మీ వ్యవసాయ విధానం లోపభూయిష్టం | Uttam Kumar Reddy Comments On KCR | Sakshi
Sakshi News home page

మీ వ్యవసాయ విధానం లోపభూయిష్టం

Published Thu, May 21 2020 3:31 AM | Last Updated on Thu, May 21 2020 5:13 AM

Uttam Kumar Reddy Comments On KCR - Sakshi

బుధవారం గాంధీభవన్‌లో వలస కార్మికుల బస్సును జెండా ఊపి ప్రారంభిస్తున్న టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ తదితరులు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెపుతున్న నియంత్రిత పంటల సాగు విధానం లోపభూయిష్టంగా ఉందని, దాని అమలును వచ్చే ఏడాదికి వాయిదా వేయాలని ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ పార్టీ కోరింది. రాష్ట్రంలో వ్యవసాయ పరిస్థితులు, ప్రభుత్వ విధానాలపై చర్చించేందుకు టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్‌ ముఖ్య నాయకుల సమావేశం బుధవారం గాంధీభవన్‌లో జరిగింది. ఈ సమావేశంలో ఏఐసీసీ కిసాన్‌సెల్‌ వైస్‌చైర్మన్‌ ఎం. కోదండరెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు ఎస్‌. అన్వేశ్‌రెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు చల్లా వంశీచందర్‌రెడ్డి, చిన్నారెడ్డి, టీపీసీసీ కోవిడ్‌–19 టాస్క్‌ఫోర్స్‌ కమిటీ చైర్మన్‌ మర్రి శశిధర్‌రెడ్డిలు పాల్గొన్నారు.

సమావేశం అనంతరం ఉత్తమ్‌ విలేకరులతో మాట్లాడుతూ రైతులకు చెందిన అంశాలను నిర్ధారణ చేసేటప్పుడు సమగ్రంగా సంప్రదింపులు జరపాలనే విషయాన్ని కూడా ప్రభుత్వం విస్మరించడం శోచనీయమన్నారు. దీనిపై రైతులు, రైతు సంఘాల ప్రతినిధులు, ప్రతిపక్ష పార్టీలతో చర్చించి సమగ్ర విధానాన్ని రూపొందించాలని, అప్పటివరకు అమలును నిలిపివేయాలని సూచించారు. ప్రస్తుతం సీఎం కేసీఆర్‌ చెపుతున్న వ్యవసాయ విధానాన్ని కాంగ్రెస్‌ పార్టీ వ్యతిరేకిస్తోందన్నారు. తాము చెప్పిన పంటలు వేయకపోతే ‘రైతు బంధు’ఇవ్వబోమని కేసీఆర్‌ చెప్పడం దారుణమని, రైతులను బెదిరించడం సరికాదని ఉత్తమ్‌ వ్యాఖ్యానించారు. అయినా, నాలుగైదు రోజుల్లో విత్తనాలు వేసుకునేందుకు రైతులు సిద్ధపడుతుంటే ఇప్పుడు తాము చెప్పిన పంటలే వేయాలని సీఎం షరతు విధించడం తుగ్లక్‌ చర్య అని అన్నారు.

టీఆర్‌ఎస్‌ పాలనలో తెలంగాణ రైతుల ఆత్మహత్యల్లో దేశంలోనే రెండో స్థానంలో ఉందని, ఇప్పటివరకు రూ.లక్ష రైతు రుణమాఫీ అమలు కాలేదని, 40 శాతం మంది రైతులకు రైతుబంధు అందలేదని ఉత్తమ్‌ ఆరోపించారు. ధాన్యం కొనుగోళ్లలో విఫలమయినందుకు సీఎం కేసీఆర్‌ రైతులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. పత్తి విత్తనాల సరఫరా, కొనుగోలు, ధర నిర్ణయించే అధికారం రాష్ట్రం చేతిలో లేదని, అలాంటప్పుడు పత్తి పంట వేయాలని ఎందుకు చెబుతున్నారని ఉత్తమ్‌ ప్రశ్నించారు. క్వింటాలుకు కనీసం రూ.7వేలు చెల్లించి ప్రభుత్వమే పత్తిని కొనుగోలు చేస్తుందని రైతులకు హామీ ఇచ్చిన తర్వాతే పత్తి పంట సాగుచేయాలని సూచించాలని కోరారు. మొక్కజొన్న రైతులపై ఆంక్షలు పెడితే సహించేది లేదని, రైతుకు నష్టం కలిగే విధంగా ఎలాంటి ప్రతిపాదన తెచ్చినా కాంగ్రెస్‌ పార్టీ పక్షాన ఊరుకునేది లేదని, తీవ్రంగా పోరాడి ప్రతిఘటిస్తామని ఉత్తమ్‌ స్పష్టం చేశారు. 

వలస కార్మికుల బస్సు ప్రారంభం
కాగా, బుధవారం గాంధీభవన్‌ నుంచి బస్సు ఏర్పాటు చేసి కొందరు వలస కార్మికులను ఉత్తరప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు పంపించారు. వారికి ఆహారపదార్థాలు, పండ్లు, మంచినీరు కూడా బస్సుల్లోనే ఏర్పాటు చేశారు. ఈ బస్సులను టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ జెండా ఊపి ప్రారంభించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement