వచ్చే ఏడాది దసరాకల్లా యాదాద్రి సిద్ధం
- అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశం
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది దసరా నాటికి యాదాద్రి దేవాలయాన్ని భక్తుల సందర్శనకు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. బుధవారం సీఎం క్యాంపు కార్యాలయంలో యాదాద్రి ఆలయ నిర్మాణ పనుల పురోగతిపై సమీక్ష జరిగింది. మంత్రులు కె.తారక రామారావు, లకా్ష్మరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ తదితరులు పాల్గొన్న ఈ సమావేశంలో యాదాద్రి దేవస్థానం తుది నమూనాకు కేసీఆర్ ఆమోద ముద్ర వేశారు. ప్రధాన ఆలయ సముదాయాల నిర్మాణం, భక్తులు సేదతీరేందుకు నిర్మించే కాటేజీలకు సంబంధించి త్రీడీ వీడియో, ఫొటోలను సీఎం వీక్షించారు.
ఆలయ కట్టడాల నమూనాలపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఐదు రాజగోపురాలతోపాటు ప్రాకార మండపాలు పూర్తిస్థాయి శిలతో నిర్మించనున్నారని, పూర్తిస్థాయి కృష్ణశిలతో నిర్మితం కావడం ఆలయ విశేషమని ఆయన అన్నారు. 500 మంది నిష్ణాతులైన శిల్పులు పనుల్లో నిమగ్నమయ్యారని అధికారులు తెలపడంతో సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు.
కాటేజీల నిర్మాణానికి ఓకే
యాదాద్రిలో భక్తుల బస కోసం 250 ఎకరాల్లో నిర్మించ తలబెట్టిన కాటేజీల నమూనాలకు చిన్నచిన్న మార్పులతో సీఎం ఆమోదం తెలిపారు. రాష్ట్రపతి, ప్రధాని తదితర వీవీఐపీల బస కోసం ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక కాటేజీలు, దైవ సన్నిధి నిర్మాణాల తీరును అభినందించారు.
ఆగమ శాస్త్ర సూత్రాలతో తంజావూరు వంటి వేల ఏళ్ల కిందటి సంప్రదాయ నిర్మాణ కౌశలానికి యాదాద్రి దేవాలయం ప్రాణప్రతిష్ట పోయనుందని అన్నారు. నిర్మాణాల అనంతరం గుట్టపైన వెల్లివిరిసే పచ్చదనంవల్ల ఆలయాల పరిసరాల ఉష్ణోగ్రతలు 4 నుంచి 5 డిగ్రీల వరకు తగ్గే అవకాశం ఉందని వివరించారు.
108 అడుగుల ఆంజనేయ విగ్రహానికి ఆమోదం
యాదాద్రి దేవస్థానం క్షేత్ర పాలకుడిగా 108 అడుగుల భారీ ఆంజనేయస్వామి పాలరాతి విగ్రహ నమూనాకు కేసీఆర్ ఆమోదం తెలిపారు. విగ్రహాన్ని తీర్చిదిద్దేందుకు చైనాకు చెందిన రూపశిల్పులు ముందుకు వచ్చారు. ఈ మేరకు భారీ ఆంజనేయ విగ్రహ నిర్మాణానికి ఆర్కిటెక్చర్ ఆనందసాయి ఆధ్వర్యంలో దేవాలయ కమిటీ సభ్యులు త్వరలో చైనాను సందర్శించనున్నారు. పాలరాతితో తయారు చేసిన నమూనా ప్రతిమను వారికి అప్పగించి భారీ విగ్రహ రూపకల్పనకు నాంది పలుకనున్నారు.