
మెట్రో రెండో దశకు దిశానిర్దేశం
హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు రెండోదశకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పచ్చజెండా ఊపారు.
- ప్రాజెక్టు విస్తరణపై అధ్యయనానికి సీఎం కేసీఆర్ ఆదేశం
- మరో ఐదు మార్గాల్లో విస్తరణకు ప్రతిపాదనలు!
- ‘ఆకాశ హర్మ్యాల’పై ఎల్‌అండ్‌టీ నివేదిక కోరిన సీఎం
- పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు రెండోదశకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పచ్చజెండా ఊపారు. రెండో దశ కింద ఉప్పల్-ఘట్‌కేసర్, నాగోల్-ఎల్బీనగర్, ఎల్బీనగర్-హయత్‌నగర్, మియాపూర్-పటాన్‌చెరు, జేబీఎస్-తిరుమలగిరి మార్గాల్లో ప్రాజెక్టు విస్తరణపై సమగ్ర అధ్యయనం జరపాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న మెట్రో రైలు ప్రాజెక్టు పనులు పూర్తై.. హైదరాబాద్ నగర రవాణా అవసరాలు పూర్తిగా తీరవని ఆయన అభిప్రాయపడ్డారు. మెట్రో రైలు ప్రాజెక్టు పరిధి అవతల నగరం బాగా విస్తరించిన నేపథ్యంలో పైన పేర్కొన్న మార్గాల్లో మెట్రో రైలు ప్రాజెక్టును విస్తరించాల్సిన అవసరముందన్నారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, ఎల్‌అండ్‌టీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ బాలసుబ్రమణ్యం, ఎండీ గాడ్గిల్ తదితరులతో సోమవారం సీఎం సచివాలయంలో మెట్రో రైలు ప్రాజెక్టు పనుల పురోగతిపై సమీక్ష జరిపారు. నగర జనాభా కోటికి దాటిందని, ఏటా పది లక్షల జనాభా పెరుగుతోందన్నారు. శరవేగంగా వృద్ధి చెందుతున్న నగర జనాభా అవసరాలకు తగ్గట్లు నగర రవాణా వ్యవస్థ అభివృద్ధి చెందాల్సి ఉందన్నారు. నగరంలో తీవ్రరూపం దాల్చిన ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు, ప్రజలకు సరైన రవాణా వ్యవస్థను అందించేందుకు మెట్రో రైలు విస్తరణ ఎంతో అవసరమని కేసీఆర్ అభిప్రాయపడ్డారు.
ఎల్‌అండ్‌టీ నుంచి ప్రతిపాదనలు
హైదరాబాద్‌లో నిర్మించతలపెట్టిన ఆకాశ హర్మ్యాలు, ఆకాశ మార్గాలు తదితర ప్రతిష్టాత్మక నిర్మాణాలపై ఈ సమావేశంలో సీఎం చర్చించారు. ఈ ప్రాజెక్టులపై అధ్యయన నివేదికలు సమర్పించాలని ఎల్‌అండ్‌టీ ప్రతినిధులను కోరారు. అదే విధంగా.. ఎల్‌అండ్‌టీ ఆధ్వర్యంలో ముంబై నగరంలో నిర్వహిస్తున్న సీసీ కెమెరాల పనితీరుపై అధ్యయనం చేయాలని నగర పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డిని కోరారు. నగరంలో సీసీ కెమెరాలను పెంచాలని, నిఘా వ్యవస్థను పటిష్టపరచాలని ఆదేశించారు. నగరంలో నిర్మించతలపెట్టిన పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ భవనాన్ని సత్వరంగా నిర్మించాలన్నారు.