
ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇటీవల హమాస్ చీఫ్ యాహ్యా సిన్వార్ మృతిచెందారు. దీంతో హామాస్‌ను ఎవరు నడిపిస్తారనే అంశంపై చర్చ జరగుతోంది. అయితే చీఫ్ లేకుండా.. దోహ కేంద్రంగా పాలక కమిటీని నియమించే అవకాశం ఉన్నట్లు హమాస్ వర్గాలు తెలిపాయి.
మార్చిలో జరగనున్న ఎన్నికల వరకు దివంగత చీఫ్ యాహ్యా సిన్వార్‌కు వారసుడిని నియమించకూడదని హమాస్ నాయకత్వం యోచిస్తున్నట్లు సమాచారం. టెహ్రాన్‌లో రాజకీయ చీఫ్ ఇస్మాయిల్ హనియే హత్య అనంతరం ఆగస్టులో ఏర్పడిన ఐదుగురు సభ్యుల కమిటీ హమాస్ గ్రూప్ నాయకత్వాన్ని తీసుకుంది. ఇక.. సిన్వార్ మృతికి ముందు.. గాజాలో ఉన్న ఆయనతో కమ్యూనికేట్ కావటంలో తీవ్ర ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని హమాస్ ఐదుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది.
2017లో హమాస్ గ్రూప్ గాజా చీఫ్‌గా నియమించబడిన సిన్వార్.. జూలైలో హనియే హత్య అనంతరం హమాస్ గ్రూప్ మొత్తానికి చీఫ్‌గా నియమితులయ్యారు. గాజాకు ఖలీల్ అల్-హయ్యా, వెస్ట్ బ్యాంక్‌కు జహెర్ జబరిన్, విదేశాలలో ఉన్న పాలస్తీనియన్ల కోసం ఖలీద్ మెషాల్ చెందిన ప్రతినిధులతో పాలక కమిటీని రూపొందించినట్లు తెలుస్తోంది.
ఇక.. ఈ పాలక కమిటీలో హమాస్ షూరా సలహా మండలి అధిపతి మహమ్మద్ దర్విష్, పొలిటికల్ బ్యూరో కార్యదర్శి కూడా ఉన్నారు. అయితే.. వీరిని భద్రతా కారణాల దృష్ట్యా గుర్తించకపోవటం గమనార్హం. కమిటీలోని ప్రస్తుత సభ్యులందరూ ఖతార్‌లో ఉన్నారు. యుద్ధం, అసాధారణమైన పరిస్థితులలో దాడులు, భవిష్యత్తు ప్రణాళికలను నిర్వహించటంపై ఈ కమిటీ బాధ్యత వహిస్తుంది. వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవడానికి ఈ పాలక కమిటీకి అధికారం ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment