వికార్ గ్యాంగ్ ఎన్‌కౌంటర్‌పై సిట్
- ప్రత్యేక బృందంతో దర్యాప్తునకు కేసీఆర్ నిర్ణయం
వికారుద్దీన్ గ్యాంగ్ ఎన్‌కౌంటర్ విషయంలో కీలక మలుపు. ఎన్‌కౌంటర్‌పై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) నియమించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఉత్తర్వులను సోమవారం జారీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మను ఆదేశించారు. ఎన్‌కౌంటర్ ఘటనపై కొందరు అనుమానాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో పూర్తిస్థాయి దర్యాప్తు జరిపించాలని సీఎం నిర్ణయించారు.
సాక్షి, హైదరాబాద్: వరంగల్-నల్లగొండ జిల్లాల సరిహద్దులో జరిగిన ఉగ్రవాది వికారుద్దీన్ గ్యాంగ్ ఎన్‌కౌం టర్‌పై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) నియమించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను సోమవారం జారీ చేయాలని సీఎస్ రాజీవ్ శర్మను ఆదేశించారు. వికారుద్దీన్ సహా 5 గురు విచారణ ఖైదీల మరణానికి కారణమైన ఈ ఘటనపై కొందరు నేతలు, సంస్థలు అనుమానాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో పూర్తిస్థాయి దర్యాప్తు జరిపించాలని సీఎం నిర్ణయించారు.
ఉగ్రవాదులను ఈ నెల 7న వరంగల్ జైలు నుంచి హైదరాబాద్‌లోని కోర్టుకు తరలిస్తుండగా నల్లగొండ జిల్లా ఆలేర్ సమీపంలో ఎన్‌కౌంటర్ జరిగిన సంగతి తెలిసిందే. మూత్ర విసర్జన పేరుతో వాహనాన్ని నిలిపేలా చేసిన వికారుద్దీన్ గ్యాంగ్ పథకం ప్రకారం ఎస్కార్టు పోలీసుల నుంచి తుపాకీలు లాక్కుని కాల్పులకు యత్నించగా..ఆత్మరక్షణ కోసం జరిపిన ఎదురుకాల్పుల్లో వికార్ ముఠా హతమైందని పోలీసులు చెప్తున్నారు.
అయితే, దీనిపై పౌరహక్కుల సంఘాలతోపాటు ఎంఐఎం పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ, ముస్లిం పెద్దలు ఇటీవల సీఎంను కలిసి ఎన్‌కౌంటర్‌పై న్యాయ విచారణ జరిపించాలని కోరారు. ఈ నేపథ్యంలో సిట్ ఏర్పాటుకు సీఎం నిర్ణయించినట్లు తెలుస్తోంది. డీఐజీ, ఐజీ అధికారి స్థాయిలో ఈ దర్యాప్తు జరిగే అవకాశముంది.