
అమ్మకానికి రంగారెడ్డి కలెక్టరేట్?
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: విలువైన ప్రభుత్వ కార్యాలయాలపై తెలంగాణ సర్కారు దృష్టి సారించింది. మొన్నటి వరకు ఖాళీ స్థలాల వివరాలు సేకరించిన జిల్లా యంత్రాంగం తాజాగా సర్కారీ స్థిరాస్తుల సమాచారాన్ని రాబడుతోంది. హైదరాబాద్ నడిబొడ్డునున్న రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్, జిల్లా పరిషత్ తదితర కాంప్లెక్స్‌ల వేలానికి రంగం సిద్ధం చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
ప్రభుత్వ భవనాల సమగ్ర సమాచారాన్ని రెండు రోజుల్లోగా నివేదించాలని ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ బుధవారం ఆదేశించిన వెంటనే జిల్లా యంత్రాంగం వివరాల సేకరణలో తలమునకలు కావడం ఈ ప్రచారానికి బలం చేకూరుస్తోంది. భూముల అమ్మకంతో రూ. 6,500 కోట్లు సమీకరిస్తామని బడ్జెట్‌లో ప్రస్తావించిన కేసీఆర్ సర్కారు.. ఖరీదైన స్థలాలను వేలం వేయాలని నిర్ణయించింది. ఈ మేరకు జిల్లాలో 300 ఎకరాలను గుర్తించిన రెవెన్యూ యంత్రాంగం ప్రభుత్వానికి నివేదించిన సంగతి తెలిసిందే.
700 భవనాలు.. 900 ఎకరాలు: ఒకేచోట ప్రభుత్వ కార్యాలయాల సముదాయాలను నిర్మించడంలో భాగంగానే ఈ కసరత్తు చేస్తున్నామని ప్రకటించిన సర్కారు.. జిల్లాలో 900 ఎకరాల మేర ఖాళీ జాగా అందుబాటులో ఉందని తేల్చింది. జిల్లావ్యాప్తంగా 700 ప్రభుత్వ భవనాలున్నాయని, ఇంకా చాలా వాటికి పక్కా నిర్మాణాలు లేవని నివేదించింది. ఈ క్రమంలోనే జంట నగరాల్లో కొలువైన రంగారెడ్డి జిల్లా ఆఫీసుల సమాచారాన్ని హైదరాబాద్ జిల్లా రెవెన్యూ అధికారులు సేకరించారు. లక్డీకాపూల్‌లోని కలెక్టరేట్, ఖైరతాబాద్‌లోని జిల్లా పరిషత్ తదితర కార్యాలయాల విలువను అంచనా వేశారు.
పక్కాగా సమాచారం: ప్రభుత్వ భవంతుల సమాచారాన్ని పక్కాగా సేకరించాలని సర్కారు తాజాగా ఆదేశించింది. భవన విస్తీర్ణం, సర్వే నంబరు, ప్రధాన మార్గానికి ఎంత దూరం.. కోర్టు కేసులున్నాయా? తదితర అంశాలపై స్పష్టమైన వివరాలతో బుధవారం లోపు నివేదిక ఇవ్వాలనిపేర్కొంది. ఇదిలావుండగా, ప్రభుత్వ కార్యాలయాలను వేలం వేయనున్నారనే వార్తలను కలెక్టర్ రఘునందన్‌రావు ఖండించారు.
శేరిలింగంపల్లికి కొత్త కలెక్టరేట్?
జంటనగరాల్లో విసిరేసినట్లుగా ఉన్న కలెక్టరేట్, తదితర కార్యాలయాలన్నింటినీ ఒకేచోట నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే శేరిలింగంపల్లి పరిధిలోని హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ సమీపంలో సర్వే నంబర్ 25లోని స్థలాన్ని పరిశీలించింది. సమీకృత కలెక్టరేట్ సముదాయాన్ని నిర్మించడం ద్వారా ప్రజలకు ఊరట కలుగుతుందని అంచనా వేసింది.