
సమాచారం త్వరగా ఇప్పించండి!
శాఖాధిపతుల నుంచి స్పందన ఉండడం లేదు
ఫలితంగా ఉద్యోగుల పంపిణీ జాప్యమవుతోంది
ఏపీ, తెలంగాణ సీఎస్‌లకు కమలనాథన్ లేఖ
హైదరాబాద్: ఏపీ, తెలంగాణల మధ్య రాష్ట్ర స్థాయి కేడర్ ఉద్యోగుల పంపిణీకి సంబంధించిన సమాచారం ఆయా రాష్ట్రాల శాఖాధిపతుల నుంచి అందకపోవడంపై కమలనాథన్ కమిటీ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఉద్యోగుల స్థానికత, ప్రత్యేక కేసుల్లో ఆప్షన్స్‌కు సంబంధించిన డాక్యుమెంట్లను, సీనియారిటీ సర్టిఫికెట్లను ఇరు రాష్ట్రాల శాఖాధిపతులు ఆన్‌లైన్‌లో నమోదు చేయడంలో జాప్యం జరుగుతోంది. ఫలితంగా ఉద్యోగుల పంపిణీ వ్యవహారం మరింత ఆలస్యమవుతోంది. శాఖాధిపతులు ఉద్యోగుల సర్టిఫికెట్లు సక్రమంగా ఉన్నాయా లేదా అనే విషయాన్ని పరిశీలించి ధ్రువీకరించాల్సి ఉంది.
అనంతరం ఆయా పత్రాలను విభజన విభాగం వెబ్‌సైట్‌లో ఉంచుతుంది. కమలనాథన్ కమిటీ ఇప్పటికే 10 విభాగాలకు చెందిన ఉద్యోగులను ఇరు రాష్ట్రాలకూ పంపిణీ చేసిం ది. మిగిలిన విభాగాల ఉద్యోగుల పంపిణీకి సంబంధించిన సమాచారం ఆయా శాఖాధిపతుల నుంచి ఆన్‌లైన్‌లో రావడం లేదు. ఈ నేపథ్యంలో కమలనాథన్.. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కృష్ణారావులకు లేఖ రాశారు. శాఖాధిపతులతో సంయుక్త సమావేశం ఏర్పాటు చేసి ఉద్యోగుల పంపిణీకి సంబంధించిన సమాచారాన్ని త్వరగా ఆన్‌లైన్‌లో నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కొన్ని విభాగాలకు సంబంధించి స్థానికత, ఇతర అంశాల విషయంలో తప్పుడు సమాచారం ఇస్తున్నారు. అలాంటి సమాచారాన్ని సరి చేయాల్సిన బాధ్యత శాఖాధిపతులపై ఉందని, ఈ క్రమంలో ఆలస్యం జరగకుండా సమాచారం అందించాలని సూచించారు.
వాటిపై ఏకాభిప్రాయానికి రావాలి
ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రి, డెంటల్ కాలేజీ ఆస్ప త్రి, నర్సింగ్ కాలేజీలను రాష్ట్ర యూ నిట్లుగా పరిగణించి ఇరు రాష్ట్రాలకు ఉద్యోగులను పంపిణీ చేయాలని ఏపీ ప్ర భుత్వం కోరుతోంది. దీనిపై కమలనాథన్ స్పందిస్తూ ఇరు రాష్ట్రాల శాఖాధిపతులు ఒక అభిప్రాయానికి వస్తే అందుకు అనుగుణంగా పంపిణీ చేస్తామని పేర్కొంది. భార్య, భర్తల విషయంలో కేంద్ర ఉద్యోగి ఒక రాష్ట్రంలోను మరో ఉద్యోగి మరో రాష్ట్రంలో ఉన్నా ఇద్దరినీ ఒకే రాష్ట్రానికి పంపిణీ చేసేందుకు కమిటీ అంగీకరించింది. అయితే ఇందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం కావాల్సి ఉందని కమిటీ పేర్కొంది.
సచివాలయంలో నాలుగో తరగతి ఉద్యోగులు 637 మంది ఉండగా అందులో ఏపీ స్థానికత గలవారు కేవలం 45 మంది మాత్రమే ఉన్నారు. మిగతా 592 మంది తెలంగాణ వారేనని కమిటీ గుర్తించింది. నాలుగో తరగతి ఉద్యోగులను వారిచ్చే ఆప్షన్ల ఆధారంగా పంపిణీ చేయాలని మార్గదర్శక సూత్రాలు స్పష్టం చేస్తున్నాయి. అందువల్ల ఈ విషయంలో ఏ ఇబ్బందీ ఉండదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.