
ఆర్టీసీలో ఈడీల విభజన
- ఏపీకి ఆరుగురు, తెలంగాణకు ముగ్గురు
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో ఉద్యోగుల విభజన ప్రక్రియ మొదలైంది. తొలుత ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్లను విభజిస్తూ రెండు రాష్ట్రాలకూ కేటాయించారు. ఆంధ్రప్రదేశ్‌కు ఆరుగురు, తెలంగాణకు ముగ్గురు ఈడీలను ఇచ్చారు. జి.జయరావు, ఎం.వెంకటేశ్వరరావు, ఎ.కోటేశ్వరరావు, ఎ.రామకృష్ణ, ఎన్.భువనేశ్వరప్రసాద్, ఎన్.వెంకటేశ్వరరావులను ఏపీకి, ఎ.పురుషోత్తం, ఎం.రవీందర్, ఆర్.నాగరాజులను తెలంగాణకు కేటాయిస్తూ ఆర్టీసీ ఎండీ ఎన్.సాంబశివరావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఏపీకి కేటాయించిన ఆరుగురు ఈడీల్లో ఇద్దరు ఈడీలు హైదరాబాద్‌లోని పరిపాలన, ఆపరేషన్స్, ఇంజనీరింగ్, మెడికల్, ఐటీ వ్యవహారాలు పర్యవేక్షిస్తారు. నలుగురు ఈడీలు ఏపీలోని కడప, నెల్లూరు, విజయవాడ, విజయనగరం జోన్లలో ఈడీలుగా కొనసాగనున్నారు. అయితే ఆరుగురు ఈడీల్లో ఎవరెవరు ఏ బాధ్యతలు నిర్వహిస్తారనేదానిపై ఆర్టీసీ ఎండీ త్వరలో విడిగా ఉత్తర్వులు జారీ చేయనున్నారు. ఈడీ ఎన్.భువనేశ్వరప్రసాద్ మాత్రం ఇరు రాష్ట్రాల్లో ఫైనాన్స్ వ్యవహారాలు పర్యవేక్షించనున్నారు.
ఏపీకి కేటాయించిన ఈడీ జి.జయరావు పోలవరం ముంపు ప్రాంతానికి చెందినవారు. ఆయన తెలంగాణ కోరుకోగా.. ఏపీకి కేటాయించారు. రెండు రోజుల్లో ఆయా విభాగాధిపతుల విభజన పూర్తి చేయనున్నట్లు ఆర్టీసీ ఎండీ ఉద్యోగ సంఘాలకు హామీనిచ్చినట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఉమ్మడి ఆస్తులపై షీలాభిడే కమిటీ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ఈయూ నేతలు పద్మాకర్, పలిశెట్టి దామోదరరావులు తెలిపారు.