జల్లికట్టు తరహాలో నిరుద్యోగ ర్యాలీకి ప్లాన్!
హైదరాబాద్ : తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ(టీ-జేఏసీ) ఈ నెల 22న చేపట్టిన నిరుద్యోగ ర్యాలీని తమిళనాడు జల్లికట్టు తరహాలో పెద్ద ఎత్తున ఉద్యమం చేసేందుకు నిర్ణయించిందని పోలీస్ శాఖ హైకోర్టుకు తెలిపింది.
హైకోర్టులో సోమవారం ఉదయం నిరుద్యోగ ర్యాలీ పిటిషన్పై విచారణ జరిగింది. ఈ సందర్భంగా ర్యాలీకి అనుమతి నిరాకరించడంపై వివరణ ఇవ్వాలని హైకోర్టు పోలీస్ శాఖను ఆదేశించింది. ర్యాలీ నిరాకరణకు గల కారణాలను హైదరాబాద్ పోలీస్ శాఖ హైకోర్టుకు సమర్పించింది.
ఆ నివేదకలో ఏం పేర్కొందంటే 'ఇప్పటికే జేఏసీపై 31 కేసులు ఉన్నాయి. ర్యాలీలో సంఘ విద్రోహ శక్తులు చొరబడే అవకాశముందని ఇంటలిజెన్స్ రిపోర్ట్లో తేలింది. ఈ ర్యాలీ కోసం జేఏసీ చైర్మన్ కోదండరామ్ 31 జిల్లాల్లో 131 ప్రాంతాల్లో పర్యటించారు. ఒక్కో ప్రాంతం నుంచి వెయ్యి మందిని తరలించేందుకు ప్లాన్ చేశారు. జల్లికట్టు తరహాలో ఉద్యమం చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీనివల్ల గ్రేటర్ పరిధిలో అనుమతి ఇవ్వలేం. మరో చోట ర్యాలీ నిర్వహిస్తే అభ్యంతరం లేదు' అని తేల్చి చెప్పింది. హైకోర్టు విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. హైకోర్టు తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.