
న్యూఢిల్లీ: దేశ సరిహద్దు వ్యూహం, సైన్యం మోహరింపులు, ఆయుధ సేకరణ వంటి కీలక సమాచారాన్ని చైనా గూఢచార విభాగాలకు అందజేశారన్న ఆరోపణలపై రాజీవ్‌శర్మ అనే జర్నలిస్టును ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ జర్నలిస్టుకు భారీగా లంచం ముట్టజెప్పారన్న ఆరోపణలపై చైనా మహిళ, నేపాల్‌కు చెందిన ఆమె స్నేహితుడిని అరెస్టు చేసినట్లు స్పెషల్ సెల్ పోలీసులు తెలిపారు. ‘చైనా నిఘా సంస్థలకు దేశ సమాచారాన్ని చేరవేసినందుకు ఢిల్లీలోని పిటంపురకు చెందిన ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ రాజీవ్‌ను 14న స్పెషల్ సెల్ అరెస్ట్‌చేసింది.
బోగస్ సంస్థల ద్వారా అందిన సొమ్మును రాజీవ్‌కు అందజేసినందుకు చైనా జాతీయురాలితోపాటు నేపాల్ వాసిని అరెస్ట్ చేశాం’ అని ఢిల్లీ డిప్యూటీ కమిషనర్(స్పెషల్ సెల్) సంజీవ్æ తెలిపారు. వీరి నుంచి పెద్ద సంఖ్యలో సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, సున్నిత సమాచారమున్న పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.‘రాజీవ్ 2016 నుంచి మైకేల్ అనే చైనా నిఘా విభాగం అధికారితో సంబంధాలు కొనసాగిస్తున్నాడు. 2018 వరకు కీలక సమాచారాన్ని అతడికి చేరవేశాడు. 2019 నుంచి చైనాకే చెందిన జార్జి అనే మరో నిఘా అధికారికి శర్మ కీలక రక్షణ సమాచారాన్ని అందజేస్తూ వచ్చాడు.
ఇందుకుగాను గత ఏడాదిన్నరలోనే రూ.45 లక్షల వరకు అందుకున్నాడు. సమాచారం అందజేసిన ప్రతిసారీ వెయ్యి డాలర్లు(సుమారు రూ.73 వేలు) ఇతడికి ముడుతుంటాయి’ అని ఆయన తెలిపారు. గతంలో వివిధ పత్రికల్లో పనిచేసి, భారత పత్రికలతోపాటు చైనాకు చెందిన గ్లోబల్ టైమ్స్ పత్రికకు వ్యాసాలు రాస్తున్నాడన్నారు. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(పీఐబీ) గుర్తింపు కూడా ఉన్న ఇతడికి అనేక మంత్రిత్వ శాఖల్లోకి సులువుగా వెళ్లగలిగే అవకాశం ఉందన్నారు. ఈ–మెయిల్ ఐడీ, సామాజిక మాధ్యమాల అకౌంట్ల ద్వారా ఇతడు ఎలాంటి సమాచారాన్ని చైనాకు అందజేశాడనే విషయమై దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment