కరువు గండం గట్టెక్కినట్లే
- రబీకి ఢోకా లేదన్న ముఖ్యమంత్రి కేసీఆర్
- మండలాల వారీగా సర్వే చేయాలని ఆదేశం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం తీవ్ర కరువు నుంచి బయటపడినట్లేనని, రాబోయే రెండు మూడు రోజుల్లో కూడా మంచి వర్షాలు పడే అవకాశం ఉందని సీఎం కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. తాజాగా కురుస్తున్న వర్షాలతో చాలా జిల్లాల్లో చెరువులు నిండాయని, భూగర్భ జలాలు పెరిగాయని చెప్పారు. రబీ సీజన్‌కు, మంచినీటికి ఢోకా లేదని పేర్కొన్నారు. ఖరీఫ్‌లో నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో వ్యవసాయం, వర్షాలపై సీఎం అధికారులతో చర్చించారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, ముఖ్య కార్యదర్శులు నర్సింగరావు, శాంతి కుమారి, వ్యవసాయ శాఖ కార్యదర్శి పార్థసారథి, రెవెన్యూ శాఖ కార్యదర్శి బీఆర్ మీనా, నీటి పారుదల శాఖ కార్యదర్శి ఎస్‌కే జోషి, సీఎం అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్ తదితరులు ఇందులో పాల్గొన్నారు. జూన్‌లో వేసిన పంటలకు నష్టం కలిగిందని, జూలైలో వేసిన పంటలు ఈ వర్షాలతో బతికే అవకాశం ఉందని సీఎం పేర్కొన్నారు. అధికారులు మండలాల వారీగా సర్వేలు జరిపి వాస్తవ పరిస్థితి తెలుసుకోవాలని ఆదేశించారు. నష్టం జరిగిన రైతులకు సాయం చేసే విషయంలో ప్రతిపాదనలు తయారు చేయాల న్నారు. మహబూబ్‌నగర్ జిల్లా మినహా అన్ని జిల్లాలలో మంచి వర్షాలు పడుతుండటం శుభ సూచకమని కేసీఆర్ పేర్కొన్నారు.