
'ఆంధ్రావాలా భాగో అని కేసీఆర్ బెదిరించారు'
టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక కొత్తగా చేసిన అభివృద్ధి ఏమీ లేదని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు.
పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్
హైదరాబాద్: టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక కొత్తగా చేసిన అభివృద్ధి ఏమీ లేదని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క, మరో నేత ఎం.కోదండరెడ్డితో కలసి గురువారం ఆయన గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ మెట్రో రైలు, కృష్ణా, గోదావరి జలాలతో హైదరాబాద్‌కు తాగునీరు, శంషాబాద్‌లో విమానాశ్రయం, ఔటర్ రింగురోడ్డు, ఎక్స్‌ప్రెస్ హైవే, ఐటీ, ఫార్మారంగాల అభివృద్ధి వంటివన్నీ కాంగ్రెస్ హయాంలోనే 90 శాతం పూర్తయ్యాయన్నారు. మెట్రో రైలు అలైన్‌మెంటు మార్పు పేరుతో సీఎం కేసీఆర్ తుగ్లక్ నిర్ణయాలు తీసుకున్నారని ఉత్తమ్ విమర్శించారు. మెట్రో రైలును ఆలస్యం చేసిందే కేసీఆర్ అని ఆరోపించారు.
కాంగ్రెస్ వల్లే హైదరాబాద్ అభివృద్ధి చెందిందన్నారు. ఆంధ్రావాలా భాగో అని బెదిరించిన కేసీఆర్ ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకోసం వారిపై కపట ప్రేమను కురిపిస్తున్నారని చెప్పారు. ఏపీ నుంచి వచ్చి స్థిరపడినవారి ఓట్లను తొలగించాలని కేసీఆర్ కుట్రలు చేస్తే అడ్డుకున్నది కాంగ్రెస్‌పార్టీ అని అన్నారు. రాజకీయ అవసరాలకోసం టీఆర్‌ఎస్ ఎంతకైనా దిగజారుతుందని ఉత్తమ్ విమర్శించారు. గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్, మజ్లిస్‌ను ఓడిస్తామని అన్నారు.