుకుంటున్నారు. హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయం, సీఐడీ, ఇంటెలిజెన్స్, ఆక్టోపస్, ఎస్ఐబీ తదితర విభాగాలలో పని చేస్తున్న పోలీసు ఎగ్జిక్యూటివ్, మినిస్టీరియల్ సిబ్బంది స్థానికతతో పాటు ఇతర వివరాలు సేకరించే ప్రక్రియను వేగవంతం చేశారు. మరోవైపు పోలీసు శాఖకు రాష్ట్రం వెలుపల ఉన్న ఆస్తుల వివరాలను సేకరించే పనిలో ఆర్థిక శాఖ అధికారులు ఉన్నారు. - పుట్టిన స్థలం, విద్యాభ్యాసం తదితర వివరాలతో కూడిన పత్రాలను సిబ్బంది నుంచి తీసుకుంటున్నారు. ఈ వివరాలను క్రోడీకరించి రికార్డులు సిద్ధం చేస్తున్నారు. - ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీసు (ఏపీఎస్పీ)కు రాష్ట్రంలో 17 బెటాలియన్లు ఉండగా.. అందులో 10 తెలంగాణ జిల్లాల్లో, 7 సీమాంధ్ర జిల్లాల్లో ఉన్నాయి. రాష్ట్రస్థాయి రిక్రూట్మెంట్ కావడంతో.. తెలంగాణ జిల్లాల్లో పని చేస్తున్న క్షేత్రస్థాయి సిబ్బందిలో ఎక్కువ మంది సీమాంధ్ర ప్రాంతాలకు చెందిన వారే ఉంటున్నారు. పూర్తి వివరాలు సేకరించాక కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసే కమిటీ సిఫార్సుల ఆధారంగా ఇరు రాష్ట్రాలకు సిబ్బంది పంపిణీ ప్రారంభించాలని డీజీపీ కార్యాలయం అధికారులు నిర్ణయించారు. - ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు శాఖకు ఉన్న భవనాలు, స్థలాలు, ఇతర ఆస్తుల జాబితాను రూపొందించిన అధికారులు.. ప్రస్తుతం హైదరాబాద్‌తోపాటు రాష్ట్రం వెలుపల ఉన్న వాటి వివరాల సేకరణపై దృష్టి పెట్టారు. ఈ వివరాల కోసం ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ కల్లాం ఆంధ్రప్రదేశ్ పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ (ఏపీపీహెచ్‌సీ)కి లేఖ రాశారు. నగర పోలీసు, ఇతర కీలక విభాగాలకూ వర్తమానం పంపారు. వీలైనంత త్వరగా పూర్తి సమాచారాన్ని అందించాలని ఆదేశించారు. - విజయవాడ సమీపంలో ఆక్టోపస్ హబ్‌ను ఏర్పాటు చేయడానికి డీజీపీ కార్యాలయం కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్‌తో పాటు తిరుపతిలో మాత్రమే ఈ హబ్స్ ఉన్నాయి. - రెండు రాష్ట్రాలకు పదేళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండబోతోంది. దీంతో ప్రస్తుత డీజీపీ కార్యాలయ భవనంలోనే.. మరో డీజీపీకి కొంత స్థలాన్ని కేటాయించే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. కొత్త భవనం సమకూరే వరకూ సీఐడీ, ఇంటెలిజెన్స్ కార్యాలయాలూ.. డీజీపీ కార్యాలయ భవనంలోనే కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.